మనలో చాలా మందికి సాయంత్రం వేళ పానీపూరీ తినే అలవాటు ఉంటుంది. అలా సరదాగా బయటకు వెళ్లి.. తోపుడు బండి మీద అమ్మే.. పానీపూరీ తింటుంటారు. ఐతే ఈ సీజన్లో పానీపూరీ (Panipuri) తింటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైఫాయిడ్ (Typhoid) వంటి రోగాలకు పానీపూరీయే కారణమని చెబుతున్నారు. తెలంగాణ (Telangana) ఆరోగ్యశాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ సీజన్లో ప్రజలు పానీపూరీ తినకపోవడమే మంచిదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. లేదంటే అనారోగ్యం పాలవుతారని ఆయన హెచ్చరించారు.
'టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులు. టైఫాయిడ్‌కి మరోపేరు పానీపూరీ డిసీస్ అని చెప్పుకోవచ్చు. రుచి ఎక్కువగా ఉంటుందని జనాలు ఎక్కువగా తింటారు. దీని వల్లే సమస్య వస్తుంది. ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. మిగతా సమయంలో టైఫాయిడ్ ఇంతలా ఉండదు. పానీపూరీ నిర్వాహకులు కూడా శుచి శుభద్రత పాటించాలి. ఇందులో కాచివడపోసిన నీటినే వినియోగించాలి. దోమలు, ఈగలు లేకుండా చూడాలి. ఈ టైమ్‌లో పానీపూరీతో పాటు తోపుడుబండ్ల మీద అమ్మే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పది పదిహేను రూపాయల పానీపూరీతో అనారోగ్య సమస్య వల్ల రూ. 5వేలు ఖర్చవచ్చు.' అని శ్రీనివాస్ పేర్కొన్నారు.
#Telangana లో పానీపూరీ కారణంగా సుమారు 2,700 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ టైఫాయిడ్‌కు ‘పానీపూరీ డిసీజ్’ అని నామకరణం చేశామన్నారు. కామెర్లు, ప్రేగులలో మంటకు కారణమయ్యే పానీపూరీని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని సూచించారు. pic.twitter.com/GVTiBnooFF
— AIR News Hyderabad (@airnews_hyd) November 24, 2022
పానీపూరీకి, టైఫాయిడ్‌కు సంబంధమేంటి?
టైఫాయిడ్‌ను గోల్గప్పా డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి సాల్మొనెల్లా టైఫి అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మయోక్లినిక్ కథనంప్రకారం.. ఈ బ్యాక్టీరియా నోటి ద్వారా కడుపులోకి చేరుతుంది. తద్వారా ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ బ్యాక్టీరియా వర్షాకాలంలో మరింత చురుకుగా ఉంటుంది. ఎవరైనా టైఫాయిడ్ సోకి వ్యక్తులు పానీపూరీ నీటిను తాగితే.. అది సులభంగా కలుషితమవుతుంది. ఆ నీటిని ఇతరులు తాగితే వారికి కూడా టైఫాయిడ్ వస్తుంది. టైఫాయిడ్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతుంది. అలసట పెరుగుతుంది. చర్మం పాలిపోతుంది. ఒక్కోసారి రక్తపు వాంతులు అవుతాయి. అంతర్గత అవయాల్లో రక్తస్రావం జరిగే ప్రమాదముంది. పరిస్థితి విషమిస్తే.. ప్రాణాలు కూడా పోవచ్చు.
వైవాహిక జీవితంలో సమస్య వస్తే గుండెపోటు..? అధ్యయనం వివరణ..
యాంటీబయాటిక్ చికిత్స తర్వాత టైఫాయిడ్ నయమవుతుంది. ఐనప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి పూర్తిగా నయమైనా.. ఆ వ్యక్తులు ఇతర వ్యక్తులను కలిస్తే.. వారి నుంచి వీరికి టైఫాయిడ్ సోకవచ్చు. టైఫాయిడ్ లక్షణాలు లేకున్నప్పటికీ.. వారి మల మూత్రాల నుంచి ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. అందుకే టైఫాయిడ్ రోగులతో పాటు వ్యాధి నుంచి కోలుకున్న వారికి కూడా దూరంగా ఉండాలి. టైఫాయిడ్ సోకిన వ్యక్తి టాయిలెట్ తర్వాత సరిగ్గా చేతులు కడుక్కోకుండా... ఆహారం లేదా త్రాగే నీటిని తాకినట్లయితే.. అది ఇతర వ్యక్తులకు సులభంగా వ్యాపిస్తుంది.
ఆహారం తినే ముందు, మలవిసర్జన తర్వాత చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. బయట తిరిగి వచ్చిన తర్వాత.. కాళ్లు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. దగ్గినప్పుడు, తుమ్మేటప్పుడు నోటికి అడ్డంగా కర్చీఫ్లాంటివి పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకుంటే మరీ మంచిది. ముఖాన్ని పదే పదే తాకడం మానుకోవాలి. స్ట్రీట్‌ఫుడ్ ఎక్కువగా తినవద్దు. ముఖ్యంగా వీధుల్లో లభించే ద్రవరూప పదార్థాలకు దూరంగా ఉండాలి. అంటే పానీపూరీ లాంటి వాటిని వర్షాకాలంలో తినకపోవడమే మంచిది. చల్లటి పదార్థాలను బయట ఎక్కువగా తినకూడదు. వీటిని పాటిస్తే.. టైఫాయిడ్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health Tips, Life Style, Telangana