Mothers Day 2022 Gift Ideas | అందరి జీవితాల్లో తల్లుల పాత్ర చాలా గొప్పది. ప్రతి ఒక్కరి జీవితంలో వారే అత్యంత ముఖ్యమైన మహిళలు. తల్లుల ఆర్థిక క్రమశిక్షణ ప్రభావం పిల్లలపై కూడా ఉంటుంది. చాలా మందికి తల్లులు కష్టపడి పనిచేసే స్త్రీలుగా గుర్తుండిపోతారు. వాటిని చూసి చాలా మంది విలువైన జీవిత పాఠాలు నేర్చుకుని ఉండవచ్చు. పని చేసే తల్లులు, ప్రత్యేకించి, ఈ ప్రపంచంలో జీవించడానికి అవసరమైన ముఖ్యమైన విషయాలను నేర్పుతారు. మే 8న మాతృదినోత్సవం సందర్భంగా ఈ ఆర్థిక పాఠాలు తెలుసుకోండి.
ఎల్లప్పుడూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి
తల్లులు తమ పిల్లలు యుక్త వయసులో ఉన్నప్పుడు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో చిన్న చిన్న పనులు చేసినందుకు కొంచెం డబ్బు ఇస్తూ.. కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుందని తెలియజేస్తారు. పుట్టినరోజులు లేదా పండుగలు వంటి సందర్భాలలో ఇష్టమైనవి కొనుక్కోవాలంటే పిగ్గీ బ్యాంకులో డబ్బును ఆదా చేయమని ప్రోత్సహిస్తారు. ఇవి చిన్న మొత్తాలకు సంబంధించి అంశాలే అయినా జీవితంలో చాలా పెద్ద మేలు చేస్తాయి. చిన్నతనంలో ఇలాంటివి నేర్పడం ద్వారానే ఆర్థికంగా స్వతంత్రంగా ఎలా ఉండాలనే అంశాన్ని తల్లులు నేర్పుతారు.
దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, పొదుపు చేయాలి
ప్రతి ఒక్కరూ తమ చిన్నతనం నుంచే డబ్బు విలువను నేర్చుకోవాలి. డబ్బు విలువ పై అవగాహన ఉంటే మాత్రమే పొదుపు ప్రణాళికలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టిపెడతారు. అప్పుడే డబ్బును సమర్ధవంతంగా, తెలివిగా ఖర్చు చేయగలరు. పెద్ద ఆర్థిక లక్ష్యాలను సాధించగలరు. ఒకరు ప్రారంభ సంవత్సరాల నుంచి పొదుపు చేయడమంటే 40 ఏళ్ళకు ముందుగానే పని నుంచి విశ్రాంతి పొందవచ్చు.
తల్లులు డబ్బు ఆదా చేయడం చూస్తూ పిల్లలు పెరుగుతారు. నెలవారీ ఖర్చుల కోసం ఎంత తక్కువ డబ్బు ఉందనే దాంతో సంబంధం లేకుండా వారి వద్ద ఎల్లప్పుడూ పొదుపు చేయడానికి కొంచెం మిగిలే ఉంటుంది. చాలా మంది తల్లుల నుంచే పొదుపు అలవాట్లను నేర్చుకొని ఉండవచ్చు. ఒకరు చిన్న వయసులోనే పొదుపు ప్రారంభించడం, డబ్బుకు విలువ ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక సంక్షోభంలో భయపడకుండా ఉంటే బహుశా తల్లి పొదుపు, పెట్టుబడి అలవాట్లను సంపాదించి ఉండవచ్చు. ఇంట్లో జాడీలు, ఎన్వలప్‌లు, అల్మారాలో చక్కగా మడతపెట్టిన చీరల మధ్యనే కదా తల్లులు డబ్బు దాస్తారు.
అత్యవసర నిధులు దాచుకోవాలి
కష్టాలు వచ్చినప్పుడు, అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు ఉపయోగించుకునేందుకు అత్యవసర నిధులు దాచి ఉంచుకోవడం తల్లులు తమ పిల్లలకు వారసత్వంగా అందజేస్తారు. డబ్బు ఎలా ఖర్చు చేసినా లేదా పెట్టుబడి పెట్టినా, అకస్మాత్తుగా నగదు అవసరం వచ్చినప్పుడు దిక్కుతోచదు. అందుకే అత్యవసర పరిస్థితి కోసం పొదుపు చేయడం చాలా అవసరం. ఊహించని ఆర్థిక అవసరాల కోసం ఆదా చేసినట్లయితే, వైద్యం, ప్రయాణ ఖర్చులు వంటి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో మేలు చేస్తుంది.
క్రెడిట్ కార్డులను క్రమశిక్షణతో ఉపయోగించాలి
పని చేసే తల్లితో పెరిగినట్లయితే, వారు క్రెడిట్ కార్డ్‌లను ఇష్టపడరని తెలిసి ఉంటుంది. వారు క్రెడిట్ కార్డ్‌లను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. గడువు తేదీకి ముందే బిల్లు చెల్లిస్తారు. ఏ సమయంలోనైనా బ్యాంక్ ఖాతాలో ఉన్న దానికంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌పై ఖర్చు చేయకూడదని తల్లులు కచ్చితంగా హెచ్చరిస్తారు. వారు క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై క్రమశిక్షణతో ఉంటారు. ఇది అందరూ నేర్చుకోవాల్సిన అద్భుతమైన నైపుణ్యం. ఈ విధంగా అధిక క్రెడిట్ స్కోర్‌ను చక్కగా నిర్వహించవచ్చు, అవసరమైనప్పుడు రుణాలను పొందవచ్చు.
నిబంధనలు పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి
తల్లులు చాలా శ్రద్ధగా ఉంటారు. ఒకే సమయంలో చాలా పనులు చేయగల సమర్థులు. డాక్యుమెంట్లు, స్కూల్ రిపోర్ట్ కార్డ్‌లు వంటి పేపర్‌వర్క్ విషయానికి వస్తే, సంతకం చేసే ముందు వాటిని చివరి అక్షరం వరకు జాగ్రత్తగా చదువుతారు. బ్యాంక్ లోన్ల కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు నిబంధనలు అన్నీ పూర్తిగా చదవాలి. ఒప్పందాలలోని చిన్న చిన్న అంశాల గురించి తల్లులకు తెలుసు కాబట్టి శ్రద్ధగా ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Happy mothers day, Mothers day