మంచి పోషకాలున్న బెల్లంను మితంగా తింటే కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. చక్కెర, బెల్లం రెంటిలోనూ ఒకే కాలోరిఫిక్ వాల్యూలు ఉంటాయి. కనుక బెల్లం మంచిదని హ్యాపీగా లాగించేయకండి. పంచదారను పలు రసాయనాలతో తయారు చేస్తారు కనుక వీలైనంత ఈ వైట్ షుగర్ కు దూరంగా ఉంటే మంచిది. మీరు చేసుకునే టీ, కాఫీ, స్వీట్లు, డెజర్ట్సు, జ్యూసుల్లో వీలైనంత మేరకు చక్కెర వాడకుండా జాగ్రత్తపడండి. చక్కెరకు చక్కని ప్రత్యామ్నాయమైన బెల్లాన్ని వాడటం అలవాటు చేసుకోండి. బెల్లంలోని పోషకాలు రక్తహీనత వంటి వాటిని అధిగమించేలా చేస్తాయి. కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని పెంపొందించే స్వచ్ఛమైన నల్ల బెల్లంను ఎంపిక చేసుకోండి. బెల్లం తయారీలో కూడా రసాయనాలు ఉపయోగిస్తారు. కాబట్టి నల్ల బెల్లంను అందునా గానుగలో తయారు చేసే బెల్లంను ఎంపిక చేసుకోవటం చాలా మంచిది. డేట్ పామ్, కోకోనట్ సాప్, తాటి చెట్లు, చెరకు నుంచి తయారు చేసే వెరైటీ బెల్లం మార్కెట్లో అందుబాటులో ఉంది. దిమ్మెలు, అచ్చులు, వుండలు, పొడి రూపంలో బెల్లం దొరుకుతుంది.
ఫ్రీ ర్యాడికల్స్ పై పోరాటం..
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బెల్లంలో ఫ్రీ ర్యాడికల్స్ పై పోరాటం చేసే జింక్ , సెలీనియం వంటివున్నాయి. చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఇవి అరికడతాయన్నమాట. అందుకే వెంట్రుకలు, చర్మ సంరక్షణలో బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి మూలకారణం బెల్లంలో ఉన్న సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ఐరన్ వంటివే. ముఖం, మెడ, గొంతుపై వయసు చూపించే చారలు, ఏజ్ స్పాట్లు రాకుండా బెల్లం చెక్ పెడుతుంది. వృద్ధాప్యాన్ని అరికట్టలేం కానీ వాయిదా మాత్రం వేయగలం. దేశీ సూపర్ ఫుడ్ గా పేరుగాంచి బెల్లంను మన వంటల్లో వాడితే చాలు ఆ సుగుణాలన్నీ మీ వంటికి వచ్చి చేరతాయి. బెల్లంతో వంటలకు వచ్చే రుచి చాలా బాగుంటుంది కనుక చెఫ్ లు దీన్ని 'లిక్విడ్ గోల్డ్' అంటారు.
శుద్ధి చేసి..
బెల్లం తయారీలో మొలాసెస్ ను వేరుచేయకుండానే తయారు చేస్తారు. కాలేయాన్ని డీటాక్సిఫికేషన్ చేయాలంటే బెల్లంతోనే సాధ్యం. ఇక అజీర్తి సమస్యలకు ఇదే విరుగుడు. శరీరంలోని టాక్సిన్ లను అత్యంత సహజసిద్ధంగా ఏరివేసి, శుద్ధి చేసేందుకు బెల్లం తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇక యాక్నే, పింపుల్స్ వంటివి రాకుండా రక్షించే బెల్లం చలువ కూడా. మంచి మాయిశ్చురైజర్ గా పనిచేస్తూనే, మెటబాలిజంను పెంచుతుంది. ఇవన్నీ చర్మాన్ని అందంగా, మృదువుగా ఉంచి ఏజింగ్ కు కళ్లెం వేసేలా చేస్తుంది. తినటమే కాదు బెల్లాన్ని మంచి ప్యాక్ గా మీరు అప్లై చేయవచ్చు.
బెల్లం ప్యాక్ లు..
రెండు టేబుల్ స్పూన్ల తేనెతో ఒక స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడిని బాగా కలిపి, మెత్తని మిశ్రమంలా చేసుకోండి. దీన్ని మీ ముఖంపై రాసుకుని, సున్నితంగా మసాజ్ చేసుకోండి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగండి.
పిగ్మెంటేషన్ పోవాలంటే..
ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిలోకి ఒక టేబుల్ స్పూన్న టమోటా జ్యూస్, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, అందులోకి పసుపు వేసి కలిపిన మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్ లా వేసుకుని 15 నిమిషాల తరువాత కడిగేయండి. పిగ్మెంటేషన్ pigmentationసమస్యను తగ్గించేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది.
యాక్నే తగ్గాలంటే..
యాక్నేతో మీరు బాధపడుతుంటే బెల్లం పొడికి నిమ్మరసం చేర్చి, పేస్టులా తయారవుతుంది కదా.. దాన్ని యాక్నే ఉన్నచోట రాస్తే సరి. అతి త్వరలో మీరు మంచి మార్పు చూస్తారు.
మంచి బెల్లాన్ని గుర్తించటం ఎలా?
మరి మంచి బెల్లాన్ని గుర్తించటం ఎలా అంటే చాలా సింపుల్, బెల్లం నల్ల రంగులో ఉండాలి, క్రిస్టల్స్ లేకుండా ఉండాలి. ఇది కాస్త ఉప్పగా లేదా చేదుగా అనిపించిందో దాన్ని కొనకండి. అంతేకాదు బెల్లం తుంచితే పుటుక్కున విరగకుండా ఉండాలి, మంచి బెల్లం అంత ఈజీగా విరగదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips