Diabetes: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యం(Health)పై శ్రద్ధ తీసుకోవడం లేదు. శారీర శ్రమ తగ్గడం, వేళకు ఆహారం(Food) తీసుకోకపోవడం, నిద్ర లేమి వంటి సమస్యలు అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ఫాస్ట్‌ఫుడ్‌ను ఎక్కువ మంది ఆశ్రయిస్తుండటంతో సరైన పోషకాలు అందక రోగాల బారిన పడుతున్నారు. భారత్‌లో షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. షుగర్ వ్యాధి సోకితే ఆ తర్వాత చాలా రోగాలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ షుగర్ వ్యాధి అంటే ఏంటి? అది ఎన్ని రకాలు, వాటి లక్షణాలు, కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావం
శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమై, అలా దీర్ఘకాలంగా కొనసాగితే ఆ స్థితిని మధుమేహం (షుగర్‌వ్యాధి) అంటారు. డయాబెటిస్‌లో మూడు రకాలు ఉన్నాయి. టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిస్. తినే వివిధ ఆహార పదార్థాల నుంచి స్వీకరించే చక్కెర రూపం గ్లూకోజ్. ఇది రక్తంలో ఉంటుంది. ఈ గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలో ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. దీన్ని ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీర రక్తప్రవాహం నుంచి కణాలలోకి గ్లూకోజ్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. ఆ తరువాత ఇది శక్తిగా మారుతుంది. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తికి సరిగ్గా స్పందించనప్పుడు లేదా దాన్ని పూర్తిగా ఉత్పత్తి చేయడం ఆపి వేసినప్పుడు, మధుమేహం రావడం ప్రారంభమవుతుంది.
టైప్ 1 డయాబెటిస్
ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్‌లోని ఆరోగ్యకరమైన బీటా కణాలపై రోగనిరోధక వ్యవస్థ పొరపాటున దాడి చేసినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో టైప్ 1 మధుమేహం వస్తుంది. టైప్ - 1 డయాబెటిస్ ఒకసారి వస్తే ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. టైప్-1 మధుమేహం ఎందుకు వస్తుందో అందుకు కచ్చితమైన కారణాలను నిపుణులు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. అయితే జన్యుపరమైన సమస్యల కారణంగానే టైప్ -1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువని అభిప్రాయపడుతున్నారు.
టైప్-2 డయాబెటిస్
శరీరం ఇన్సులిన్ నిరోధకతను పెంచుకోవడంతో సమస్య మొదలవుతుంది. దీనివల్ల శరీరం అవసరం లేకున్న ఇన్సులిన్‌ను ఉపయోగించుకుంటుంది. దీంతో ప్యాంక్రియాస్ మరింత ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అది అవసరానికి అనుగుణంగా ఉండదు. దీంతో రానురానూ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. ఈ స్థితిని టైప్ -2 డయాబెటిస్ అంటారు. టైప్-2 డయాబెటిస్ రావడానికి కచ్చితమైన కారణాలు ఇప్పటికీ తెలియవు. అయితే జన్యుపరమైన సమస్యలు, మారిన జీవన శైలి, ఊబకాయం వంటి వాటి వల్ల కూడా ఈ రకం డయాబెటిస్ సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
గర్భధారణ మధుమేహం(జేస్టేషనల్ డయాబెటిస్)
స్త్రీ గర్భం దాల్చినప్పుడు ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను నిరోధించే హార్మోన్ల వల్ల గర్భధారణ మధుమేహం వస్తుంది. ఈ రకమైన మధుమేహం గర్భధారణ సమయంలో మాత్రమే జరుగుతుంది. గర్భధారణకు ముందు కూడా రావచ్చు. లేదా మధుమేహానికి ముందు ప్రీ-డయాబెటిస్ లక్షణాలు ఉన్న స్ట్రీలకు రావచ్చు. అదేవిధంగా వంశపారంపర్యంగా కూడా ఈ రకం డయాబెటిస్ రావడానికి ఆస్కారం ఉంది. గర్భధారణ మధుమేహంతో బాధపడుతున్న మహిళల్లో దాదాపు సగం మంది చివరికి టైప్ -2 డయాబెటిస్ బారిన పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diabetes