నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ఒక భాగంగా మారింది. ఒత్తిడి, ఆందోళనలు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయి. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవన శైలి వ్యాధులకు ఇవి కారణమవుతున్నాయి. ఈ సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి బుధవారంనాడు జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం(National Stress Awareness Day)గా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఇది నవంబర్ 4న వచ్చింది. మన జీవితంలో ఒత్తిడికి కారణమయ్యే అంశాలను గుర్తించి, వాటిని ఎదుర్కొనే ప్రయత్నాలు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఒత్తిడి మానసిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీంతో పాటు ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఒత్తిడికి దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. దీంతో పాటు కొన్ని సూచనలను పాటించాలి. సమతులాహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, పని మధ్యలో విరామం తీసుకోవడం, సానుకూల ఆలోచనా దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం వంటి ప్రాథమిక అలవాట్ల ద్వారా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకోవలసిన కొన్ని సాధారణ జాగ్రత్తలు...
మీ గురించి మీరు ఆలోచించుకోవాలి
రోజంతా ఏదో ఒక పని చేస్తూ కూర్చోకుండా, రోజులో కొంత సమయమైనా మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీకు సంతృప్తినిచ్చే పనులే చేయాలి. మనసు ప్రశాంతంగా ఉండటానికి ఆరోగ్యకరమైన శరీరం కావాలి. ఇందుకు మీరు అన్నిరకాల పోషకాలుండే సమతులాహారం తీసుకోవాలి. కెఫిన్, చక్కెరలను పరిమితంగా తీసుకోవాలి. ఖాళీ సమయాల్లో మీ అభిరుచులపై దృష్టి పెట్టండి. మీకు మీరే విలువైన వ్యక్తిగా భావిస్తూ, ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
మానవ శరీరం సహజంగానే ఒత్తిడిపై పోరాడగలదు. కానీ ఇందుకు శారీరక చురుకుదనం ఉండాలి. వ్యాయామం, కసరత్తుల వల్ల శరీరంలో ఎండార్ఫిన్‌లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి ఉత్తేజాన్ని పెంచుతూ, రోజువారీ సమస్యల నుంచి దూరంగా ఉండేలా చూస్తాయి. అందువల్ల క్రమం తప్పకుండా వ్యాయామం చేసేలా ప్రణాళిక వేసుకోండి. ఒత్తిడి నిర్వహణ (stress management) కోసం యోగా, ధ్యానం వంటివి సాధన చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
శారీరక ఆరోగ్యం
థైరాయిడ్, గుండె సమస్యలు, విటమిన్ లోపాలు వంటివి సాధారణంగా శారీరక అనారోగ్యాన్ని సూచిస్తాయి. కానీ వాటి ప్రభావం మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మీరు మానసిక సమస్యపై దృష్టి పెట్టేముందు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోండి. ఒత్తిడిలో కూరుకుపోతున్నామనే అనుమానం వస్తే, ముందు ఇతర ఆరోగ్య సమస్యలేవైనా దానికి దారితీస్తున్నాయేమో తెలుసుకోవాలి.
ధ్యానం అలవాటు చేసుకోవాలి
సంపూర్ణమైన ఆరోగ్యానికి యోగా, ధ్యానం ఎంతగానో సహాయపడతాయి. ఒత్తిడితో బాధపడేవారు మానసిక ప్రశాంతత కోసం నిపుణుల సలహాతో యోగా, ధ్యానం వంటివి ప్రయత్నించాలి. సాధారణంగా ఒక వ్యక్తి శారీరక శ్రేయస్సు (physical well-being) ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిని మెరుగుపచుకుంటే ఇలాంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చు.
ఒంటరిననే భావనను వీడండి
జీవితంలో ఒడిదొడుకులు సాధారణమైన విషయాలని గుర్తుంచుకోండి. మీకు ఎవరూ లేరని, ఎవరూ పట్టించుకోవట్లేదని బాధపడుతూ కూర్చోవడం వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొంతమంది మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. అంత మాత్రాన మీరు ఏదో తప్పు చేస్తున్నారని భావించాల్సిన అవసరం లేదు. అందుకే చిన్న చిన్న విషయాలకు బాధపడకుండా, మిమ్మల్ని అర్థం చేసుకునే వారితో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోండి. ఒంటరిగా అనిపించినప్పుడు స్నేహితులు, సన్నిహితులతో మాట్లాడండి. బాధను పంచుకోవడానికి సిగ్గు పడకూడదు. జీవితంలో ఒక భాగమైన ఒత్తిడి సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇలాంటి చిట్కాలు పాటిస్తే మంచి ప్రతిఫలం కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.