తీజ్ పండుగ.. ఇది గిరిజన కన్యలకు ప్రత్యేకం..

నిజామాబాద్ జిల్లాలోనూ తీజ్ సందడి నెల‌కోంది.. జిల్లాలోని దర్పల్లి, డిచ్పల్లి, గాంధారీ, బాన్స్ వాడ సదాశివనగర్ తదితర మండలాల్లోని గిరిజన తండాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: July 27, 2019, 6:32 PM IST
తీజ్ పండుగ.. ఇది గిరిజన కన్యలకు ప్రత్యేకం..
నిజామాబాద్ జిల్లాలో తీజ్ పండుగలో పాల్గొన్న యువతులు
  • Share this:
తీజ్ పండగ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది గిరిజన తండాలు.. వారి కట్టు బొట్టు సంప్రదాయ నృత్యాలు గిరిపుత్రుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది ఈ పండగ.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. తమకు మంచి వరుడు దొరకాలని పెళ్లీడు యువతులు తొమ్మిది రోజుల పాటు నవధాన్యాల మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. నిజామాబాద్ జిల్లాలో తీజ్ ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. మన దేశంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ఓ ప్రత్యేక స్థానముంది.. ప్రపంచీకరణ ప్రాశ్చాత్య సంస్కృతులు తీవ్ర ప్రభావం చూపుతున్న నేటి హైటెక్ యుగంలోనూ తండాల్లో గిరిజనులు తమ సంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తున్నారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే తీజ్ పండగ.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ పండుగకు గిరిజన తండాలు వేదిక అవుతున్నాయి.. ఎంతో చారిత్రక నేపథ్యం కూడా ఈ పండుగ కుంది..

నిజామాబాద్ జిల్లాలోనూ తీజ్ సందడి నెల‌కోంది.. జిల్లాలోని దర్పల్లి, డిచ్పల్లి, గాంధారీ, బాన్స్ వాడ సదాశివనగర్ తదితర మండలాల్లోని గిరిజన తండాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.. పెళ్లికాని యువతులు వెదురు తట్టలో పుట్ట మట్టిని తెచ్చి అందులో నవధాన్యాలు విత్తుతారు.. 9 రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉంటూ ప్రతిరోజూ ఉదయం సాయంత్రం మొలకలకు నీళ్లు పోస్తూ పూజలు చేస్తారు. 9 రోజుల తర్వాత నిమజ్జన వేడుకలను సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు.. నూతన వస్త్రాలు ధరించి సంప్రదాయ నృత్యాలు ఆటలతో అలరిస్తారు.. నవధాన్యాల మొలకలను తాండాలోని ఆలయం వద్ద ఒక చోట చేర్చి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు.. నిమజ్జనం జరిపే చివరి రోజు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి.. వివిధ గ్రామాల్లో ఉండే తమ బంధుమిత్రులను ఆహ్వానిస్తారు.. చదువుల కోసం ఉద్యోగరీత్యా పట్టణాలు, నగరాల్లో స్థిరపడ్డ వారు సైతం తీజ్ పండగ కోసం తండాలకు చేరుకుంటారు.. ప్రధాన వీధుల మీదుగా ఊరేగింపుగా బయలుదేరుతారు.. కొన్ని చోట్ల గ్రామ కమిటీలు ఈ పండుగ నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల గిరిజనులు ఈ ఆచారాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తున్నారు.. అయితే తీజ్ పండుగ తరతరాలుగా తమ ఆచారంగా వస్తుందని గిరిపుత్రులు చెప్తున్నారు.. ముఖ్యంగా కన్యలు తీజ్ వ్రతాన్ని చేపడతారని వారు నాటిన నవధాన్యాలు మొలకెత్తితే వ్రతం ఫలించినట్లు.. ఈ పండుగ ఇతివృత్తంగా చెప్పుకుంటారు.. అంతేకాదు మొక్కలు ఎంత బాగా మొలిస్తే అంత మంచి వరుడు లభిస్తాడని వారి నమ్మకం.. అందుకే అత్యంత నియమ నిష్ఠలతో పవిత్రంగా వ్రతం చేపడతామని వారు వివరిస్తున్నారు.

(పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు, ప్ర‌తినిధి)
First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading