నేటి తరం సోషల్ మీడియాలోనే ఎక్కువ కాలం గడుపుతోంది. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు తమ సంతోషాన్ని, బాధను సోషల్ మీడియా ద్వారా ఇతరులకు పంచుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో, అన్ని అనర్థాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే, సోషల్ మీడియా వాడకానికి సరైన వయసేంటి? తల్లిదండ్రులు తమ పిల్లలను సోషల్ మీడియాలో ఏ వయస్సులో అనుమతించాలి? అనే ప్రశ్నపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నకు అనేక మంది నుంచి భిన్నమైన సమాధానాలు వస్తున్నాయి. కొంతమంది 8 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయవచ్చని వాదిస్తుండగా, మరికొందరు 15 ఏళ్ళ వయసు వచ్చే వరకు సోషల్ మీడియాలో అనుమతించరాదని స్పష్టం చేస్తున్నారు. అయితే, చాలా మంది పిల్లలు 15 ఏళ్ల వయసులోపే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లలో యాక్టివ్ గా ఉంటూ వాటికి అడిక్ట్ అవుతున్నారని అనేక అధ్యయనాల్లో తేలింది. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత దృష్ట్యా వారి సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించుకోవాలి.
చిన్న వయస్సులో సోషల్ మీడియా వాడితే అనేక సమస్యలు
ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం తప్పనిసరైంది. ఇదే అదునుగా, పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి మొబైల్ ఫోన్లను తీసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లలో రహస్యంగా అకౌంట్లను క్రియేట్ చేసుకుంటున్నారు. తర్వాత వారు క్రమంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్ గా ఉండి దానికి అడిక్ట్ అవుతున్నారు. దీనికి వారికి ఎక్కువ సమయం పట్టడం లేదు. అయితే, చాలా మంది పిల్లలు తాము సోషల్ మీడియా వాడుతున్నట్లు తల్లిదండ్రులకు తెలియకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానానంతో అనేక ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా పిల్లలు వారి తల్లిదండ్రులను సులభంగా మోసం చేస్లున్నారు. అటువంటి వాటిని నివారించడానికి, మీ పిల్లలకి సరైన వయస్సులోనే స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం మంచిది. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో మీ పిల్లలను సోషల్ మీడియా సైట్లను యాక్సెస్ చేయడానికి అనుమతించినప్పటికీ వారు స్మార్ట్ ఫోన్లలో ఏం చేస్తున్నారో నిఘా పెట్టండి.
సోషల్ మీడియా వాడకానికి సరైన వయస్సు ఇదే..
సోషల్ మీడియాలో అన్ని వయసుల వ్యక్తులు ఉంటారు. అంతేకాక, అన్ని రకాల కంటెంట్ అక్కడ సర్క్యులేట్ అవుతోంది. అందువల్ల మీ పిల్లలకు కొంత మెచ్యూరిటీ వచ్చాకే సోషల్ మీడియా యాక్సెస్ కు అనుమతించడం మంచింది. 13 ఏళ్ల వయసులో మీ పిల్లలను సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం చేయడం ఉత్తమం. అయినప్పటికీ, మీ పిల్లల సోషల్ మీడియా అకౌంట్లపై ఒక కన్నేసి ఉంచడం మర్చిపోకండి. సాధారణంగా ఈ వయసులో పిల్లలు తమకు మొబైల్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తుంటారు. అయితే, ఈ వయస్సులో వాటిని నియంత్రించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ వయస్సులో పిల్లలను సోషల్ మీడియాలో అకౌంట్లు సృష్టించడానికి అనుమతించకపోయినా, వారు రహస్య మార్గాలను కనుగొంటారు. అటువంటి పరిస్థితిని నివారించడానికి మీరు వారికి సోషల్ మీడియా యాక్సెస్ కల్పిస్తూనే వారి కార్యకలాపాలపై నిఘా పెట్టడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Children, Social Media