గర్భ నిరోధక సాధనాలైన బర్త్ కంట్రోలింగ్ పిల్స్ వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయని గతంలో ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. కానీ పిల్స్ వల్ల ఒక మంచి ప్రయోజనం కూడా ఉంటుందని తాజా పరిశోధన వెల్లడించింది. గర్భ నిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల మహిళల్లో ఆస్తమా తీవ్రంగా వచ్చే ప్రమాదం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనాన్ని థొరాక్స్ జర్నల్‌లో ప్రచురించారు. పరిశోధనల్లో గుర్తించిన రక్షణ ప్రభావం చాలా తక్కువగా ఉందని తెలిపారు. ప్రొజెస్టోజెన్ హార్మోన్ మాత్రమే ఉండే పిల్స్ వాడకాన్ని వారు పరిగణనలోకి తీసుకోలేదు. స్వీడన్‌లోని గోథెన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఈ పరిశోధన చేశారు. ఫిమేల్ సెక్స్ హార్మోన్లు ఆస్తమా తీవ్రతలో స్పష్టమైన తేడాలను వివరిస్తాయని వారు తెలిపారు.
మహిళల్లో సింథటిక్ సెక్స్ హార్మోన్ల ప్రభావం ఆస్తమాపై ఎలా ఉంటుందనే అంశంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు నిపుణులు ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. తాజా పనిశోధనలో వివిధ రకాల హార్మోనల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడకం ప్రభావం ఆస్తమాపై ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు. బరువు (BMI), సిగరెట్ తాగే అలవాటు ప్రభావాలను కూడా వారు అన్వేషించారు. పునరుత్పత్తి వయస్సు (16-45) ఉన్న మహిళలపై చేసిన ఈ అధ్యయనం కోసం ఆప్టిమం పేషెంట్ కేర్ రీసెర్చ్ డేటాబేస్ (OPCRD) నుంచి సమాచారాన్ని సేకరించారు.
హెల్త్ డేటాను ట్రాక్ చేశారు
బ్రిటన్‌లోని 630 ప్రైమరీ కేర్ ప్రాక్టీస్ సెంటర్ల (హాస్పిటళ్లు) నుంచి OPCRD సమాచారాన్ని సేకరిస్తుంది. ఇందులో ఆరు మిలియన్లకు పైగా రోగుల ఆరోగ్య సమాచారం ఉంది. ఆసుపత్రిలో చేరినవారు, అత్యవసర చికిత్స తీసుకున్నవారు, ఆస్తమా నివారణకు వైద్యం చేయించుకున్న వారి హెల్త్ రికార్డులను పరిశోధకులు సేకరించారు. 2000వ సంవత్సరం నుంచి 2016 చివరి వరకు మొత్తం 83,084 మంది మహిళల ఆరోగ్య పరిస్థితిని వారు ట్రాక్ చేసి విశ్లేషించారు.
వయసుతో పాటు పెరుగుతున్న ప్రమాద తీవ్రత
హార్మోనల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ (ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ రెండూ కలిపి ఉండేవి; ప్రొజెస్టోజెన్ మాత్రమే ఉండేవి)ను ఒకటి నుంచి రెండు సంవత్సరాలు, మూడు నుంచి నాలుగు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం వాడే వారి ఆరోగ్యాన్ని పిల్స్ వాడని వారితో పోల్చి చూశారు. అధ్యయనం ప్రారంభంలో మూడో వంతు (సుమారు 34 శాతం) మంది మహిళలు హార్మోనల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతున్నారు. 25 శాతం మంది ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ రెండూ ఉండే పిల్స్ వాడేవారు ఉన్నారు. తొమ్మిది శాతం మంది ప్రొజెస్టోజెన్ మాత్రమే ఉండే పిల్స్ వాడుతున్నారని గుర్తించారు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్న మహిళలు వయసు పెరగడం, BMI పెరుగుదల, ఎక్కువసార్లు ప్రసవించడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఆస్తమా వ్యాపించే అవకాశాలు తక్కువ
అసలు పిల్స్ వాడని మహిళలతో పోలిస్తే, వాటిని వాడేవారికి తీవ్రమైన ఆస్తమా ప్రమాదం ఉండదని అధ్యయనం ద్వారా గుర్తించారు. కానీ ఒకటి- రెండు సంవత్సరాలు పిల్స్ వాడకం ఆస్తమా ప్రమాదాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. మూడు నుంచి నాలుగు సంవత్సరాలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పిల్స్ వాడుతున్న వారు తీవ్రమైన ఆస్తమా బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని తేల్చారు. "సింథటిక్ సెక్స్ హార్మోన్లు ఆస్తమాను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. దీనికి సంబంధించిన బయోలాజికల్ ప్రాసెస్‌ను అన్వేషించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం" అని అధ్యయన బృందం పేర్కొంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.