ప్రతి మనిషి జీవితంలో పెళ్లి మరువలేని ఘట్టమైతే.. హనీమూన్ మధురమైన జ్ఙాపకంగా మిగులుతుంది. ఈ జ్ఙాపకాన్ని మరింత అందంగా, ఆనందంగా జీవితాంతం గుర్తుండేలా మార్చుకోవాలంటే ఆహ్లాదకరమైన హనీమూన్ ప్రదేశాన్ని ఎంచుకోవడం కీలకం. మీరు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట అయితే మీ హనీమూన్ జరుపుకోవడానికి లక్షద్వీప్ గొప్ప ఎంపికగా చెప్పవచ్చు. కోవిడ్–19 కారణంగా అనేక పర్యాటక ప్రదేశాలు సుదీర్ఘ కాలంగా మూసివేశారు. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు. అయితే, ఇతర ప్రదేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొత్త జంటలు అటువైపు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో భారత్‌లో కోవిడ్–19 కేసులు లేని అద్భుతమైన ద్వీపాలకు నెలవైన లక్షదీవులు కొత్త జంటకు స్వర్గధామంగా మారాయి. లక్షద్వీప్ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ఉష్ణమండల ద్వీప వ్యవస్థలలో ఒకటి. ఈ అద్భుతమైన ప్రదేశంలో మొత్తం 4200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 36 ద్వీపాలు విస్తరించి ఉన్నాయి. ఇది భారతదేశంలోని అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం. అత్యంత సహజమైన బీచ్‌లను కలిగి ఉన్న ఈ ప్రదేశం బెస్ట్ హనీమూన్ స్పాట్‌గా చెప్పవచ్చు.
లక్షద్వీప్‌లో సందర్శించాల్సిన ముఖ్యమైన ద్వీపాలు
మీరు హనీమూన్‌లో భాగంగా లక్షద్వీప్‌ను సందర్శిస్తే, ఈ 5 ద్వీపాలను ఖచ్చితంగా సందర్శించండి
1. కవరట్టి ద్వీపం
ఇది లక్షద్వీప్‌లో అత్యంత అభివృద్ధి చెందిన ద్వీపాలలో ఒకటి. ఈ ద్వీపంలో అత్యంత అందమైన ఉజ్రా మసీదుతో సహా 52 మసీదులు విస్తరించి ఉన్నాయి.
2. మినికోయ్ ద్వీపం
మినికోయ్ భౌగోళికంగా ఇతర ద్వీపాల నుండి వేరుగా ఉంటుంది. ఇది 10 గ్రామాల సమూహం.
3. అగట్టి ద్వీపం
లక్షద్వీప్‌లో గల ఏకైక విమానాశ్రయం అగట్టి ద్వీపంలో ఉంది. ఇక్కడ స్కూబా డైవింగ్ వంటి సాహస క్రీడలలో పాల్గొనవచ్చు.
4. కడ్మత్ ద్వీపం
కడ్మత్ ద్వీపం ఏకాంత స్వర్గధామంగా పేరొందింది. కడ్మత్ ద్వీపంలోని లోతైన తీరం, ఏకాంత పర్యాటక గుడిసెలు మిమ్మల్ని కనివిందు చేస్తాయి. ఇది భారతదేశంలో అత్యుత్తమ డైవింగ్ స్పాట్‌గా గుర్తింపు పొందింది.
5. బంగారం ద్వీపం
ఈ ద్వీపం కన్నీటి చుక్క ఆకారంలో ఉంటుంది. ఈ ద్వీపం అంతా క్రీమీ ఇసుకతో చుట్టుముట్టి ఉంటుంది. అందుకే దీన్ని బంగారం ద్వీపంగా పేర్కొంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best tourist places, Tourism