కొత్త సంవత్సరమంటేనే కొత్త తీర్మానాలు, నిర్ణయాలు తీసుకునే సమయం. పైగా 2020 మిగిల్చిన డిజాస్టర్ కారణంగా ప్రజల ఆలోచనా తీరు విపరీతంగా మారింది. ముఖ్యంగా మనవాళ్ల ప్రాధాన్యతా క్రమం బాగా మారింది. కోవిడ్-19 ప్రభావం 2021 రెజల్యూషన్స్ పై బలంగా ప్రభావం చూపుతోంది. అందుకే భారతీయులంతా ఫిట్నెస్, పొదుపు బాట పట్టాలని కొత్త సంవత్సరం టార్గెట్ గా పెట్టుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే ఎక్కువకాలంపాటు పరిమితం కావటంతో ప్రజల ఆలోచనా తీరు కూడా బాగా మారింది. దీంతో శారీరక ఆరోగ్యాన్ని సీరియస్ గా తీసుకునేవారి సంఖ్య పెరిగింది. న్యూస్ 18 సంస్థతో (News 18) పాటు YouGov అనే సంస్థ చేపట్టిన తాజా సర్వేలో.. 2021లో 45శాతం మంది ఫిట్ గా ఉండటం, రోజూ ఎక్సర్సైజులు చేయటానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ45శాతం మందిలో 46శాతం మంది పురుషులుండగా, 45శాతం మంది మహిళలున్నారు. బేబీ బూమర్లలో అత్యధికంగా 55శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
మారిన మహిళల ఆలోచనా తీరు
ఇక పశ్చిమ భారతంలో నివసించే ప్రజలు ఈ లక్ష్యాన్ని మరింత త్వరగా, వేగంగా అందుకోవాలని భావిస్తుండటం విశేషం. కరోనా కారణంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, వ్యక్తిగత పరిశుభ్రత వంటివాటిపై శ్రద్ధ చూపేలా మనవారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయి. సర్వేలో పాల్గొన్న 32శాతం మంది ఇదే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈమేరకు ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. 34శాతం మంది మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతతో కోవిడ్ కు covid-19 దూరంగా ఉండటాన్ని ఎంచుకుంటున్నారు. ఇక పురుషుల్లో మాత్రం 30శాతం మంది మాత్రమే వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
హెల్త్ ప్లాన్స్ లో పెట్టుబడులు
హెల్తీగా, హైజినిక్ గా ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ 26శాతం భారతీయులు హెల్త్ ప్లాన్స్ లో, సెక్యూరిటీస్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ విషయంపై 30శాతం సీరియస్నెస్ చూపుతున్న జెన్ ఎక్స్ కావటం మరో విశేషం. చిన్న వయసులోనే కొత్తతరం వారు ఆరోగ్యరంగంలో పెట్టుబడులు పెట్టడం మంచిపరిణామమే. ఇక కుటుంబసభ్యుల మధ్య సమీకరణాలు కూడా కరోనా మహమ్మారి సమయంలో బాగా మార్పులు చేర్పులకు గురయ్యాయి . కరోనా వైరస్ కారణంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో భారతీయులు ఎక్కువగా కుటుంబంతో గడిపటాన్ని ఇష్టపడుతున్నారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ 34శాతం మంది కొత్త సంవత్సరంలోనూ తమ కుటుంబసభ్యులతో క్వాలిటీ టైం గడిపేందుకు మొగ్గుచూపుతున్నారు. 18 నుంచి 2 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకుల్లోనూ 37శాతం మంది ఇదే విషయాన్ని చెప్పటం చూస్తుంటే భారతీయ కుటుంబ వ్యవస్థ మరింత బలోపేతమైనట్టు కనిపిస్తోంది.
సేవింగ్స్ లోకి డైలీ ఖర్చులు
ఖర్చుల విషయానికి వస్తే నిత్యం విచ్చలవిడిగా ఖర్చుచేసే వారు విపరీతంగా తమ ఖర్చులను అదుపు చేసుకుంటున్నారు. బాగా అవసరమైతేతప్ప బయటికి వెళ్లటం లేదుకనుక డైలీ ఖర్చులు మిగులుబాటుకాగా వాటన్నింటినీ పొదుపు చేసుకుంటున్నారు. రానున్న కాలంలో కూడా ఇదే పొదుపు విధానాలను కొనసాగించేందుకు భారతీయులు ఆసక్తిచూపుతున్నారు. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోతే ఇది బఫర్ గా ఉపయోగపడుతుందనే ముందుచూపుతో పొదుపును పెంచుకుంటున్నారు.
పొదుపు, పొదుపు, పొదుపు
38శాతం మంది భారతీయులు 2021లో అత్యధికంగా పొదుపు చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయంలో మహిళలు, పురుషులు ఒకేలా ఆలోచిస్తుండటం విశేషం. 18-29 ఏళ్ల మధ్య ఉన్న 43శాతం మంది అత్యధికంగా పొదుపు చేయాలనుకుంటుండగా కానీ బేబీ బూమర్స్ లో ఈ ఆసక్తి ఆ స్థాయిలో లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 40 ఏళ్లు పైబడ్డ వారిలో 32శాతం మంది పొదుపుపై ఈ రేంజ్ లో ఆసక్తి లేదు.
న్యూస్ 18-YouGov సర్వేలో డేటాను 2020 డిసెంబరు 29 నుంచి 2021 జనవరి 3 మధ్య కాలంలో 1015 పట్టణాల్లో నివసిస్తున్న భారతీయుల నుంచి సేకరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: New Year 2021, News18, Survey