మోసాసార్(ఈత కొట్టగలిగే డైనోసర్లు) కుటుంబానికి చెందిన కొత్త జాతి జీవుల అవశేషాలను కెనడాకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఇవి 60 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. మొసలికి ఉన్నట్లే వీటికి కూడా పొడవైన ముక్కు ఉంటుంది. ఇది సముద్రపు అడుగు భాగాల్లో నివసిస్తుంది. దీనికి గావియాలిమస్ అల్మాగ్రిబెన్సిస్ అనే పేరు పెట్టారు. అల్బెర్టా యూనివర్సిటీ పరిశోధకురాలు కేటీ స్ట్రాంగ్ ఈ ప్రాణిని కనిపెట్టిన బృందానికి నాయకత్వం వహించారు.
ఎక్కడ కనుగొన్నారు?
ఈ పురాతన జంతువుకు చెందిన అవశేషాలు మొరాకోలో బయటపడ్డాయి. ఆ దేశంలోనే సముద్రపు డైనోసర్ల(స్పైనోసర్లు) అవశేషాలను మొట్టమొదటిగా కనుగొన్నారు. వీటితో పాటు ఇతర జాతులకు చెందిన మోసాసార్లను కూడా పరిశోధకులు అక్కడే కనుగొన్నారు. మోసాసార్లు నీటిలో జీవిస్తాయి. ఇవి డైనోసర్ల జాతికి చెందినవి కావు. వీటి జన్యుక్రమం కూడా డైనోసర్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. 1808 లో పర్యావరణ శాస్త్రవేత్త జార్జెస్ కువియర్ మొదటిసారి మోసాసార్ల అవశేషాలు గుర్తించారు. వాటిని "జెయింట్ మెరైన్ లిజర్డ్" గా ఆయన పిలిచారు.
వేటలో ముందు
ఈ జీవుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ జంతువులకు వివిపరస్ వంటి క్షీరద లక్షణాలు ఉండవచ్చని కొంతమంది పరిశోధకులు ఊహిస్తున్నారు. మనకు తెలిసిన డైనోసార్లు సరీసృపాలు(రెప్టైల్స్). అవి గుడ్లు పెడతాయి. భూమిపై జీవించే ఇతర జంతువుల మాదిరిగా మోసాసార్లు కూడా గాలి పీల్చుకోగలవు. ఇవి 55 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. ఈ జంతువులకు వేటాడే సామర్థ్యం బాగా ఉండొచ్చని వీటిపై అధ్యయనం చేస్తున్న పరిశోధకురాలు స్ట్రాంగ్ చెబుతున్నారు. ఈ సామర్థ్యంతోనే అవి ఇతర వేటాడే జలజాతులతో కలిసి జీవించాయని ఆమె వివరించారు.
సాంకేతికతతో పరిశోధనలు
మొరాకోలోని ఫాస్ఫేట్ గనుల్లో దీనికి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. దానికి మూడు అడుగుల పొడవైన పుర్రె ఉంది. ఈ అవశేషాలనుఉ డిజిటల్ రీకన్స్ర్టక్షన్ చేయడం ద్వారా వాటి దవడ, దంతాల సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. తద్వారా వాటి ఆహారపు అలవాట్లను విశ్లేషించే అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేట్ థీసిస్లో భాగంగా స్ట్రాంగ్ వీటిపై పరిశోధనలు చేస్తోంది. గవియాలిమిమస్(పొడవైన ముక్కు ఉండే ఎలిగేటర్లు)లకు వేగంగా కదిలే ఎరను పట్టుకోవటానికి ముక్కు భాగం ఎలా సహాయపడుతుందనే అంశంపై ఆమె పరిశోధన చేస్తోంది. ఈ అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ సిస్టమిక్ పాలియోంటాలజీలో ప్రచురించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.