Health survey: దేశంలోని 50శాతం జనాభాలో ఆ సమస్యలు.. అందరికీ హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

Health survey: దేశంలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో దాదాపు 50 శాతం మందికి ఊపిరితిత్తుల పనితీరు మందగించినట్లు లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా (LASI) సర్వే వెల్లడించింది.

  • Share this:
భారత్‌లో ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో దాదాపు 50 శాతం మందికి ఊపిరితిత్తుల పనితీరు మందగించినట్లు లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా (LASI) సర్వే వెల్లడించింది. ఈ నివేదికను బుధవారం విడుదల చేశారు. 2017-18లో సిక్కిం వినహా ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలపై ఈ అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 45 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 72,250 మంది వ్యక్తుల ఆరోగ్యాన్ని విశ్లేషించారు. వీరిలో 55,186 మందికి స్పిరోమెట్రీ పరీక్షలు చేశారు.

వీరిలో 51 శాతం మందికి మాత్రమే ఎలాంటి ఊపిరితిత్తుల సమస్యలు లేవని గుర్తించారు. మిగతా 40 శాతం మందిలో చిన్నపాటి శ్వాస సంబంధ సమస్యలు కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే బాధితులు ఎక్కువగా ఉన్నారని పరిశోధకులు తేల్చారు. మరో తొమ్మిదిశాతం మందికి ఆస్తమా, సిఓపిడి వంటి తీవ్రమైన శ్వాస కోశ వ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. ఈ బాధితులు పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

ఈ నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వర్చువల్ విధానంలో విడుదల చేశారు. ఈ రిసెర్చ్‌ కోసం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిధులు సమకూర్చింది. భారతదేశంలో 45, అంతకంటే ఎక్కువ వయసున్న ప్రజల ఆరోగ్యం, సామాజిక, మానసిక, ఆర్ధిక శ్రేయస్సుకు సంబంధించిన సైంటిఫిక్ డేటాను అందించడం ఈ పరిశోధన లక్ష్యమని అధ్యయన బృంద సభ్యుడు డాక్టర్ టి వి శేఖర్ చెబుతున్నారు. శాంపిల్ సైజ్ పరంగా చూస్తే LASI రిసెర్చ్ ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధాప్య అధ్యయనమని (ageing study) చెప్పారు. ఇలాంటి పరిశోధనలు మరో 41 దేశాల్లో కూడా నిర్వహించామన్నారు.

ఉత్తరాదిలో ఎక్కువ
LASI అధ్యయనం ఆందోళన కలిగించే అంశాలను తెలియజేసిందని చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ మాజీ డైరెక్టర్, పల్మొకేర్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ హెడ్ డాక్టర్ సందీప్ సాల్వి తెలిపారు. ఈ సమస్యకు ప్రమాద కారకాలను కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సర్వే కోసం దేశంలో స్పిరోమెట్రీ పరీక్షలు చేయడానికి డాక్టర్ సాల్వి ఆధ్వర్యంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. దీనివల్ల పరిశోధన ఫలితాల నాణ్యత, డేటా విశ్లేషణ, రిపోర్ట్ రైటింగ్ వంటివి సత్ఫలితాలను ఇచ్చాయి. గాలి కాలుష్యం కారణంగా వ్యాపించే ఊపిరితిత్తుల వ్యాధుల తీవ్రత ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. కానీ ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ సాల్వి వివరించారు.
Published by:Kishore Akkaladevi
First published: