Dengue Fever: అసలే థర్డ్ వేవ్ భయం.. విరుచుకుపడుతున్న డెంగీ.. ఈ టైంలో తాజా గుడ్‌న్యూస్ ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అపరిశుభ్ర వాతావరణం కారణంగా ఈగలు, దోమలు వర్షాకాలంలో రకరకాల వ్యాధులను వ్యాపింపజేస్తుంటాయి. మరీ ముఖ్యంగా దోమల కారణంగా వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ఎక్కువగా ప్రబలుతుంటాయి.

 • Share this:
  వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అపరిశుభ్ర వాతావరణం కారణంగా ఈగలు, దోమలు వర్షాకాలంలో రకరకాల వ్యాధులను వ్యాపింపజేస్తుంటాయి. మరీ ముఖ్యంగా దోమల కారణంగా వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ(dengue) వంటి వ్యాధుల ఎక్కువగా ప్రబలుతుంటాయి. ఈ కరోనా కాలంలో రోగ నిరోధక శక్తి అసలే అంతంత మాత్రంగా ఉంటోంది. దీనికి తోడు.. ఇలాంటి జ్వరాలు ప్రబలాయంటే ఇక అంతే సంగతులు. సీజనల్ వ్యాధి అయిన డెంగీ ఇప్పటికే చాలామందిని బలి తీసుకుంది. కరోనా అంత కాకపోయినా డెంగీ కూడా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో.. డెంగీ నివారణకు శాస్త్రవేత్తలు చేసిన తాజా ప్రయోగాలు విజయవంతం కావడం కాస్త ఊరట కలిగించే అంశం. కరోనా థర్డ్ వేవ్ విరుచుకుపడనుందన్న ఈ తరుణంలో డెంగీని నిరోధించే మందు రావడం చెప్పుకోతగ్గ విషయమే. డెంగీని అంతమొందించే చర్యల్లో భాగంగా వైరస్‌ను వ్యాప్తి చేసే దోమలకు ఒక బాక్టీరియాను ఎక్కించారు. దీని ద్వారా దోమల శరీరంలో వైరస్ వృద్ధి చెందే సామర్థ్యాన్ని తగ్గించారు. ఈ పద్ధతితో డెంగీ కేసుల సంఖ్యను భారీగా తగ్గించగలిగామని వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.

  ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 39 కోట్ల మంది డెంగీ బారిన పడుతున్నారని అంచనా. ఇంతటి ప్రమాదకరమైన వైరస్‌ను నిర్మూలించడానికి తాజా పరిశోధన తోడ్పడుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు “వోల్బాచియా” అనే బాక్టీరియాను ఉపయోగించారు. దీన్ని దోమ శరీరంలోకి పంపించిన తరువాత, దాని శరీరంలో డెంగీ వైరస్ వృద్ధి చెందే సామర్థ్యం చాలా వరకు తగ్గుతుంది. ఈ ప్రయోగాన్ని ఇండోనేషియాలోని యోగ్యకర్త నగరంలో నిర్వహించారు. ఇప్పుడు ఇదే మోడల్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రపంచంలోని 141 దేశాల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్, అమెరికాలో ఈ వ్యాధి ఎక్కువగా విజృంభిస్తోంది. ప్రపంచ జనాభాలో 40 శాతానికి పైగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం హెచ్చరిస్తోంది.

  డెంగీతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 25,000 మంది చనిపోతున్నారు. దీంతో కేసులు, మరణాల సంఖ్యను తగ్గించేందుకు వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం పరిశోధనలు చేస్తోంది. డెంగ్యూ, చికెన్‌గున్యా, జికా, ఎల్లో ఫీవర్.. వంటి వైరస్‌లను వ్యాప్తి చేసే ఏడెస్ ఈజిప్టీ దోమలలో వోల్బాచియా అనే బాక్టీరియాను ప్రవేశపెట్టి, అవి వైరస్‌ను వ్యాప్తి చేసే సామర్థ్యాన్ని తగ్గించడంపై వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం కొన్నేళ్లుగా పనిచేస్తోంది. ముందు కొన్ని దోమలకు ఈ వోల్బాచియాను ఎక్కిస్తారు. బయటకు వదిలిన తరువాత ఇవి ప్రకృతిలో ఉండే దోమలతో సంతానోత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో వోల్బాచియా ఉండే దోమల శాతం మరింత పెరుగుతుంది. దీంతోపాటు వైరస్‌లను వృద్ధిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ వైరస్‌ కారణంగా సోకే వ్యాధుల భారాన్ని తగ్గించడానికి సురక్షితమైన, సమర్థవంతమైన, దీర్ఘకాలిక పరిష్కారాన్ని సంస్థ అందిస్తుంది. ఈ సంస్థ యోగ్యకర్తలో మూడేళ్ల పాటు నిర్వహించిన ట్రయల్ ఫలితాలు డెంగ్యూను నియంత్రించడంలో వోల్బాచియా మోడల్‌ సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తున్నాయని తెలిపింది.

  ఇది కూడా చదవండి: Genetically Modifying Mosquitoes: కొన్ని రోజుల్లో మనల్ని దోమలు ఏమీ చేయలేవు.. ఎందుకంటే..

  తాజా ప్రయోగాన్ని వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం, దాని అనుబంధ సంస్థలు నిర్వహించాయి. ఇందులో భాగంగా యోగ్యకర్తలోని 26 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో క్లస్టర్ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్ నిర్వహించారు. వోల్బాచియా ఉన్న ఈడెస్ ఈజిప్టి దోమలను వదిలిన ప్రాంతాలను, ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు.. డెంగీ కేసులు తగ్గుతాయో లేదో తేల్చాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అధ్యయనం నిర్వహించే ప్రాంతాన్ని 24 క్లస్టర్లుగా విభజించారు. వాటిలో 12 ప్రాంతాల్లో వోల్బాచియా కలిగిన దోమలను విడుదల చేశారు. మిగతా ప్రాంతాల్లో ఎప్పటిలాగే సాధారణ డెంగీ నియంత్రణ పద్ధతులను పాటించారు. ఇలా 27 నెలల పాటు ఈ ప్రాంతాల్లో డెంగీ కేసుల సంఖ్యను పర్యవేక్షించారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే.. వోల్బాచియా ఉన్న దోమలను వదిలిన ప్రాంతాల్లో మొత్తం డెంగీ కేసుల సంఖ్య 77 శాతం తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. వైరస్ సోకిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం సైతం 86 శాతం తగ్గడం విశేషం. ఈ అధ్యయనం ఫలితాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు.
  Published by:Sambasiva Reddy
  First published: