అధిక బరువు ఎన్నో అనర్థాలకు హేతువు. ఏం చేసైనా సరే బరువు తగ్గించుకోవాల్సిందే. కొందరు ఉదయాన్నే లేచి జిమ్‌కి వెళ్లి చెమటలు కక్కించుకోవాలనుకుంటారు. కానీ ఉదయాన్నే లేవడానికే ఆసక్తి చూపించరు. ఇక జిమ్‌కి వెళ్లాలనే ఆలోచన... అటకెక్కుతుంది. కానీ... జిమ్‌కి వెళ్లకపోయినా... కనీసం పరుగులు పెట్టమంటున్నారు ఫిట్నెస్ డాక్టర్లు. పరుగు కూడా వ్యాయమమే. ఉదయం వేళ పరుగెత్తడం ద్వారా కొవ్వు నిల్వలు సులభంగా కరుగుతాయి. మొత్తం శరీరమంతా కదులుతుంది. బాడీలో వేడి పెరిగి... పనికిమాలిన కొలెస్ట్రాల్ కరిగిపోయి, చమట ఇతర వ్యర్థాల రూపంలో బయటకు పోతుంది. ఐతే... జాగింగ్ చెయ్యడానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..
1.ఒకేసారి పరుగు అందుకోకూడదు. ముందు వేగంగా నడవడం మొదలుపెట్టాలి. ఇలా రెండు రోజులు చేయండి. తర్వాత వేగాన్ని పెంచి నెమ్మదిగా పరుగెత్తి, ఆ తర్వాత వేగంగా నడవండి. రెండు, మూడు రోజుల తర్వాత నెమ్మదిగా పరుగెత్తడం మొదలు పెట్టండి. తద్వారా పరుగు పెట్టడం కష్టంగా అనిపించకుండా... దానికి మీ శరీరం అలవాటవుతుంది.
2.బాగా అలసట వచ్చే వరకూ పరుగెత్తకూడదు. అలసట వస్తేనే బాగా పరిగెత్తినట్లు అని కొంత మంది ఫీలవుతుంటారు. అది నిజం కాదు. పరిగెత్తినప్పుడు అలసట వస్తే... ఓ రెండు నిమిషాలు ఆగడం మంచిది. ఎందుకంటే అధిక బరువు ఉన్నవారు... ఎక్కువ దూరం పరిగెత్తలేరు. వెంటనే అలసట వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కాసేపు ఆగడంలో తప్పేమీ లేదు. ఐతే... రోజురోజుకూ ఎక్కువ దూరం పరిగెత్తేందుకు ప్రయత్నించాలి. పరిగెత్తేటప్పుడు గాలి ఎక్కువగా పీల్చుకోవడం అలవాటు చేసుకోవాలి.
3.పాదాలకు సపోర్ట్‌గా ఉండే స్పోర్ట్స్ షూస్నే వేసుకోవాలి. ఎందుకంటే... పరిగెత్తేటప్పుడు ఏ రాయో కాలికి తగిలితే... పడిపోయే ప్రమాదం ఉంటుంది. అదే స్పోర్ట్స్ షూస్ ఉంటే... అవి చాలా వరకూ పడిపోకుండా, రాళ్లు తగిలినా ఇబ్బంది లేకుండా చేస్తుంటాయి. అలాగే... పాదాలకూ రక్షణ కల్పిస్తాయి. తెల్లవారు జామున జాగింగ్ చేసేటప్పుడు పురుగులు, పాముల వంటివి అడ్డు తగిలే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో స్పోర్ట్స్ షూస్ ప్రాణాపాయం నుంచీ కాపాడతాయి.
4.పరుగుకు ముందు గ్లాసు మంచి నీళ్లు తాగండి. వాటర్ తాగడం వల్ల ఎక్కువ దూరం పరుగెత్తలేకపోయినా... క్రమంగా అలవాటవుతుంది. పరుగు మధ్యలో దాహం వేస్తే, తాగొచ్చు. పరుగెత్తడం మీ దినచర్యలో భాగంగా అయ్యాక నాజుగ్గా తయారవడమే కాకుండా చురుగ్గా కూడా ఉంటారు. ఒక్కసారి మీ బరువు మీ కంట్రోల్ లోకి వచ్చేసిందంటే... ఇక మీ జీవితం ఎంతో ఆరోగ్యంగా సాగడం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fitness, Health, Health Tips, Tips For Women, Women health