Home /News /life-style /

MOTHERS DAY 2020 THE BOND BETWEEN KTR AND HIS MOTHER SHOBA BA

Mothers Day 2020 | అమాత్యుడు అయినా.. కేటీఆర్ ఇప్పటికీ అమ్మ కూచి

తల్లి శోభతో మంత్రి కేటీఆర్

తల్లి శోభతో మంత్రి కేటీఆర్

ఏ కార్యక్రమానికైనా కేటీఆర్ అమ్మ శోభ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మొదలు పెడతారు. కేటీఆర్ చేపట్టే కార్యక్రమాలను తల్లి శోభ తరచూ అభినందిస్తుంటారు. పొరపాట్లను కూడా అదే స్థాయిలో ఎత్తి చూపుతారట.

  అందరి మాతృమూర్తుల్లాగే ఆ తల్లి కూడా ‘ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసి కూన... ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా’ అని కలలు కనింది. ఆ కన్న కలలు సాకారమయ్యేలా తన బిడ్డల్ని అపురూపంగా పెంచుతూ వారి అభ్యున్నతికి బాటలు వేసింది. నాటి ఆ పసి కూనే నేడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలే స్థాయికి ఎదిగాడు. తండ్రి రాష్ట్రాన్ని పాలిస్తుంటే... ఆ తండ్రికి అండదండలు అందిస్తూ అన్నింటా ముందుంటున్నాడు. ఆ మాతృమూర్తి ఎవరో కాదు... రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత తల్లి శోభ.

  చిన్న నాటి నుంచి కేటీఆర్ కు తల్లి గారాభం ఎక్కువ. కొడుకు ఏం చేసినా తండ్రి కేసీఆర్ మందలిస్తే... తల్లి మాత్రం సపోర్ట్ చేసేవారు. తండ్రి రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటే... పిల్లల ఆలనా పాలనంతా శోభ దగ్గరుండి చూసుకునేవారు. వారి చదువుల్లో ఎంతగానో హెల్ప్ చేసేవారు. కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా పాలు పంచుకునే సందర్భంలో ఆయనలా ప్రజా సేవ చేసి ప్రజల మొప్పు పొందాలని కుమారుడిని చిన్న తనం నుంచి రాజకీయాలంటే మక్కువ కలిగేలా ప్రోత్సహించారు శోభ.

  తల్లి శోభ, భార్య శైలిమ, కుమార్తె అలేఖ్యతో కేటీఆర్


  “నేను ఇవ్వాళ ఈ పొజిషన్ లో ఉన్నానంటే దాని వెనుక ఉన్న మహోన్నత వ్యక్తి మా అమ్మ. నన్ను ఇలా మలిచింది ఆమే. నాకు తెలిసిన గొప్ప వ్యక్తి మా అమ్మే” అని అమ్మతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు కేటీఆర్.

  కేటీఆర్ ఇప్పటికీ తండ్రి ముందు ఏదైనా చెప్పాలంటే జంకుతారట. ఏ విషయమైనా అమ్మకు చెప్పి అమ్మ ద్వారా నాన్నకు చెప్పించుకుంటారని కేటీఆర్ సన్నిహితులు చెబుతుంటారు. రాజకీయాల్లోనూ తను చేసే పనులకు తన తల్లే ఇన్ స్పిరేషన్ అని పలు సందర్భాల్లోనూ ప్రస్తావించారు.

  “నేను మున్సిపల్ మంత్రి అయ్యాక మా అమ్మ సిరిసిల్ల పట్టణానికి వచ్చింది. పట్టణాన్ని బాగా అభివృద్ధి చేశాం కదా... మా అమ్మ పొగుడుతుందని అనుకున్నా. ఎలా ఉంది అని అమ్మను అడిగా.. రోడ్లు మంచిగానే అయ్యాయి కానీ పందులు మాత్రం అలా ఉన్నాయి అని అంది. నాకు తల తీసినట్టు అయింది. అప్పట్నుంచి ఆరు నెలలు పట్టుబట్టి పందులు లేకుండా.. పట్టణాన్ని శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టాం.” అని కేటీఆర్ ఓ సందర్భంలో ప్రస్తావించారు.

  చిన్నప్పుడు తల్లితో కేటీఆర్


  కేటీఆర్ తాను చేసే పనుల్లో తల్లి ప్రభావం ఎంతగా ఉంటుందో ఈ వ్యాఖ్యల్ని చూస్తే అర్థమవుతుంది. ఏ కార్యక్రమానికైనా కేటీఆర్ అమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మొదలు పెడతారు. కేటీఆర్ చేపట్టే కార్యక్రమాలను తల్లి శోభ తరచూ అభినందిస్తుంటారని కుటుంబ సన్నిహితులు చెబుతుంటారు. అంతే కాకుండా చేసే పనుల్లో పొరపాట్లను కూడా అదే స్థాయిలో ఎత్తి చూపుతారట. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు వచ్చే అభ్యర్థనలు, వాటిని పరిష్కరించే తీరును శోభ అభినందిస్తుంటారు. నీ సాయం వల్ల వేలాది మంది ఆనందం పొందుతున్నారు. ఆ ఆనందం మరింత పెరిగాలని... మరింత విస్తరించాలని తరచూ కేటీఆర్ కు సూచిస్తుంటారట.

  కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. ఉద్యమంలో తన వంతుగా భాగస్వామ్యం కావాలని... తండ్రికి అండగా నిలబడాలని నిశ్చయించుకొని స్వదేశానికి తిరిగి వచ్చారు. మళ్లి ఇండియాకు తిరిగి రావాలన్న తన ఆలోచన కూడా ముందుగా కేటీఆర్ తల్లి ముందుంచి ఆమె అంగీకారం లభించిన తర్వాతే తండ్రికి చెప్పారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చి ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఆ తర్వాత ఎమ్మెల్యేగా.. మంత్రిగా రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

  తల్లి శోభతో కలసి మొక్క నాటుతున్న కేటీఆర్


  అయితే... తొలుత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సిరిసిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినపుడు... ఇప్పుడే ఎందుకు అని తొలుత అభ్యంతర పెటారని... ఆ తర్వాత అంగీకరించారని కుటుంబ సన్నిహితులు చెబుతారు. అందుకే ఆయన తొలి ఎన్నికల్లో కేవలం 171 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అమ్మకు ఇష్టం లేకపోవడం వల్లే తక్కువ మెజారిటీ వచ్చిందని కుటుంబ సభ్యులు విశ్వసిస్తారు. ఆ తర్వాత 2010 ఉప ఎన్నికల్లో కేటీఆర్ కు తల్లి పూర్తి సహాయ సహాకారాలు అందించారని... దాంతో ఆ ఎన్నికల్లో 68 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు కేటీఆర్. ఇక అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ప్రతీ ఎన్నికల్లో తనకు తానే పోటీ అనే స్థాయిలో విజయ పరంపర కొనసాగిస్తున్నారు.

  ఇక.. ఇటీవల కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే.. ఈ సమయంలో శోభ ఇప్పుడేం తొందరొచ్చింది. కాలం కలిసొస్తే అన్నీ అవే జరిగిపోతాయి అన్నారట.

  ఇక... కుమార్తె కవిత ఎదుగుదలలోనూ శోభ పాత్ర ప్రత్యేకమైంది. కవిత రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో తల్లి కాస్త అభ్యంతరపెట్టినా ఆ తర్వాత ప్రోత్సహించారు. కవిత తెలంగాణ జాగృతి ప్రారంభించడంలో తన తల్లి చెప్పిన చిన్ననాటి సంగతులు, అప్పటి సంస్కృతీ సాంప్రదాయాలే ప్రోత్సహించాయి. జాగృతి తరఫున బతుకమ్మ సంబరాలు ప్రారంభించినప్పుడు తల్లి ఎంతో సంతోషించారని చెబుతారు. అంతేకాకుండా... నిజామాబాద్ ఎంపీగా పార్లమెంటు వేదికగా ఆమె చేసి ప్రసంగాలు విని తల్లి ముచ్చటపడేవారని... ఒకింత గర్వపడేవారని తెబుతారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: KTR, Womens Day 2020

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు