హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Dengue Prevention Tips: డెంగీ జ్వరం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Dengue Prevention Tips: డెంగీ జ్వరం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dengue Fever Symptoms and Prevention Tips: డెంగీ వైరస్ బారిన పడిన వారికి సాధారణంగా తీవ్ర స్థాయిలో జ్వరం వస్తుంది. తలనొప్పి భరించలేనట్లుగా వేధిస్తుంది. దీంతోపాటు కంటి నొప్పి, ఎముక, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటాయి.

Dengue Fever Symptoms and Prevention Tips: ప్రజలు, ప్రభుత్వాలు కరోనా నివారణ పనుల్లో నిమగ్నమయ్యి సీజనల్ వ్యాధుల గురించి మర్చిపోయాయి. వీటిల్లో డెంగీ జ్వరం ముఖ్యమైన, ప్రాణాంతకమైన వ్యాధి. సాధారణంగా దీని వ్యాప్తి వర్షాకాలం ముగిసే సమయానికి మొదలవుతుంది. డెంగీ జ్వరం దోమల వల్ల కలిగే వైరల్ వ్యాధి. ఏడిస్ దోమ కాటు ద్వారా డెంగీ వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. ఇది శరీర అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. డెంగీ బారిన పడినవారికి తేలికపాటి వ్యాధి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. డెంగీ బారిన పడిన వారిలో 75 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) చెబుతోంది. 20 శాతం మందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మిగతా ఐదు శాతం మందిలో తీవ్రమైన లక్షణాలు ఉండవచ్చు. వీరిలో వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

డెంగీ జ్వరం లక్షణాలు

డెంగీ వైరస్ బారిన పడిన వారికి సాధారణంగా తీవ్ర స్థాయిలో జ్వరం వస్తుంది. తలనొప్పి భరించలేనట్లుగా వేధిస్తుంది. దీంతోపాటు కంటి నొప్పి, ఎముక, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటాయి. వికారంగా అనిపించడం, వాంతులు, చర్మంపై దద్దుర్లు వంటి ఇతర అనారోగ్యాలు ఎదురవుతాయి. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదు. సరైన సమయంలో చికిత్స అందిస్తే ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. తద్వారా డెంగీ మరణాల రేటు కూడా తగ్గుతుంది.

నివారణ మార్గాలు

డెంగీ జ్వరం బారిన పడకుండా కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

1. దోమ తెర వాడకం- డెంగీ దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. అందువల్ల దోమకాటుకు దూరంగా ఉండాలంటే నిద్రపోయేటప్పుడు దోమ తెరను ఉపయోగించాలి.

2. మస్కిటో రెపెల్లెంట్ లోషన్లు- దోమలు మన దగ్గరికి రాకుండా మస్కిటో రెపెల్లెంట్లు కాపాడుతాయి. పడుకునేముందు దోమలు ఎక్కువగా కుట్టడానికి అవకాశం ఉండే ప్రాంతాల్లో వీటిని రాసుకోవాలి. గాయాలు ఉన్న దగ్గర దీన్ని రాయకూడదు.

3. శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు- దోమ కాటును నివారించడానికి శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ఫుల్ హ్యాండ్ షర్టులు, పొడవైన ప్యాంటు ధరించడం మంచిది.

4. పరిసరాల పరిశుభ్రత- నివాస ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెందకుండా చూసుకోవాలి. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి, వాటి సంతతిని పెంచుకుంటాయి. అందుకే ఇంటి చుట్టూ నీరు, డ్రైనేజీ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి.

5. దోమలను ఇంట్లోకి రానివ్వొద్దు- రోజూ సాయంత్రం, సూర్యాస్తమయానికి ముందు ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయాలి. దోమలు సాయంత్రం వేళల్లోనే చురుగ్గా ఉంటాయి. ఆ సమయం నుంచే అవి ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

6. ఖాళీ డబ్బాలు, కుండలు తనిఖీ చేయండి- ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ కుండలు, కంటైనర్లు, పాత బకెట్లు, ఇతర డబ్బాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నీరు నిల్వ ఉండకుండా శుభ్రపరచండి. అలాంటి వాటి కారణంగానే దోమలు సంతతిని పెంచుకుంటాయి.

7. కూలర్లు, చెత్త డబ్బాలను శుభ్రం చేయండి- ఇంట్లో నిత్యం వినియోగించే కూలర్లు, డస్ట్ బిన్‌లు క్రమం తప్పకుండా శుభ్రపరచండి. కీటకాలు, దోమలు ఇలాంటి వాటిల్లో పోగయ్యే అవకాశం ఉంది.

8. ఇతర చిట్కాలు- దోమలను దూరంగా ఉంచేందుకు ఇంట్లో తేలికపాటి కర్పూరాన్ని వెలిగించండి. దీంతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులు, మెషిన్లను వాడటం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా కాపాడుకోవచ్చు.

First published:

Tags: Dengue fever, Health Tips

ఉత్తమ కథలు