Mothers Day 2020 | సృజన గుమ్మళ్ల... నేటి తరం అమ్మకు ప్రతిరూపం...

పసిబిడ్డతో గుమ్మళ్ల శృజన

సృజన గుమ్మళ్ల సైకాలజీ గ్రాడ్యుయేట్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోనే చదివారు. పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు.

 • Share this:
  ఓ చేతిలో రోజుల పసిబిడ్డ. మరో చేతిలో ఫోన్. ఆఫీసు పనిలో నిమగ్నమై ఉన్న మహిళా అధికారి ఫొటో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను బాగా ఆకర్షించింది. బిడ్డను లాలించి, ప్రజలను పాలించే అమ్మకు అచ్చమైన ప్రతిబింబం ఆమె. అటు తల్లిగా బాధ్యతలు. ఇటు ఉద్యోగ ధర్మాన్ని సమపాళ్లలో పాటిస్తున్న ఆమె ఎవరో కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్. పేరు సృజన గుమ్మళ్ల.

  సృజన గుమ్మళ్ల 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆమె తండ్రి కూడా ఓ సీనియర్ ఐఏఎస్ కావడం విశేషం. యూపీఎస్‌సీ ఫలితాల్లో 44వ ర్యాంక్ సాధించారు. ప్రపంచానికి పెద్దగా తెలియని విషయం ఏంటంటే, ఆమె ఉదయం ఆఫీసుకు వెళ్లి డ్యూటీ చేసి వచ్చారు. సాయంత్రం పండండి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఓ తల్లిగా ఆమెకు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవ్ తీసుకునే వెసులుబాటు ఉంది. అయినా 22 రోజులకే ఆమె మళ్లీ ఆఫీసులో అడుగుపెట్టారు. అందుకు కారణం కరోనా వైరస్.

  భర్త రవితేజ, పసిబిడ్డతో సృజన గుమ్మళ్ల


  కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఓ పబ్లిక్ సర్వెంట్‌గా తాను ఇంట్లో ఉండడం ఆమెకు నచ్చలేదు. విధులకు హాజరవుతానని సీఎం వైఎస్ జగ‌న్ మోహన్ రెడ్డిని కోరారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే ఆఫీసుకు వచ్చేశారు.

  సృజన గుమ్మళ్ల


  ఓ వైపు కరోనా లాంటి భయం, మరోవైపు రోజుల పసిబిడ్డ. ప్రజల మధ్య ఉండే ఆమెకు కరోనా రాకుండా చూసుకోవాలి. తన కడుపున పుట్టిన బిడ్డకు కూడా వైరస్ సోకకుండా చూసుకోవాలి. కత్తి మీద సాములాంటి పనిని ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారు. బిడ్డను భద్రంగా ఉంచి కొన్ని గంటలకు ఓసారి పాలిస్తూ అటు తల్లిగా తన డ్యూటీని నిర్వర్తిస్తున్నారు. భర్త రవితేజ (న్యాయవాది), అత్త సహకారం వల్లే తాను ప్రజలకు సేవచేయడానికి సాధ్యమైందని చెప్పారు.

  ఇది సంక్షోభ సమయం. చాలా మంది తమకు తోచిన విధంగా సేవ చేస్తున్నారు. కొందరు డబ్బులు అందిస్తున్నారు. మరికొందరు ఆహారాన్ని అందిస్తున్నారు. ఇంకొందరు ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ విధులకు హాజరుకావడం సముచితం అని భావించా. నేనే కాదు. చాలా మంది పురుషులు, స్త్రీలు తమ వ్యక్తిగత అంశాలను పక్కన పెట్టి కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కష్టపడుతున్నారు. మళ్లీ విధులకు హాజరుకావడానికి నా కుటుంబం, ప్రభుత్వం అందించిన సహకారం మరువలేనిది. నా బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నా.
  సృజన గుమ్మళ్ల, జీవీఎంసీ కమిషనర్


  సృజన గుమ్మళ్ల సైకాలజీ గ్రాడ్యుయేట్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోనే చదివారు. పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. స్వీడన్‌లోని ఉప్సల యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా సాధించారు. గతంలో కొన్నాళ్లు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌లో ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా ఏడాదిపాటు పనిచేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: