Mathematics Day 2020: రామానుజన్ జయంతిగా గణిత దినోత్సవం.. అందరికీ ప్రేరణ ఆ మేధావి

Mathematics Day: రామానుజన్ జయంతిగా గణిత దినోత్సవం.. అందరికీ ప్రేరణ ఆ మేధావి (image courtesy - twitter - Seema Nagender Antil)

National Mathematics Day 2020 - Srinivasa Ramanujan Day: రామానుజన్ తన జీవితంలో ప్రతి దాన్నీ అంకెలు, సంఖ్యలతోనే చూశారు. ఏది మాట్లాడినా, ఏం చేసినా అందులో లాజికల్ కోణాలు అందర్నీ ఆశ్చర్యపరిచేవి.

  • Share this:
National Mathematics day: ఎప్పుడో 130 ఏళ్ల కిందట ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయిన గణిత మేధావి ఇండియాలో పుట్టాడు. ఆయన ఆలోచనలు, చేసిన లెక్కలు, వేసిన ఫార్ములాలు అన్నీ అద్భుతమే. అసలు అలా ఎలా ఆలోచించగలిగాడు అని అంతా షాకయ్యేవారు. అందుకే గణితశాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత కేంద్ర ప్రభుత్వం ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవం (National mathematics day)గా ప్రకటించింది. 2012 నుంచి డిసెంబర్ 22ను మనం నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటూ శ్రీనివాస రామానుజన్ (Srinivasa Ramanujan)ను గుర్తుచేసుకుంటున్నాం. మరి ఇవాళ కూడా కొన్ని ఆసక్తిక విశేషాల్ని తెలుసుకుందాం.

గణితానికి దిశానిర్దేశం చేసింది మనమే:
సున్నాను కనిపెట్టిన భారతీయులు ప్రపంచ గణితశాస్త్రానికి అద్భుత కానుక ఇచ్చారు. దశాంశ పద్ధతిని గుర్తించింది కూడా భారతీయులే కావడం విశేషం. గణితశాస్త్రానికి దిశానిర్దేశం చేసిన శాస్త్రవేత్తలు మనదేశంలో చాలామంది ఉన్నారు. ఆర్యభట్ట, మహావీర, బ్రహ్మగుప్త, భాస్కర 2, శ్రీనివాస రామానుజన్ వంటివారు గణితశాస్త్రంలో చేసిన పరిశోధనలు అపారం. అత్యంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్య్ జీనియస్ (Maths genius)గా పేరుగాంచారు. ఆయన జీవితం ఆధారంగా ‘ద మ్యాన్‌ హూ నో ఇన్ఫినిటీ’ (The man who know infinity) పేరుతో సినిమా విడుదలయ్యింది. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన శ్రీనివాస రామానుజన్ పుట్టిన రోజైన ఈ రోజున జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం.


ఫెయిల్ అయిన విద్యార్థి:
లెక్కల్లో అపర మేధావి అయిన రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఆర్కాట్ జిల్లాలోని ఈరోడ్ లో నిరుపేద అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిగా గుర్తింపు పొందారు. కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చదివిన ఆయన కేవలం లెక్కలపైనే ఆసక్తి చూపేవారు. దీంతో మ్యాథ్స్ తప్ప అన్ని ఇతర సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ, ట్రిగునామెట్రీ వంటి విషయాలకు సంబంధించిన సిద్ధాంతాలను చాలా సింపుల్‌గా, సులువుగా నిరూపించిన రామానుజన్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారంటే నమ్మశక్యం కాదు. రీమన్ సిరీస్, ఫంక్షనల్ ఈక్వేషన్స్ ఆఫ్ జెటా ఫంక్షన్, హైపర్ జామెట్రిక్ సిరీస్ వంటివాటిపై రామానుజన్‌కు అపార పరిజ్ఞానం ఉండేది. గణిత శాస్త్రంలో 3900 కంటే ఎక్కువ సమీకరణాలను సమీకరించారు. ఎన్నో పుస్తకాలను రాశారు.




మ్యాథ్స్ ప్రాధాన్యం తెలిపేందుకే:
అసలు ఈ నేషనల్ మ్యాథమ్యాటిక్స్ డేను ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ప్రజల్లో గణిత శాస్త్రంపై అవగాహన పెంచేందుకు, గణితం ప్రాధాన్యం వివరించేందుకే... ప్రభుత్వం రామానుజన్ జయంతిని ఇలా ఘనంగా జరుపుతోంది. కొత్త తరాలకు ఈ శాస్త్రంపై ఆసక్తి కలిగేలా చేసేందుకు ప్రోత్సాహం ఇస్తోంది. గణిత దినోత్సవం సందర్భంగా మ్యాథమెటీషియన్స్, టీచర్లు, విద్యార్థులకు ప్రత్యేక క్యాంపుల ద్వారా ట్రైనింగ్ ఇవ్వటం, టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్స్ సమకూర్చి, లెక్కలపై మరింత లోతైన పరిశోధనలు జరిగేలా ప్రభుత్వం కృషిచేస్తోంది.

ఇది కూడా చదవండి: Horoscope Today: డిసెంబర్ 22 రాశి ఫలాలు... ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం

2012 నుంచి మ్యాథ్స్ డే:
2012, ఫిబ్రవరిలో 26న మద్రాస్‌ యూనివర్సిటీలో జరిగిన రామానుజన్‌ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రామానుజన్‌ పుట్టినరోజును గణిత దినోత్సవంగా ప్రకటించారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి... రామానుజన్‌ 75వ జన్మదినోత్సవం సందర్భంగా 1962లో కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.
Published by:Krishna Kumar N
First published: