Face Masks: మాస్క్‌లు కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

ప్రతీకాత్మక చిత్రం

Face Masks: వివిధ వెబ్‌సైట్లు, దుకాణాలలో తక్కువ ధరల్లో అందుబాటులో ఉండే మాస్కులను కొని మోసపోవద్దు. మంచి నాణ్యత ఉండేవి ఎంచుకుంటే వైరస్‌తో పాటు కాలుష్య కణాలకు దూరంగా ఉండవచ్చు.

  • Share this:
కారణాలు ఏవైనా భారతదేశంలో వాయు కాలుష్యం పెరుగుతోంది. మరోవైపు కరోనా విజృంభిస్తోంది. దీనికి వాయు కాలుష్యం తోడవ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారుతోంది. కోవిడ్-19 బారిన పడినవారు వాయుకాలుష్యం ప్రభావానికి గురైతే చనిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ కాలం కాలుషితమైన వాతావరణంలో ఉండే వారు కోవిడ్-19 ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ పరిశోధనను కార్డియోవాస్కులర్ రీసెర్చ్‌లో ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా COVID-19తో చనిపోయే వారిలో 15శాతం వరకు దీర్ఘకాలిక వాయు కాలుష్యం ప్రభావానికి గురైనవారేనని నిపుణులు చెబుతున్నారు. ఐరోపాలో ఇది 19 శాతం, ఉత్తర అమెరికాలో 17 శాతం, తూర్పు ఆసియాలో 27శాతంగా ఉంది.

ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌ ధరించాలి. ఇవి కరోనా నుంచి రక్షించడంతో పాటు, మనం పీల్చుకునే కలుషితమైన గాలిని ఫిల్టర్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. కాలుష్య కారకాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంది. వీటిని ఫేస్ మాస్క్‌లు అడ్డుకుంటాయి.

ఎలాంటి మాస్కులను ఎంచుకోవాలి?
ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఫేస్ మాస్క్‌లు కనిపిస్తున్నాయి. వాటిల్లో సరైన వాటిని ఎంచుకోవాలి. వివిధ సంస్థలు COVID-19 నుంచి రక్షణ కల్పించే మాస్కులను ఉత్పత్తి చేస్తున్నాయి. అన్ని సంస్థలూ తమ ఉత్పత్తులే మేలైనవని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన వాటినే వినియోగదారులు ఎంచుకోవాలి. వైరస్‌తో పాటు కాలుష్య కారకాలను సమర్థంగా అడ్డుకునే వాటిని గుర్తించాలి. ప్రతి మాస్కులో కొన్ని పొరలు ఉంటాయి. అవే గాలి ద్వారా వైరస్‌, బ్యాక్టీరియాలను శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఇలా వివిధ పొరలు ఉంటూ, కలుషితమైన గాలిని ఫిల్టర్ చేసే సామర్థ్యం ఉండే బ్రాండెడ్ కంపెనీ మాస్కులను ఎంచుకోవడం మంచిది.

ధర ఎక్కువైనా నాణ్యతే ముఖ్యం
వివిధ వెబ్‌సైట్లు, దుకాణాలలో తక్కువ ధరల్లో అందుబాటులో ఉండే మాస్కులను కొని మోసపోవద్దు. మంచి నాణ్యత ఉండేవి ఎంచుకుంటే వైరస్‌తో పాటు కాలుష్య కణాలకు దూరంగా ఉండవచ్చు. ఈ హై క్వాలిటీ మాస్కులు బయట రోడ్లపై అమ్మే వాటితో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. వీటి ధర కూడా ఎక్కువగానే ఉండవచ్చు. అదనపు రక్షణ కల్పించే మాస్కులను ఎక్కువ ధరకు కొనడం వల్ల నష్టమేం ఉండదు. తక్కువ ధరల్లో లభించే మాస్కులు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చని గుర్తించాలి.

రేటింగ్ చూడాలి
N95, N99 మాస్కులు వైరస్‌తో పాటు కాలుష్య కారకాలను అడ్డుకోగలవు. ఇలాంటి మాస్కులను ఎంచుకునే ముందు వాటి రేటింగ్ చూడాలి. ఈ మధ్య సర్జరీ మాస్కులు, సాధారణ వస్త్రంతో కుట్టిన మాస్కులు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించలేవు. వీటికి బదులుగా చేతి రుమాలును రెండు మూడు పొరలుగా చేసి ముఖానికి కట్టుకోవడం మంచిది. గాలి వడపోత కోసం ఉద్దేశించిన మాస్కుల్లో చాలా పొరలు ఉంటాయి. వీటిలో పెద్ద కణాలను అడ్డుకునే ప్రాథమిక పొర, చిన్న కణాల కోసం మరికొన్ని పొరలు ఉంటాయి. కొన్ని ఉత్పత్తుల్లో యాక్టివేటెడ్ కార్బన్ పొరలు కూడా ఉండాయి. ఇవి గాలిలో ఉండే కాలుష్య కణాలను సమర్థంగా అడ్డుకుంటాయి.

వాల్వులు ఉండేవే ఎంచుకోవాలా?
కొన్ని బ్రాండెడ్ మాస్కులు వాల్వులతో వస్తున్నాయి. రోజువారీ వినియోగానికి వాల్వులు లేని బ్రాండెడ్ మాస్కును ఎంచుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు మాస్కు లోపల తేమ ఏర్పడటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఒక్క వాల్వు ఉండే మాస్కులను ఎంచుకోవచ్చు. జాగింగ్, సైక్లింగ్ వంటి ఫిట్‌నెస్ రొటీన్ కోసం రెండు వాల్వులు ఉండే మాస్కులను ఎంచుకోవడం మంచిది. వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో శ్వాస తీసుకోవడానికి, వదిలేయడానికి ఇవి అనువుగా ఉంటాయి.
Published by:Kishore Akkaladevi
First published: