Winter Skin Care : భారతదేశంలో చలికాలం మొదలైపోయింది. చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్లో చాలామందికి ఎదురయ్యే సమస్య.. చర్మం పొడిబారటం. వాతావరణ మార్పుతో కొందరికి పెదాలు, మరికొందరికి పాదాలు పగులుతున్నాయి. ఉన్నపళంగా చర్మాన్ని పాడు చేసే ఈ కాలం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు మాయిశ్చరైజర్స్, క్రీమ్స్ వంటివి వాడటం మొదలెడుతున్నారు. అయితే ఇందుకు సహజ సిద్ధమైన ఆలివ్ ఆయిల్, షియా బటర్ వంటివి వాడాలని నిపుణులు చెబుతున్నారు. చర్మ రకాన్ని బట్టి ఆలివ్ ఆయిల్, షియా బటర్ అందించే ప్రయోజనాల ఆధారంగా మీరే వీటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి. మరి ఈ రెండింటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
షియా బటర్
షియా బటర్ అనేది ఆఫ్రికన్ షియా చెట్టు గింజ నుంచి సేకరించిన ఫ్యాట్. ఇది చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పొడిబారిన చర్మం తేమగా, స్మూత్‌గా తయారు కావాలంటే షియా బటర్ వాడితే చాలు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది చర్మంపై రక్షిత పొరను ఏర్పరుస్తుంది. ఈ పొర అనేది నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని చర్మానికి అందిస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు సహాయపడుతుంది. షియా బటర్ వాడటం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది.
ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ ఎ, విటమిన్ ఇ చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు హెల్దీగా తయారు చేస్తుంది. ఇందులోని కణాల పునరుత్పత్తిని పెంచే లక్షణాలు ముడతలు, మచ్చలు, గీతలను తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. ఇందులోని కొల్లాజెన్-బూస్టింగ్ లక్షణాలు బొద్దుగా కనిపించే చర్మాన్ని అందిస్తాయి. ఇందులో అనేక ఆరోగ్యం, జుట్టు, చర్మ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఉంది.
Relationships in India: రిలేషన్‌షిప్‌పై మారుతున్న యువత అభిప్రాయాలు..తాజా సర్వే వివరాలివే..
ఆలివ్ ఆయిల్
చలికాలంలో పొడి చర్మం సమస్యలు పోగొట్టేందుకు చర్మాన్ని నూనెతో మర్దన చేసుకుంటుంటారు. అయితే ఈ నూనెలలో ఆలివ్ ఆయిల్‌కి మించింది మరొకటి లేదు. ఒక టీస్పూన్ లేదా రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్‌తో చర్మాన్ని మర్దన చేసుకున్నా.. అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ నూనె మీ చర్మాన్ని లోతుగా, పూర్తిగా తేమగా మారేలా చేస్తుంది. ఆలివ్ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ ఎ, డి, ఇ, కె అన్ని రకాల చర్మ సమస్యలను పోగొడతాయి.
ఆలివ్ ఆయిల్ చర్మానికి అప్లై చేసుకునే ముందు కాస్త వేడి చేస్తే మెరుగైన ప్రయోజనాలు పొందొచ్చు. ఈ నూనె బ్యాక్టీరియాతో పోరాడుతుంది. తేమను లాక్ చేస్తుంది. మీ చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో పెద్దగా సహకరించదు కానీ నీటిలో మీ మాయిశ్చరైజర్ తొలగిపోకుండా కాపాడుతుంది. ఆలివ్ ఆయిల్‌తో తయారు చేసిన సబ్బును ఉపయోగించడం వల్ల మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయవచ్చు. తద్వారా మొటిమలు తగ్గించుకోవచ్చు. ఆలివ్ నూనెలో విటమిన్ A, D, E, K పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసే ఆలివ్ ఆయిల్ క్యాన్సర్ వచ్చే ముప్పును తగ్గిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.