Home /News /life-style /

LEARN AND UNDERSTAND THESE 10 POINTS TO BE A PERFECT HUSBAND TO YOUR LIFE PARTNER WIFE SRD

Perfect Husband : ఎలాంటి వారిని మహిళలు మంచి భర్తగా భావిస్తారు? ఈ లక్షణాలు ఉంటే మీరే మంచి భర్త..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Perfect Husband : మంచి భర్త అంటే ఏంటి? ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎలా ఉంటే భార్య ప్రేమను పొందగలరు? ఎలాంటి వారిని మహిళలు మంచి భర్తగా భావిస్తారు? తెలుసుకుందాం.

    దాంపత్య బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే సంసారం సాఫీగా సాగుతుంది. ఒకరికి ఒకరు.. ఒకరి కోసం మరొకరు అనేలా ఉంటే ఆలూమగలిద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇస్తూ, వారిని గౌరవిస్తేనే భేదాభిప్రాయాలు ఎదురుకావు. భార్య దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనే ఆరాటానికి బదులుగా నిజయతీ గల వ్యక్తిగా ఉండటమే మంచిదంటున్నారు మనస్తత్వ నిపుణులు. దాంపత్య జీవితంలో భార్యకు అన్ని అంశాల్లోనూ భరోసా ఇస్తూ... కుటుంబానికి తోడు నీడగా ఉన్నప్పుడే సమాజం నుంచి కూడా మగవాళ్లకు ప్రశంసలు దక్కుతాయి. ఇలాంటి లక్షణాలను భర్తలు అందిపుచ్చుకోవాలి.

    మంచి భర్తగా ఉండటానికి మగవాళ్లు కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటంటే..

    1. భార్యను ప్రేమించాలి: రోజువారీ పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల్లో పడి కొంతమంది మగవాళ్లు భార్యకు తగినంత సమయం కేటాయించరు. ఇలాంటప్పుడే వారు అసంతృప్తిలో కూరుకుపోతారు. ఒక వ్యక్తి అవసరాలు, కోరికలు ఎప్పటికప్పుడు మారవచ్చు. కానీ వీటి కోసం జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే భార్యను మరింత ఎక్కువగా ప్రేమించాలి. ఇందుకు మీరు మార్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. భార్యలకు ఇంటి పనుల్లో సాయం చేయడం, సమయం ప్రకారం తింటున్నారా లేదా అని ఆరా తీయడం, మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి ప్రయత్నించడం... వంటివి చేయాలి.

    2. ముద్దులు కూడా ముఖ్యమే: ఎదుటి వారిపై ఉండే ప్రేమ, ఆప్యాయతలు ముద్దుల ద్వారా వెల్లడవుతాయి. కానీ ముద్దు పెట్టుకోవటం కేవలం యాంత్రికంగా ఉండకూడదు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లేముందు భార్యకు ప్రేమతో కనీసం ఆరు సెకన్ల పాటు ఇచ్చే ముద్దు... వారిని రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది. ఇలాంటి ఫీలింగ్ మీ జీవిత భాగస్వామికి ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి.

    3. గత అనుభూతులు గుర్తు చేయాలి: భార్యకు ఇంటి పనులు... భర్తకు కుటుంబ బాధ్యతలతోనే రోజంతా గడిచిపోతుంది. కొన్నిసార్లు ఒకరితో మరొకరు ప్రేమగా మాట్లాడుకునేంత సమయం ఉండదు. ఇలాంటప్పుడు భర్తలు చొరవ తీసుకోవాలి. ఖాళీ సమయంలో భార్యతో మాట్లాడాలి. మీరు జీవితభాగస్వామిని మొదటిసారి కలుసుకున్న సందర్భం, ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్... వంటి రొమాంటిక్ డిస్కషన్ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గిపోకుండా చేస్తాయి.

    4. ప్రేమభాషను వాడాలి: ప్రేమను అనుభూతి చెందే భాషలో భాగస్వామితో మాట్లాడటం దాంపత్య బంధంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రేమభాష తెలుసుకోవడం, జీవిత భాగస్వామితో ఇదే భాషలో మాట్లాడటం వల్ల ఎంతో సమయాన్ని ఆదా చేయవచ్చు. భార్యతో మాట్లాడేటప్పుడు నిశ్చితమైన పదాలు, ముద్దుపేర్లు వాడాలి. కౌగిలింతలు వంటి శారీరక స్పర్శ ఉండాలి. వారితో సేవాభావంతో మెలగాలి. భార్యలకు నాణ్యమైన సమయం కేటాయించాలి. తరచుగా బహుమతులు ఇవ్వాలి. ఈ చర్యల ద్వారా జీవితభాగస్వామిపై ప్రేమను వ్యక్తపరచవచ్చు.

    5. క్షమాపణలు చెప్పాలి: ప్రేమ భాష మాదిరిగానే క్షమాపణలకు కూడా ప్రత్యేకమైన భాష ఉంటుంది. సంసారంలో కోపతాపాలు తప్పనిసరిగా ఉంటాయి. భాగస్వామిపై కోప్పడినప్పుడు, వారికి నిర్దిష్టమైన పద్ధతుల్లో క్షమాపణ చెప్పాలి. అది ఇద్దరి మధ్య ఏర్పడే గ్యాప్‌ను క్షణాల్లోనే దూరం చేస్తుంది. జీవితభాగస్వామికి ఎలా క్షమాపణలు చెబితే సమస్య పరిష్కారం అవుతుందో భర్తలకు తెలిసి ఉండాలి.

    6. తప్పులకు బాధ్యత వహించాలి: అన్ని విషయాల్లోనూ జీవిత భాగస్వామినే తప్పుపట్టడం సరికాదు. కొన్నిసార్లు భర్తలు కూడా సమస్యను సృష్టిస్తారు. గొడవకు కారణం అవుతారు. ఇలాంటప్పుడు తప్పును ఒప్పుకోవడానికి వెనుకాడకూడదు. మీ ప్రవర్తనకు పూర్తి బాధ్యత తీసుకోవడం సంసారంలో చాలా ముఖ్యం. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడం వల్ల ఇద్దరి మధ్యా గొడవలు దూరమవుతాయి.

    7. అతిగా ఊహించుకోవద్దు: జీవిత భాగస్వామి గురించి మీకు అన్ని విషయాలు తెలిసి ఉండవచ్చు. కానీ వారు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారో కూడా తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసి చూడకూడదు. అతిగా ఊహించుకోవడం వల్ల లేనిపోని అపార్థాలు, అనుమానాలు కలుగుతాయి. ఇవి ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతాయి. అందువల్ల ఇద్దరి మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చినా సరే.. దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు భార్యలను ప్రశ్నలు అడగండి. అనుమానాలను దూరం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎప్పటికీ బాగుండేలా చూడాలి.

    8. మొండితనం వద్దు: సంసారం సజావుగా ముందుకు సాగాలంటే.. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి. మొండి పట్టుదలను దూరం చేసుకోవాలి. ఈ రెండింటినీ మగవాళ్లు అర్థం చేసుకున్నప్పుడే దాంపత్యంలో సుఖం ఉంటుంది. భాగస్వామి చేసిన చిన్న విషయాలను కూడా మీరు క్షమించలేకపోతే, అది జీవితంలో అసంపూర్ణతకు దారితీస్తుంది.

    9. విలువ ఇవ్వాలి: కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ భార్య అభిప్రాయాలు తీసుకోవాలి. వ్యక్తిగత లక్ష్యాలు, ఇంటి బాధ్యతలు, ఆర్థిక అవసరాలు, పేరెంటింగ్ వంటి అంశాల గురించి చర్చించేటప్పుడు జీవిత భాగస్వామికి ఎక్కువ విలువ ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో అనవసర వాదనలకు పోకుండా.. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి భార్య మద్దతు ఉందనే చిన్నపాటి భరోసా, మీ విజయానికి కారణం అవుతుంది.

    10. సమయం కేటాయించాలి: భర్తలు రోజంతా భార్యల కొంగుపట్టుకొని తిరాగాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాలైనా ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవాలి. దీనివల్ల ఇద్దరికీ మానసిక ప్రశాంతత చేకూరుతుంది. భార్యలకు ఇంటి పనులు, భర్తలు ఆఫీసు పనుల వల్ల ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేస్తూ రిఫ్రెష్ అవ్వడానికి ఇది మంచి మార్గం. ఒకరినొకరు మిస్ అవ్వట్లేదనే భరోసా ఇచ్చుకోవడం వల్ల మరింత ప్రేమను అనుభూతి చెందుతారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Life Style, Relationship, Wife and husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు