హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి ?.. వాటిని గుర్తించడం ఎలా ?

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి ?.. వాటిని గుర్తించడం ఎలా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Breast Cancer Symptoms: చర్మంలో మార్పులు, రొమ్ములో నొప్పి, చనుమొన లోపలికి వెళ్లడం, చనుమొన నుంచి అసాధారణమైన ద్రవాలు కారడం వంటివి మరికొన్ని సాధారణ లక్షణాలు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు బాధితులందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. వివిధ వ్యక్తుల్లో వివిధ రకాల లక్షణాలు బయట పడవచ్చు. అత్యంత సాధారణ లక్షణం.. బాధితుల రొమ్ము లేదా చంకలో గడ్డ లాంటి ముద్ద ఏర్పడటం. చర్మంలో మార్పులు, రొమ్ములో నొప్పి, చనుమొన లోపలికి వెళ్లడం, చనుమొన నుంచి అసాధారణమైన ద్రవాలు కారడం వంటివి మరికొన్ని సాధారణ లక్షణాలు.* రొమ్ము క్యాన్సర్ ముందస్తు హెచ్చరిక సంకేతాలు (Early Warning Signs) కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
- బాధితుల రొమ్ము లేదా చంకలో ఏర్పడే గడ్డ (Lump) పూర్తిగా నయం కాదు. ఇది రొమ్ము క్యాన్సర్ మొదటి లక్షణం. ఈ గడ్డను బాధితులు గుర్తించడానికి ముందే వైద్యులు మామోగ్రామ్‌లో వీటిని గుర్తించవచ్చు.
- బాధితుల చంకలో లేదా కాలర్‌బోన్ దగ్గర వాపు ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ ఆ ప్రాంతంలోని శోషరస గ్రంథులకు (Lymph nodes) వ్యాపించిందని దీని అర్థం. గడ్డ ఏర్పడటానికి ముందే ఈ వాపు ప్రారంభం కావచ్చు. కాబట్టి రొమ్ము, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాపు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
- సాధారణంగా ఈ గడ్డలు బాధించనప్పటికీ కొన్నిసార్లు నొప్పి, అసౌకర్యం వంటివి కలుగుతాయి.
- రొమ్ముపై ఏదైనా ప్రాంతంలో చర్మం సొట్టబడినట్లు కనిపించడం మరో లక్షణం. కంటికి కనిపించని లేదా అనుభూతి చెందని కణితి కారణంగా ఇలా జరగవచ్చు.
- రొమ్ము పరిమాణం, ఆకృతి, ఉష్ణోగ్రతలో తేడా, రొమ్ములో మార్పులు, రొమ్ము కిందిభాగం రంగు మారడం కూడా వ్యాధికి లక్షణాలు.
- చనుమొనలో కనిపించే కొన్ని మార్పులు.. అంటే చనుమొన రొమ్ము లోపలికి వెళ్లడం, ఆ ప్రాంతం సొట్టబడినట్లు కనిపించడం, మంట, దురద, అక్కడ పుండ్లు ఏర్పడటం, చనుమొన రంగు మారడం, లేదా అసాధారణ ద్రవాలు కారడం వంటివన్నీ రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలుగా చెప్పవచ్చు.
** రొమ్ము క్యాన్సర్ రకాలు, లక్షణాలు
రొమ్ము క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. వ్యాధి రకాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. కాబట్టి నిర్దిష్ట క్యాన్సర్ రకం ఆధారంగా బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం.
* డక్టల్ కార్సినోమా (Ductal carcinoma) లక్షణాలు
ఇది రొమ్ము క్యాన్సర్‌లో అత్యంత సాధారణ రకం. ఇది రొమ్ముల్లోని నాళాలలో ప్రారంభమవుతుంది. సగటున ప్రతి ఐదు రొమ్ము క్యాన్సర్లలో ఒకటి డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS) రకం అని నివేదికలు చెబుతున్నాయి. నాళాల గోడలను ఏర్పరిచే కణాలలో వచ్చే క్యాన్సర్ ఇది, కానీ ఇది సమీపంలోని కణజాలంలోకి వ్యాపించలేదు. బాధితులు డక్టల్ కార్సినోమా లక్షణాలను అసలు గమనించకపోవచ్చు. రొమ్ములో గడ్డలు (Breast lump) లేదా చనుమొనల నుంచి రక్తం కారడం వంటివి దీని ప్రధాన లక్షణాలు.
* లోబ్యులర్ కార్సినోమా (Lobular carcinoma) లక్షణాలు
పాలను తయారుచేసే గ్రంధులలో ఈ రకం క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఈ గ్రంధులను లోబుల్స్ అని పిలుస్తారు. ఇది రొమ్ము క్యాన్సర్‌లో రెండో అత్యంత సాధారణ రకం. రొమ్ములో ఏదైనా ప్రాంతం గట్టిపడటం, మందంగా, అసౌకర్యంగా అనిపించడం లేదా వాపు వంటివి దీని ప్రధాన లక్షణాలు. చనుమొన రొమ్ములోపలికి కుంచించుకుపోవడం లేదా చదునుగా మారడం వంటివి మరికొన్ని లక్షణాలు.
* ఇన్వాసివ్ (Invasive) బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు
రొమ్ము క్యాన్సర్ ప్రారంభమైన చోటు నుంచి దాని చుట్టూ ఉన్న కణజాలాలలోకి వ్యాపించడాన్ని ఇన్వాసివ్ లేదా ఇన్‌ఫిల్ట్రేటింగ్ అంటారు. రొమ్ము లేదా చంకలో గడ్డలు, ఒక రొమ్ము మరొకదానికి భిన్నంగా కనిపించడం, దద్దుర్లు, చర్మం మందంగా ఎరుపు లేదా నారింజ రంగులోకి మారడం, రొమ్ముల చర్మంపై పుండ్లు, వాపు, నొప్పి వంటివి ఇన్వాసివ్ క్యాన్సర్ లక్షణాలు.
* మెటాస్టాటిక్ (Metastatic) బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు
రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స తీసుకోకపోతే క్యాన్సర్ ఇతర అవయవాలకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీనిని మెటాస్టాటిక్, అడ్వాన్స్‌డ్ లేదా సెకండరీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ ఎక్కడ ఏర్పడుతుంది అనేదాన్ని బట్టి కొన్ని సాధారణ లక్షణాలను గుర్తించవచ్చు. బాధితుల్లో ఎముకల నొప్పి, తలనొప్పి, మెదడు పనితీరులో మార్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బొడ్డు వాపు, కామెర్లు, చూపు మసకబారడం, వికారం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చు.
* ట్రిపుల్-నెగిటివ్ (Triple-negative) బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు
రొమ్ము క్యాన్సర్‌లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్‌లకు గ్రాహకాలు లేకుంటే, HER2 అనే ప్రోటీన్‌ను ఎక్కువగా తయారు చేయకపోతే.. ఆ పరిస్థితిని ట్రిపుల్-నెగిటివ్ అంటారు. ఈ రకం క్యాన్సర్ ఇతర రకాల కంటే వేగంగా పెరుగుతుంది, వ్యాప్తి చెందుతుంది. రొమ్ము క్యాన్సర్లలో ట్రిపుల్-నెగెటివ్ ట్యూమర్లు 10% నుంచి 15% వరకు ఉంటాయి. అవి ఇతర సాధారణ రకాల మాదిరిగానే అవే లక్షణాలను కలిగిస్తాయి.
* మగవాళ్లలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు
మొత్తం రొమ్ము క్యాన్సర్లలో దాదాపు 1% పురుషులలో సంభవిస్తున్నాయి. ఇది చాలా అరుదు కాబట్టి, క్యాన్సర్ పెరిగే వరకు లక్షణాలపై బాధితులు దృష్టి పెట్టకపోవచ్చు. బాధితుల రొమ్ము లేదా చంకలో గడ్డ లేదా మందపాటి మచ్చ ఏర్పడటం, రొమ్ము లేదా చనుమొన వద్ద ఉండే చర్మం ఎర్రగా మారడం, పొలుసులు రావడం, అసాధారణ స్రావాలు కారడం వంటి మార్పులు కనిపిస్తాయి.
* రొమ్ము పేగెట్స్ వ్యాధి (Paget’s disease) లక్షణాలు
ఈ రకం క్యాన్సర్ డక్టల్ కార్సినోమాతో పాటు రావచ్చు. ఇది మీ చనుమొన, ఐరోలా చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు తామర లాగా ఉండవచ్చు. వీటితో పాటు పొలుసులు, చనుమొన ఎర్రగా మారడం, చనుమొన నుంచి స్రావాలు కారడం, చనుమొన ఫ్లాట్‌గా లేదా లోపలికి వెళ్లినట్టు కనిపించడం, మంట, దురద వంటివి ఈ వ్యాధి లక్షణాలు.


* ఇన్‌ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ (IBC) లక్షణాలు
ఇన్‌ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇన్‌ఫెక్షన్ లాంటి లక్షణాలను కలిగించే అరుదైన రకం. రొమ్ము ఉష్ణోగ్రత పెరగడం, ఉబ్బడం, ఎర్రగా మారడం, రొమ్ములపై సొట్టలు కనిపించడం, చర్మం మందంగా మారడం, చనుమొన లోపలికి వెళ్లడం, అసాధారణ స్రావాలు కారడం వంటివి ఈ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు.
Cholesterol For Ages: మీ వయసు ప్రకారం.. మీ శరీరంలో ఎంత కొలెస్ట్రాల్ ఉండాలో తెలుసా ?.. డాక్టర్లు ఏమంటున్నారంటే..
Causes Of Diabetes: అసలు షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది ?..ఈ సమస్యకు దారితీసే కారణాలు ఏవి?
* పాపిల్లరీ కార్సినోమా (Papillary carcinoma) లక్షణాలు
ఇది చాలా అరుదైన డక్టల్ క్యాన్సర్. కణితిపై ఉన్న చిన్న చిన్న ముద్దలు లేదా పాపుల్స్ కారణంగా దీనికి ఈ పేరు పెట్టారు. చిన్న, గట్టి తిత్తి, చనుమొన నుంచి రక్తంతో కూడిన స్రావాలు కారడం వంటివి దీని సాధారణ లక్షణాలు.
* యాంజియోసార్కోమా (Angiosarcoma) లక్షణాలు
రొమ్ము క్యాన్సర్లలో యాంజియోసార్కోమా రకం క్యాన్సర్ల వాటా 2% కంటే తక్కువ. ఇవి రక్త నాళాలు లేదా శోషరస గ్రంధుల గోడలను నిర్మించే కణాలలో ప్రారంభమవుతాయి. యాంజియోసార్కోమా లక్షణాల్లో.. రొమ్ములో గడ్డలు, చనుమొన చుట్టూ ఉండే ప్రాంతంపై గాయాలు, చిన్నపాటి ఒత్తిడి, గీతలకే రక్తస్రావం కావడం, రొమ్ములోని ఏదైనా భాగంలో నొప్పి వంటివి కనిపిస్తాయి.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Breast cancer

ఉత్తమ కథలు