సంగీతానికి భాష లేదు. ఏ భాష మాట్లాడే వారైనా మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. కానీ సంగీతం ద్వారా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చనే విషయం మీకు తెలుసా? తాజా అధ్యయనంలో ఇదే తేలింది. సంగీతానికి సంబంధించిన అభిరుచుల ద్వారా భాష నైపుణ్యాలు పెంపొందడంతో పాటు మెదడులోని ప్రసంగ ప్రక్రియ ప్రభావితమవుతుందని పరిశోధకులు తేల్చారు. ఇదే సమయంలో రివర్స్ లోనూ జరుగుతుందని, విదేశీ భాషలను నేర్చుకునేటప్పుడు మెదడులోని మ్యూజిక్ ప్రాసెసింగ్ ప్రభావితమవుతుందని పరిశోధకులు నిరూపించారు.
యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ, బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ (BNU), టుర్క్ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 8 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న చైనా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. వీరి బ్రెయిన్లో.. భాష నేర్చుకోవడం, మ్యూజిక్ ప్రాసెసింగ్ మధ్య ఉండే లింకును శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు.
* పరిశోధన ఎలా చేశారు?
సంగీత శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఈ పిల్లలకు అదనంగా ఆంగ్ల భాషకు సంబంధించిన ప్రోగ్రాంను నిర్వహించారు. అనంతరం పిల్లలు ఆడియో శబ్దాలను విన్నప్పుడు వారి మెదడు ప్రతిస్పందనలు కొలిచారు. వీటిని ఇతర పిల్లల ఫలితాలతో పోల్చారు. దీంతో సంగీతం, భాష ప్రోగ్రాం నాడీ ప్రాసెసింగ్ పై ప్రభావం చూపాయని హెల్సింకీ విశ్వవిద్యాలయం ఆచార్యులు, ఈ అధ్యయనం డైరెక్టర్ మారి టెర్వినామీ తెలిపారు. ఆశ్చర్యకరంగా ఆంగ్ల శిక్షణ కార్యక్రమానికి హాజరైన పిల్లల్లో సంగీతపరమైన ధ్వనుల ప్రాసెసింగ్ మెరుగుపడిందని.. మెదడులో మ్యూజిక్, భాషకు సంబంధించిన విధులు దగ్గరగా అనుసంధానమై ఉన్నాయని ఆమె వివరించారు. ఈ రెండూ శ్రవణ అవగాహనను మాడ్యులేట్ చేస్తాయని తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఎలక్ట్రోఎన్సెలో గ్రామ్ (EEG) రికార్డింగులను ఉపయోగించారు. ముందుగా 120 మంది పిల్లలు పరిశోధనలో పాల్గొనగా, ఏడాది తర్వాత వీరిలో 80 మంది మళ్లీ పాల్గొన్నారు. సంగీత శిక్షణ కార్యక్రమంలో వీరికి పాట పాడే అవకాశం కల్పించారు. అంతేకాకుండా చేతి సంకేతాలు, మ్యూజిక్ షీట్ లో ఎలా పాడాలో నేర్పించారు. ఆంగ్ల భాష శిక్షణ కార్యక్రమంలో మాట్లాడటంతో పాటు రాయడంపై శిక్షణ ఇచ్చారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.