ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ముఖ్యంగా మనదేశాన్ని పట్టి పీడిస్తోంది మహమ్మారి. కరోనాను తరిమికొట్టడానికి సామాజిక దూరం, పదే పదే చేతుల్ని శుభ్ర పరుచుకోవడం, మంచి ఆరోగ్య పద్ధతుల్ని పాటించడమే తక్షణ పరిష్కారమని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నారు. సోషల్ డిస్టెన్స్, వ్యాక్సినేషన్, లాక్ డౌన్ ద్వారా కొందరూ కరోనా నుంచి తప్పించుకుంటున్నారు. అయితే, చేతులు శుభ్రపర్చుకోవలంటే శుభ్రమైన నీరు ఉండాలి. బాధకరమైన విషయం ఏంటంటే..మన దేశం స్వచ్చమైన నీరు దొరక్క ఇబ్బందులు పడుతోంది. నీరు ప్రతి ప్రాణికి అవసరమైన అతి ముఖ్యమైన జీవనాధారం. భూమిపై మాత్రమే దొరికే అతి అమూల్యమైన వనరు. అయితే భారత్ లో సుమారు 50 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందని యూనిసెఫ్ చేసిన అధ్యయనంలో తేలింది.కరోనా పాండమిక్ వల్ల నీటి కొరత ఇంకా ఎక్కువ పెరిగిపోతోంది. కరోనా నుంచి వచ్చిన మెడికల్ వేస్టేజ్ ను ఎక్కడిక్కడ నీటి వనరుల్లో డంప్ చేయడం నీరు కలుషితమవుతోంది. విలువైన నీటిని తెలిసే కొందరు. తెలియక మరికొందరు వృథా చేస్తుంటారు.. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నపుడు దాని విలువను గుర్తించకుండా యథేచ్ఛగా వినియోగించిన వారు అదే నీరు దొరకని పరిస్థితుల్లో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.ఇప్పటికీ మేలుకోక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారే గాని, సమస్య పునరావృతం కాకుండా చూసుకోవడం లేదు. మానవాళికి మనుగడనిస్తున్న నీటి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
పెరుగుతున్న జనాభాకు, అందుబాటులో ఉన్న జలవనరులకు మధ్య రోజు రోజుకు అంతరం పెరిగిపోతున్నది. మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుంటే మున్ముందు నీటి ముప్పు పొంచి ఉన్నది. వృథాను అరికట్టకపోవడం, కాలుష్యం పెరిగిపోవడం, చట్టాలను అమలు చేయకపోవడంతో అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకోలేకపోతున్నాం. చేజేతులా మనమే సమస్యను జఠిలం చేసుకుంటున్నాం. ప్రతీ రంగంలో నీరు ప్రధానమైనది. వ్యవసాయం, పరిశ్రమల్లో నీటిని పొదుపుగా వాడుకుంటేనే శ్రేయస్కరమని, భవిష్యత్ తరాలకు అందేలా కృషి చేయాలని పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు.జాతీయ జల కమిషన్ 2019 అంచనా మేరకు దేశంలో ఏటా మూడు లక్షల ఘనపు మీటర్ల నీరు అవసరం. ఇక, వర్షాపాతాలను లెక్కలోకి తీసుకుంటే దేశంలో ఏటా సగటున లభ్యమవుతున్న నీరు సుమారు నాలుగు లక్షల ఘనపు మీటర్లు.వర్షాలు సమృద్ధిగా కురవకపోవడం, జల సంరక్షణ చర్యలు లేకపోవడంతో నీటి వనరులు రానురానూ ‘జలకళ’ కోల్పోతున్నాయి. చెరువులు, కుంటలు, సరస్సులు, చిన్న నదులే కాదు.. పెద్ద పెద్ద నదుల్లో సైతం నీరు ‘ప్రవహించడం’ లేదు. వాననీటిని ఒడిసిపట్టకపోవడం, వర్షాలు గగనమై పోవడంతో 2020 నాటికి మన దేశంలో 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు ‘శూన్య’ స్థాయికి చేరుకోవడం ఖాయమని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘జల్ శక్తి’ మంత్రిత్వశాఖను కొత్తగా ప్రారంభించింది.
ఇంతకుముందు ఉన్న జల వనరులు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం మంత్రిత్వ శాఖలను విలీనం చేసి, ‘జల్ శక్తి’ శాఖను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో నీటికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇకపై ‘జల్ శక్తి’ పర్యవేక్షిస్తుందని ఆ మంత్రిత్వశాఖను చేపట్టిన గజేంద్ర సింగ్ షెఖావత్ తెలిపారు. పరిశుభ్రమైన తాగునీటిని అందించడం, అంతర్ రాష్ట్ర వివాదాలను పరిష్కరించడం, గంగానది ప్రక్షాళన వంటి పనులకు తమ మంత్రిత్వశాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు దేశ ప్రజలకు మంచినీటిని అందించేందుకు వివిధ ప్రణాళికలను తాము అమలు చేస్తామని మంత్రి భరోసా ఇస్తున్నారు. నీటి ఎద్దడిని నివారించడానికే తాము దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు గజేంద్ర సింగ్ చెబుతున్నారు.
ఇక పంటలు పండించడానికి డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులను పాటించాలి. ఇందువల్ల నీరు ఆదా అవుతోంది. పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతినే వాడుతున్నారు. ఇది మంచి ఫలితాల్ని ఇస్తోంది. రైతులు సాంకేతికతను ఉపయోగించి..ముందుకు సాగితే నీటి ఎద్ధడిని నివారించవచ్చు. వర్షం కురిసినపుడు రోడ్లు మునిగిపోవడం, వరద నీరంతా వృథాగా మురుగుకాల్వల్లో కలసిపోవడం నిత్యం మనం చూస్తున్న దృశ్యాలే. వాన నీటిని నిల్వ చేసేందుకు స్థానిక సంస్థలే కాదు, ప్రజలూ ఉద్యమించాలి. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తవ్వి వాన నీటిని నిల్వచేస్తే భూగర్భ జలాలు కాస్తయినా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకుడు గుంతలు లేనిదే ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. ఇంకుడు గుంతల ద్వారా జల సంరక్షణకు జనం స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
‘జల సంరక్షణ.. జన ఉద్యమం..’ వంటి భారీ పదాలతో పని లేదు.. ప్రతి కుటుంబంలోని సభ్యులంతా నీటిని పొదుపుగా వాడితే జల సంరక్షణలో భాగస్వాములైనట్టే. పండ్లు తోముకోవడం, స్నానం, బట్టలు ఉతకడం, వంట సామాగ్రిని శుభ్రం చేయడం, వాహనాలను కడగడం.. ఇలా ప్రతి సందర్భంలోనూ నీటిని పొదుపుగా వాడడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. నీటి విలువ తెలిస్తే నీటి వృథాను సులభంగా అరికట్టవచ్చు. ఇళ్లలోని కుళాయి నుంచి ధార వస్తుండగా నీటిని వృథా చేయడం సర్వసాధారణం. పొదుపు మంత్రం అనేది ధనానికే కాదు, నీటికీ ఎక్కువగా వర్తిస్తుందని అన్ని వయసుల వారూ అవగాహన పెంచుకోవాలి. నీటిని పొదుపుగా వాడడం వల్ల భావి తరాల వారికి మనం ఎంతో మేలు చేసినట్టని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నీటి పొదుపు పాటిస్తేనే- జల సంక్షోభం నుంచి సులువుగా బయటపడే వీలుంటుంది. వంటగది నుంచి వాష్రూమ్ వరకూ నీటిని పొదుపుగా వాడితే రోజూ కొన్ని వందల లీటర్ల నీటిని మనం దాచుకున్నట్టే. పట్టణ, నగర ప్రాంతాలు నీటి కటకట నుంచి బయటపడాలంటే నీటిని అవసరం మేరకే వాడాలి.
----A write up by - Climate Reality India
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mission paani, Save water, Water Crisis, Water harvesting