మునగాకులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో వీటిని ఔషధంగా కూడా ఉపయోగిస్తుంటారు. జీవక్రియను వేగవంతం చేయడంలో మునగాకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చుండ్రు, జుట్టు రాలడం, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. థైరాయిడ్, పీసీఓఎస్ వంటి హార్మోన్ల సమస్యలతో బాధపడేవారికి మునగాకులు చాలా మంచి డైటరీ సప్లిమెంట్. చుండ్రు, జుట్టు రాలే సమస్య నివారణకు మునగాకులతో హెయిర్ పౌడర్ తయారీని స్టెప్స్ వారీగా తెలుసుకుందాం.
- ముందుగా తాజా మునగాకులను తీసుకోవాలి. వాటిని నీటిలో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత ఆకులను కాటన్ క్లాత్‌పై పరచాలి.
- ఈ ఆకులను ఎండబెట్టే ప్రక్రియను వేగవంతం చేయడం కోసం మునగాలకుపై మరొక వస్త్రాన్ని కప్పవచ్చు.
- ఆకులు పూర్తిగా ఎండిన తర్వాత, వాటిని కాండం నుంచి వేరు చేయండి.
- తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకుని ఆకులను దానిపై నెరపండి. 4-5 రోజుల వరకు వాటిని అలానే ఉంచండి. ఈ సమయంలో ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోండి.
- 6వ రోజు ఆకులు పూర్తిగా పొడిగా మారుతాయి. వాటి నుంచి వచ్చే క్రిస్పీ క్రంచీ సౌండ్ కూడా వినవచ్చు. ఇక ఆ మునగాలను పౌడర్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి.
- చట్నీ గ్రైండర్ లేదా కాఫీ గ్రైండర్‌లో ఆకులను నింపండి. మునగాకులు మెత్తగా పొడి అయ్యేవరకు రెండు మూడు సార్లు గ్రైండ్ చేయండి. చివరికి తాజా ఆర్గానిక్ మునగాకుల పౌడర్ రెడీ.
ఒక బౌల్‌లో అరస్పూన్ మునగ ఆకు పొడి, అరస్పూన్ లవంగాల పొడి, అరస్పూన్ తులసి పొడి, అరస్పూన్ బ్రహ్మీ పౌడర్, షాంపూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. తెల్లజుట్టు నల్లగా కూడా మారుతుంది. ఈ చిట్కాను కాస్త ఓపికగా ఫాలో అయితే జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
మునగ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్ వంటి మూలకాలతో పాటు అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు మునగ ఆకుల్లో ఉన్నాయి. కిడ్నీ సమస్యలకు మునగాకు ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉంటే తప్పనిసరిగా మునగ ఆకులు తింటే ఫలితం ఉంటుంది. మునగ ఆకుల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది. మునగాకుల్లో యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dandruff, Hair fall, Hair Loss, Hair problem tips