సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని అనర్థాలు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కువ సేపు గడపడం ద్వారా అనేక సమస్యలు వస్తాయని, తద్వారా మనిషి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ అవ్వడానికి, ఎప్పటికప్పడు అప్డేట్గా ఉండటానికి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతున్నప్పటికీ, ఇది వ్యక్తులలో ఒంటరితనం, డిప్రెషన్‌కు కారణమవుతుంది. తద్వారా అనేక మందిలో మందిలో నిద్ర లేమికి కారణమవుతుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
తాజాగా, ‘అసోసియేషన్ ఆఫ్ స్క్రీన్ టైమ్ అండ్ డిప్రెషన్ ఇన్ అడోల్సెంట్’ అనే టాపిక్‌పై సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్న ఏడవ తరగతి విద్యార్థులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. దీనిలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశీలనలో భాగంగా ప్రతి గంటకు వారిలో డిప్రెసివ్ సింప్టమ్స్ గణనీయంగా పెరిగాయని ఈ అధ్యయనం తేల్చింది. అంతేకాక, వారిలో ఒంటరితనం, విచారం, నిస్సహాయత వంటి అనేక లక్షణాలు బయటపడ్డాయి. అయితే, డిప్రెషన్‌కు సోషల్ మీడియా ప్రధాన కారణమని అధ్యయనం నేరుగా నిర్ధారించనప్పటికీ, కౌమార దశలో ఉన్న పిల్లల్లో సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించాలని మాత్రం సూచించింది.
సోషల్ మీడియాతో వచ్చే దుష్ప్రభావాలు
వెనకబడిపోతున్నామనే భయం
మీ కంటే ఇతర వ్యక్తులు ఎక్కువ ఆనందిస్తున్నారని, మీ కంటే వారు మంచి జీవితాలను గడుపుతున్నారు అనే భావన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వాడుతున్న వారిలో తరచుగా వస్తుంది. ఈ నెగెటివ్ ఆలోచన మీ ఆత్మగౌరవంపై ఎక్కువ ప్రభావాన్ని చూపడమే కాకుండా మీలో ఆందోళనను ప్రేరేపిస్తుంది.
ఒంటరితనం
ఫేస్బుక్, స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లు మీలో ఒంటరితనం అనే భావాలను పెంచుతాయి.
నిరాశ మరియు ఆందోళన
మానవ సంబంధాల కంటే సోషల్ మీడియాకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మీలో ఆందోళన, నిరాశ వంటి మానసిక రుగ్మతలు పెరిగే ప్రమాదం ఉంది.
సైబర్ బెదిరింపులు
సోషల్ మీడియాలో బెదిరింపులకు గురికావడం లేదా మానసిక హింసకు గురికావడం వంటివి ఈ మధ్య కాలంలో పెరుగుతున్నట్లు అనేక నివేదికలు పేర్కొన్నాయి.
సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాలను తగ్గించే మార్గాలు
1. ఆన్లైన్లో ఎక్కువ సేపు గడపకండి.
2. మీరు సోషల్ మీడియాలో ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో తెలుసుకోవడానికి యాప్‌ను ఉపయోగించండి. ఎక్కువ సమయం ఇంటి పనుల్లో లీనమవ్వండి.
3. మీ ఫోన్లో సోషల్ మీడియా నోటిఫికేషన్లను డిజేబుల్ చేసుకోండి.
4. సోషల్ మీడియా నోటిఫికేషన్లను నిలిపివేయడం వల్ల మీరు తరచుగా వాటిని చెక్ చేసుకునే అలవాటును నివారించవచ్చు.
5. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి.
6. కుటుంబం, స్నేహితులతో మీ మనస్సు విప్పి మాట్లాడండి. ప్రతి చిన్న సంఘటనను ఫోటోలు తీయడం మానేయండి.
7. నెగెటివ్ ఫీలింగ్స్‌ను లేదా భయాలను నివారించడానికి మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. మీ సృజనాత్మకత, నైపుణ్యాలను పెంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోండి.