ప్రస్తుతం ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. భారతదేశంలోనూ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనా నిబంధనలు పాటించడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అత్యంత సమర్థమైన మాస్కులు మాత్రమే ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రంగురంగుల వస్త్ర మాస్కులు ధరించవచ్చా? మళ్లీ వాడుకోగలిగే కాటన్ మాస్కులు తొడుక్కోవచ్చా? వంటి ప్రశ్నలతో ప్రజలు తికమకపడుతున్నారు. అయితే తాజాగా రీయూజబుల్ వస్త్ర మాస్కులపై ఆరోగ్య నిపుణులు స్పందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
"వస్త్రంతో తయారుచేసిన మాస్కులు ధరించడం సురక్షితంగా కావచ్చు లేదా అత్యంత ప్రమాదకరం కావచ్చు. ఇది ఎలాంటి వస్త్రంతో మాస్క్ తయారుచేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది" అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రైమరీ హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రొఫెసర్ ట్రిష్ గ్రీన్హాల్గ్ తెలిపారు.
రకరకాల వస్త్రాల మిశ్రమంతో తయారు చేసిన డబుల్ లేదా ట్రిపుల్-లేయర్ మాస్క్‌లు వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని శాస్త్రవేత్తలు గతంలో తేల్చారు. అయితే చాలావరకు వస్త్ర ముఖ తొడుగులు ఫ్యాషన్ యాక్సెసరీస్ లాగా పనిచేస్తాయే తప్ప.. అంతకుమించి వాటి వల్ల ఉపయోగమేమీ లేదని గ్రీన్హాల్గ్ అభిప్రాయపడ్డారు.
ఒమిక్రాన్ వంటి వేరియంట్ ని అడ్డుకోవాలంటే కాటన్ తో తయారుచేసిన మాస్కులకు బదులు ట్రిపుల్-లేయర్ మెడికల్ మాస్క్‌లను ధరించాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. టీ షర్టు లేదా టాప్ లకు మ్యాచ్ అయ్యే రంగురంగుల వస్త్ర మాస్కులను వాడకపోవడమే నయమని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒమిక్రాన్ వల్ల పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో బ్రిటన్ ప్రజా రవాణా, షాపులు, కొన్ని ఇండోర్ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే ఒక కఠిన నిబంధన మళ్లీ తీసుకొచ్చింది.
గతంలో వేసవిలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదన్నట్లు నిబంధనలను చాలా వరకు సడలించింది. మళ్లీ ఇప్పుడు ఒమిక్రాన్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ మాస్కులు ధరించాలని ప్రజలపై ఇంగ్లాండ్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది.
ఒక్క బ్రిటన్‌లో మాత్రమే కాదు అన్ని దేశాలలోనూ ప్రజలు ఎప్పుడు, ఎక్కడ ఫేస్ మాస్క్‌లు ధరించాలో సంబంధిత యంత్రాంగాలు సూచిస్తున్నాయి. అంతేకాదు ప్రజలు ఏ రకమైన ఫేస్ మాస్కులను ఎంచుకోవాలి అనే దాని గురించి వివిధ ప్రదేశాలలోని అధికారులు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
దుస్తులతో తయారుచేసిన మాస్కులు ఎలాంటి ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం లేదని గ్రీన్హాల్గ్ చెప్పారు. కానీ ఆమె వ్యాఖ్యలకు విరుద్ధంగా కంపెనీలు ఎన్95 రెస్పిరేటర్ మాస్క్‌లను 95% సూక్ష్మ కణాలను ఫిల్టర్ చేసేలా తయారు చేస్తున్నారు. అయినప్పటికీ, మాస్క్ మీ ముక్కు, నోటిని సరిగ్గా కవర్ చేయకపోతే వైరస్ ఫిల్టర్ కాకుండా మీ శరీరంలోకి ప్రవేశించవచ్చు.
ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఎంత ప్రామాణికమైన మాస్క్ అయినా సరే దాని ద్వారా సులభంగా ఊపిరి పీల్చుకోగలగాలని గ్రీన్హాల్గ్ వివరించారు. పర్యావరణానికి మేలు చేయాలనుకున్నవారు లేదా డబ్బు ఖర్చు పెట్టలేని వారు క్లాత్ మాస్క్‌లను వాడాలని అనుకుంటారు. ఎందుకంటే వాటిని ఉతికి మళ్లీ వాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి : క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు.. డీడీఎంఏ ఆదేశాలు
అయితే కేవలం క్లాత్ మాస్క్‌లే కాదని.. ప్రమాణాలకు లోబడి ఉన్న రీయూజబుల్ మాస్కులు కూడా మెడికల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని గ్రీన్హాల్గ్ తెలిపారు. ఇప్పటికే సింగిల్-లేయర్క్లాత్ మాస్క్‌లను పారేసి సమర్థవంతమైన మాస్కులు ధరించాలని అక్కడి అధికారులు సలహా ఇస్తున్నారు. "ఇక్కడ సమస్య ఏమిటంటే, మీరు సింగిల్-లేయర్ మాస్క్ ధరిస్తే దానికి ఫిల్ట్రేట్ చేసే సామర్థ్యం కచ్చితంగా తక్కువగా ఉంటుంది. అలాంటి మాస్కు ధరించినా ధరించకపోయినా ఒకటే" అని ఒంటారియో సైన్స్ అడ్వైజరీ టేబుల్ హెడ్ పీటర్ జూని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona mask, Covid -19 pandemic, Face mask, Omicron