Lab grown meat: కృత్రిమ మాంసానికి సింగపూర్ అనుమతి.. కోళ్లు, మేకలతో ఇక పనిలేదు..

కృత్రిమ మాంసం

Lab grown meat: ఈట్ జస్ట్ అనే యూఎస్‌ స్టార్టప్‌ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన చికెన్‌ను అమ్మేందుకు సింగపూర్ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కృత్రిమ మాంసం వినియోగానికి అధికారింగా అనుమతిచ్చిన మొదటి దేశంగా సింగపూర్‌ నిలిచింది.

  • Share this:
చికెన్ కావాలంటే.. కోళ్లు ఉండాలి. మటన్ కావాలంటే మేకలు ఉండాలి. బీఫ్ కావాలంటే ఎద్దులు ఉండాలి. కానీ ఇకపై ఈ కోళ్లు, మేకలు, ఎద్దులతో పనిలేకుండానే మాంసం లభించనుంది. ప్రయోగశాలల్లో కృత్రిమ మాంసాన్ని తయారుచేస్తున్నారు. ల్యాబ్‌లలో మాంసాన్ని అభివృద్ధి చేసేందుకు ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మారుతున్న జీవన శైలితో పోషకాహారం అవసరంపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. మరోవైపు మాంసం కోసం జంతువులను చంపడాన్ని ఎన్నో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ల్యాబ్‌ మీట్‌పై పరిశోధనలు ఊపందుకున్నాయి. సహజంగా లభించే మాసంలో ఉండే ప్రోటీన్లు, పోషకాలు వాటిలోనూ ఉండేలా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా ఈట్ జస్ట్ (Eat Just) అనే యూఎస్‌ స్టార్టప్‌ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన చికెన్‌ను అమ్మేందుకు సింగపూర్ (Singapore) ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కృత్రిమ మాంసం వినియోగానికి అధికారింగా అనుమతిచ్చిన మొదటి దేశంగా సింగపూర్‌ నిలిచింది. ఆరోగ్యం, పర్యావరణం, జంతువుల సంరక్షణపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా.. సాధారణ మాంసానికి ప్రత్యామ్నాయాల కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు మొక్కల ఆధారిత మాంసాన్ని, క్లీన్ కల్చర్డ్ మీట్‌ను అభివృద్ధి చేసి సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు సప్లై చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. తాజాగా వార్తల్లో నిలుస్తున్న ఈ క్లీన్ లేదా కల్చర్డ్ మీట్‌ను ప్రయోగశాలలో జంతువుల కండరాల కణాల నుండి అభివృద్ధి చేశారు.

* మామూలు ధరల్లోనే..
జంతు కణాల నుంచి అభివృద్ధి చేసిన, మంచి నాణ్యత ఉన్న మాంసాన్ని అమ్ముకునేందుకు సింగపూర్ ప్రభుత్వం అనుమతిచ్చినట్లు ఈట్ జస్ట్ సంస్థ బుధవారం ప్రకటించింది. ఈ చికెన్‌ను నగ్గెట్స్‌గా అమ్మనున్నారు. గతంలో వీటి ధరను ఒక్కొక్కదానికి 50 డాలర్లుగా నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఖర్చు తగ్గిందని, ప్రీమియం చికెన్‌ ధరతో సమానంగా నగ్గెట్స్ ధరలు ఉంటాయని ఈట్ జస్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జోష్ టెట్రిక్ చెబుతున్నారు.

* కొనసాగుతున్న పరిశోధనలు
2021 చివరినాటికి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ సాధించాలని ఈట్ జస్ట్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే ఈ చికెన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా కంపెనీలు ల్యాబ్‌లో చేపలు, బీఫ్‌, చికెన్‌లను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నాయి. ఆ ఆల్టర్నేటివ్ మీట్ మార్కెట్‌కు రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 2029 నాటికి ఈ ఉత్పత్తుల మార్కెట్ విలువ 140 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని బార్క్లేస్ సంస్థ అంచనా వేస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published: