మధుమేహాన్ని అర్థం చేసుకోవడానికి ముందు శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ విధులను అర్థం చేసుకోవాలి. ఇన్సులిన్ అనేది మన శరీరంలోని క్లోమ గ్రంధి (Pancreas) ఉత్పత్తి చేసే హార్మోన్. క్లోమ గ్రంధి ఇన్సులిన్‌ను రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఇలా రక్తంలో ప్రవహించే ఇన్సులిన్, శరీర కణాలలోకి చక్కెర (గ్లూకోజ్) ప్రవేశించేలా చేస్తుంది. దీనిద్వారా శరీరానికి శక్తి అందుతుంది. అంటే ఈ ప్రక్రియలో ఇన్సులిన్ వ్యక్తుల రక్తప్రవాహంలో చక్కెర మొత్తాన్ని తగ్గిస్తుంది. మీ రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతే, క్లోమ గ్రంధి నుంచి ఇన్సులిన్ స్రావం కూడా తగ్గుతుంది.
గ్లూకోజ్ అనేది ఒక రకమైన చక్కెర. కండరాలు, ఇతర కణజాలాలను తయారు చేసే కణాలకు ఇది శక్తి వనరు. మన శరీరానికి గ్లూకోజ్ రెండు ప్రధాన వనరుల నుంచి అందుతుంది. వ్యక్తులు తినే ఆహారం లేదా కాలేయం ద్వారా ఇది లభిస్తుంది. ఈ చక్కెర రక్తప్రవాహంలో కలిసి, ఇన్సులిన్ సహాయంతో శరీర కణాలలోకి ప్రవేశిస్తుంది. మన కాలేయం కూడా గ్లూకోజ్‌ను తయారు చేసి, నిల్వ చేస్తుంది. ఎవరైనా సమయం ప్రకారం తిననప్పుడు గ్లూకోజ్ కొరత ఏర్పడుతుంది. గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కాలేయం నిల్వ చేసిన గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. ఇలా గ్లూకోజ్ స్థాయిని సాధారణ పరిధిలో ఉంచడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది.
శరీర కణాలకు శక్తి అందించే ప్రక్రియలో ఇన్సులిన్ సమర్థంగా పనిచేయాలి. ఒకవేళ క్లోమ గ్రంధి ఇన్సులిన్‌ను సరిగా ఉత్పత్తి చేయకపోయినా లేదా ఇన్సులిన్ పనితీరులో లోపాలు ఉన్నా.. రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగే ఈ స్థితినే డయాబెటిస్ లేదా మధుమేహం అంటారు. దీంట్లో వేర్వేరు రకాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డయాబెటిస్‌ను మూడు రకాలుగా వర్గీకరించింది. అవే టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్.
మధుమేహం రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇవి అందరిలోనూ ఒకేలా ఉండవు. జన్యుపరమైన సమస్యలు, కుటుంబ చరిత్ర, జాతి, ఆరోగ్యం, పర్యావరణ కారకాలపై ఆధారపడి మధుమేహం కారణాలు మారుతూ ఉంటాయి. వ్యక్తిని, డయాబెటిస్ రకాన్ని బట్టి కూడా ఇవి మారుతూ ఉంటాయి.
ఉదాహరణకు టైప్ 1 డయాబెటిస్ కారణాలు, గర్భధారణ సమయంలో వచ్చే జెస్టేషనల్ డయాబెటిస్‌కు కారణాలకు సంబంధం ఉండదు. అలాగే టైప్ 2 డయాబెటిస్ రావడానికి దోహదం చేసే కారణాలు, టైప్ 1 డయాబెటిస్ కారణాలకు భిన్నంగా ఉంటాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ కారణాలు చాలా భిన్నంగా ఉంటాయి. టైప్ 1 మధుమేహం అనేది క్లోమ గ్రంధి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఎదురవుతుంది. అయితే ఇన్సులిన్ పనితీరులో లోపాల కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.
* టైప్ 1 డయాబెటిస్ రావడానికి కారణాలు
క్లోమ గ్రంధిలో ఇన్సులిన్‌ను తయారు చేసే కణాలను వ్యక్తుల స్వీయ రోగనిరోధక వ్యవస్థ నాశనం చేయడం వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల శరీరం సాధారణంగా పనిచేయడానికి తగినంత ఇన్సులిన్ కొరత ఏర్పడి మధుమేహం వస్తుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అంటారు. ఈ పరిస్థితి ఎందుకు ఎదురవుతుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు లేవు. కానీ కొన్ని అంశాల కారణంగా ఇలా జరగవచ్చని వైద్య పరిశోధనలు వెల్లడించాయి. అవేంటంటే..
- వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్
- ఆహారంలో రసాయనాలు (Chemical toxins) కలవడం
- ఆటో ఇమ్యూన్ రియాక్షన్‌కు కారణమయ్యే సమ్మేళనాలు
- జన్యుపరమైన మార్పులు
* టైప్ 2 డయాబెటిస్ రావడానికి కారణాలు
టైప్ 2 డయాబెటిస్‌కు కారణాలు చాలా ఉంటాయి. వీటిలో ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ ప్రధానమైనది. తల్లిదండ్రులు, తోబుట్లువుల్లో టైప్ 2 డయాబెటిస్ ఉంటే.. ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే టైప్ 2 డయాబెటిస్‌కు అనేక రకాల ప్రమాద కారకాలు ఉన్నాయి. అవేంటంటే..
- ఊబకాయం
- బద్దకమైన జీవనశైలిని
- వయసు పెరగడం
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం
- గర్భం లేదా అనారోగ్యం వంటి ఇతర పరిస్థితులు కూడా టైప్ 2 డయాబెటిస్‌కు కారణాలు.
* జెస్టేషనల్ డయాబెటిస్‌కు కారణాలు
గర్భంతో ఉన్న మహిళల్లో వచ్చే మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఈ పరిస్థితికి నిర్ణీత కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు తెలియదు. అయితే ఈ ప్రమాదాన్ని పెంచే కారకాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
- కుటుంబంలో ఎవరికైనా జెస్టేషనల్ డయాబెటిస్ రావడం
- అధిక బరువు లేదా ఊబకాయం
- పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడటం
- కడుపులో బిడ్డ బరువు ఎక్కువగా ఉండటం
జెస్టేషనల్ డయాబెటిస్ కారణాలు జాతికి సంబంధించినవి కావచ్చు. ముఖ్యంగా కొన్ని జాతులకు (ethnic groups) చెందిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.
* ఇతర కారణాలు
మధుమేహం రావడానికి అనేక ఇతర వైద్యపరమైన కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి..
- ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటెక్టమీ
క్లోమ గ్రంధికి వచ్చే ప్యాంక్రియాటైటిస్ (Pancreatitis) లేదా ప్యాంక్రియాటెక్టమీ (Pancreatectomy) అనే సమస్యలు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
- పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్న మహిళల్లో మధుమేహం రిస్క్ ఎక్కువ. PCOS రావడానికి ఊబకాయం సంబంధిత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక కారణం. ఇది ప్రీ-డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
- కుషింగ్స్ సిండ్రోమ్
కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగే సమస్యను కుషింగ్స్ సిండ్రోమ్ (Cushing’s syndrome) అంటారు. కార్టిసాల్ హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల కూడా మధుమేహం రావచ్చు.
- గ్లూకోగోనోమా (Glucagonoma)
క్లోమ గ్రంధిలోని ఆల్ఫా కణాల్లో ఏర్పడే కణితిని గ్లూకోగోనోమా అంటారు. దీని ఫలితంగా గ్లూకాగాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. గ్లూకాగాన్ ఉత్పత్తి, ఇన్సులిన్ ఉత్పత్తి మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల గ్లూకోగోనోమా ఉన్న రోగులు మధుమేహం బారిన పడవచ్చు.
- స్టెరాయిడ్ మధుమేహం
కొన్ని రకాల క్యాన్సర్లకు చికిత్సగా గ్లూకోకార్టికాయిడ్ థెరపీ (glucocorticoid therapy) చేయించుకోవడం వల్ల ఎదురయ్యే అరుదైన మధుమేహాన్ని స్టెరాయిడ్ ప్రేరిత మధుమేహం అంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diabetes