MUST KNOW THE BENEFITS OF EATING RADISH IN WINTER SEASON AK
Radish: చలికాలంలో ముల్లంగి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు
ప్రతీకాత్మక చిత్రం
ముల్లంగి సలాడ్లు (radish salad) విపరీతంగా లాగించే నార్త్ ఇండియన్స్ కు మూలీ పరోఠా (Mooli paratha) అత్యంత ఇష్టమైన ఆహారం. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ముల్లంగితో చాలా వెరైటీలు చేసుకోవచ్చు.
దుంపలు (roots) అంటే చిన్నచూపు చూసేవారు అత్యధికం. దుంపలు తింటే దుంప తెగుతుందనే అవగాహన రాహిత్యంతో మనలో చాలామంది ముల్లంగి (radish) సుగుణాలు తెలియక ఈ కూరగాయను దాదాపు దూరంగా పెడుతున్నారు. ఉత్తరాది ప్రజలైతే (North Indians) ముల్లంగిని అత్యంత ఇష్టంగా తింటారు.
దక్షిణాది విషయానికి వస్తే కేవలం సాంబార్, కూర, పచ్చడి తప్పితే ఇతర రూపాల్లో పెద్దగా మనవారు ముల్లంగి తినరు. పోషకాహార నిపుణుల (Nutritionists) సలహాతో ఇప్పుడిప్పుడే మనవారు ముల్లంగిపై అపోహలు తొలగించుకుంటున్నారు. ముఖ్యంగా పండుగలప్పుడు మనం ముల్లంగిని ఉపయోగించడానికి మొగ్గు చూపము. చలికాలంలో ముల్లంగి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఔషధాల పుట్ట
ముల్లంగి దీని రుచి ఆస్వాదించడం మొదలుపెడితే పచ్చివే కరకరా తినేస్తారు. శీతాకాలంలో ఎక్కువగా పండే ముల్లంగి తింటే రోగనిరోధక శక్తి (Immunity) బాగా వృద్ధిచెందుతుంది. సీ విటమిన్ పుష్కలంగా ఉన్న ముల్లంగి చలికాలంలో జలుబు, దగ్గు వంటివి దరిచేరకుండా కాపాడుతుంది. తరచూ ముల్లంగి తింటే రోగాలు దరిచేరకుండా ఉంటాయి.
గుండె పదిలం
యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్న ముల్లంగి మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉండేలా కాపాడుతుంది. హృద్రోగాల బారిన పడకుండా ముల్లంగి పనిచేస్తుంది. ఆంథోసైనిన్ ను ఎక్కువగా ఉన్న ముల్లంగి తింటే గుండె జబ్బులు రావు.
జీర్ణం
జీర్ణకోశ సమస్యలున్నవారు ముల్లంగి అధికంగా తినాలి. దీంతో జీర్ణక్రియలు చురుకై అజీర్తి వంటి సమస్యలు పోతాయి. మలబద్ధకం కూడా వదిలించే శక్తి ముల్లంగికి ఉంది. ఇందులో ఉన్న పీచు పదార్థం మలబద్ధకానికి (constipation) విరుగుడుగా పనిచేస్తుంది. మొలలు (piles) ఉన్న వారు ముల్లంగి తినటం అలవాటు చేసుకుంటే మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్ ను అదుపులో ఉంచే శక్తి ఉన్న ముల్లంగి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను అందిస్తుంది.
ఆకులు, విత్తనాలు కూడా..
ముల్లంగి మాత్రమే కాదు వాటి ఆకులు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి మంచివి. వీటి రుచి బాగుంటుంది కూడా. ముల్లంగి ఆకుతో కూర చేసుకుంటే భలే వెరైటీగా ఉంటుంది. ఈ ఆకు రసాన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ముల్లంగితో ఒనగూరే ప్రయోజనాలన్నీ వాటి ఆకులతో కూడా వస్తాయి. కామెర్ల నివారణకు ఈ ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముల్లంగి, వాటి ఆకులే కాదు రసం కూడా మంచిది. తాజా ముల్లంగి రసం తీసి అందులోకి నాలుగు చుక్కల నిమ్మరసం కావాలంటే చిటికెడు మిరియాల పొడి వేసుకుని జ్యూస్ ట్రై చేయండి. మూత్ర సంబంధిత వ్యాధులకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది.
కెలరీలు కలిసి వస్తాయి
సన్నబడాలనుకున్న వారు ముల్లంగిని తరచూ తినేలా చూసుకోవాలి. ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఉన్న ముల్లంగితో కడుపు బాగా నిండి, ఆకలిని అదుపు చేస్తుంది. తక్కువ కెలెరీలున్న ముల్లంగితో త్వరగా ఆకలి అనే భావన కలగకుండా ఉంటుంది. మన శరీరంలోని విషాలను, మలినాలను బయటకు పంపే చవకైన సాధనం ముల్లంగి. ముల్లంగి తింటే చాలు ప్రత్యేకంగా డీటాక్స్ కోర్సు చేయాల్సిన పనిలేదు. ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది. ఇందులోని యాంతోసినిన్ వల్ల యాంటిక్యాన్సర్ ఔషధగుణాలు పుష్కలంగా మన ఒంటికి చేరతాయి. పురుషుల్లో సంతానోత్పత్తికి (fertility) ముల్లంగి సహకరిస్తుంది. అందుకే ఇది సూపర్ ఫుడ్ (super food) గా పేరుగాంచింది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కదా అని రోజూ తిన్నారనుకోండి అతిసారం వంటివి మిమ్మల్ని బాధిస్తాయి కనుక అతిగా తినకండి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.