Long Covid: లాంగ్‌ కోవిడ్‌తో బాధితులు కఠిన వ్యాయామాలు చేయవచ్చా? నిపుణుల సలహాలు ఇవే

ప్రతీకాత్మకచిత్రం

కరోనా మహమ్మారి చాలా రోజులుగా ప్రజలను పట్టిపీడిస్తూనే ఉంది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే సరికొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక లాంగ్ కోవిడ్ (Long Covid) సమస్య కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులలో ఆందోళనలు రేకెత్తిస్తోంది.

  • Share this:
కరోనా మహమ్మారి చాలా రోజులుగా ప్రజలను పట్టిపీడిస్తూనే ఉంది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే సరికొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక లాంగ్ కోవిడ్ (Long Covid) సమస్య కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులలో ఆందోళనలు రేకెత్తిస్తోంది. వైద్యులకు సైతం లాంగ్ కోవిడ్ ఆందోళనకరంగా మారింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులలో కోవిడ్ అనంతర సమస్యలను సూచించడానికి ఈ 'లాంగ్ కోవిడ్' పదాన్ని వాడుతున్నారని చెబుతున్నారు డా. మాథ్యూ వర్గీస్. ఈయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ హాస్పిటల్ లో ఆర్థోపెడిక్స్ విభాగానికి హెచ్ఓడీగా పని చేస్తున్నారు. కరోనా సోకిన తర్వాత 4-5 వారాల వరకు ఈ లక్షణాలు కనిపించవచ్చని ఆయన చెప్పారు.

లాంగ్ కోవిడ్ అంటే ఏంటి ?
లంగ్స్ అండ్ TB స్పెషలిస్ట్ డా. నిఖిల్ నారాయణ్ బంటే ప్రకారం కోవిడ్ -19 నుంచి కోలుకున్న 3-6 నెలల వరకు దాదాపు 50% -70% మంది రోగులు స్వల్ప లేదా తీవ్ర లక్షణాలతో బాధపడే అవకాశం ఉంది. స్వల్ప లేదా తీవ్రమైన కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే లాంగ్ కోవిడ్ అంటారని డాక్టర్ నిఖిల్ అన్నారు. డా. మాథ్యూ వర్గీస్ మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ తాము చాలా అనారోగ్యంగా ఉన్నామని లాంగ్ కోవిడ్ లేదా కోవిడ్ -19 లక్షణాలతో సుదీర్ఘంగా బాధపడుతున్న వ్యక్తులు మొరపెట్టుకుంటున్నారని చెప్పారు.

అలసట, శ్వాసఆడకపోవడం, ఒళ్ళు నొప్పులు, అసాధారణ పల్స్, తల నొప్పి, దద్దుర్లు, ఛాతీ నొప్పి, విరేచనాలు, నాళాలలో రక్తం గడ్డకట్టడం, వాసన కోల్పోవడం, రుచిని కోల్పోవడం వంటి అనేక లక్షణాలను కరోనా రోగుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. శారీరక సమస్యలకు తోడు లాంగ్-కోవిడ్ రోగుల్లో ఆందోళన, డిప్రెషన్, మతిమరుపు(brain-fogging) వంటి మానసిక సమస్యల లక్షణాల కనిపిస్తున్నాయన్నారు. అయితే లాంగ్ కోవిడ్ లో ఆస్ట్రోసైట్స్ దెబ్బతినడం వల్ల మతిమరుపు సమస్య తలెత్తుతుందన్నారు. అల్జీమర్స్ వ్యాధిలో వచ్చే మతిమరుపుకు ఇది విభిన్నమన్నారు.

లాంగ్ కోవిడ్ సమస్య వృద్ధులను మాత్రమే వేధిస్తోందని ఇంతకుముందు భావించారు కానీ ఇప్పుడు అన్ని వయస్కులలో దీర్ఘకాలిక లక్షణాలు కనిపిస్తున్నాయని డా. వర్గీస్ తెలిపారు. కవాసకి వ్యాధి(Kawasaki disease) లేదా రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం అనే అనారోగ్య సమస్యను పిల్లలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారన్నారు. పిల్లలు తమ మానసిక సమస్యలను చెప్పుకోలేరు కాబట్టి పిల్లల్లో వీటిని గుర్తించడం కష్టమని మాథ్యూ వివరించారు. కొత్త లక్షణాలు కోవిడ్ వల్ల వచ్చాయో లేదో గుర్తించడానికి వైద్యులు కరోనా సోకిన సమయంలో రోగుల్లో అదే లక్షణాలను ఉన్నాయో లేదో పరిశీలిస్తారని ఆయన వివరించారు.

ప్రజా ఆరోగ్య సలహా :
తీవ్రస్థాయి కోవిడ్-19 నుంచి కోలుకున్న వెంటనే కఠినమైన వ్యాయామాలు చేయవద్దని డాక్టర్ వర్గీస్ హెచ్చరించారు. పూర్తిగా రికవర్ అయ్యే వరకు అంటే కనీసం మూడు నెలలపాటు ఎక్సర్సైజుల జోలికి వెళ్లొద్దు అన్నారు. ఇలాంటి వ్యాయామాలు కరోనా బాధితుల్లో గుండెపోటుకు దారితీసిన సందర్భాలన్నాయన్నారు. లాంగ్ కోవిడ్ రోగులలో ఆటో ఇమ్మ్యూన్ డిసార్డర్ కారణంగా కీళ్ల వాపు, నొప్పి మరో ప్రధాన సమస్యగా కనిపిస్తుందన్నారు. ఇందుకు కారణం కోవిడ్ సమయంలో శరీరంలోని యాంటీబాడీలు ఇతర సాధారణ కణాలపై దాడి చేయడమేనని వివరించారు. అయితే కీళ్ల నొప్పుల కంటే ఎక్కువ మంది ఒళ్ళు నొప్పుల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. కోవిడ్ చికిత్స సమయంలో స్టెరాయిడ్ల అధిక వినియోగం ఇలాంటి సమస్యలు తలెత్తేలా చేస్తాయి.

ఎముకకు రక్త సరఫరా తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోవడం వల్ల వచ్చే అవాస్కులర్ నెక్రోసిస్ వ్యాధి అధిక స్టెరాయిడ్స్ ఇచ్చిన రోగులలో కనిపించే మరో ప్రధాన సమస్య. ఎముకల చూడటం అనేది మనం 25 ఏళ్లలోపు చేసే శారీరక శ్రమ పై ఆధారపడి ఉంటుందని డా.వర్గీస్ పేర్కొన్నారు. కరోనా వంటి వైరస్ లను సమర్ధవంతంగా తట్టుకునేందుకు ఆటల్లో పాల్గొనాలని లేదా కనీసం 30 నిమిషాలు నడవాలని సూచించారు. ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్-డి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. కాల్షియం పాలు, పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్, బెర్రీలలో సమృద్ధిగా లభిస్తుందన్నారు. అలాగే విటమిన్-డి అధికంగా తీసుకోకూడదని హెచ్చరించారు.
Published by:Krishna Adithya
First published: