ఇటీవల కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న జీవనశైలి వ్యాధి మధుమేహం (Diabetes). ఇది ఒకసారి సోకిందంటే జీవితాంతం భరించాల్సి ఉంటుంది. బాధితుల రక్తంలో షుగర్ (Sugar) లెవల్స్ కంట్రోల్‌లో లేకపోతే తీవ్రమైన అనారోగ్యాలు ఎదురవ్వొచ్చు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేదానిపై అనేక అపోహలు ఉన్నాయి. చక్కెరకు బదులుగా బెల్లం (Jaggery)ను ఆహారంలో తీసుకోవచ్చని చాలా మంది సూచిస్తుంటారు. మరి బెల్లంతో చేసిన పదార్థాలను డయాబెటిస్ ఉన్నవారు ఆహారంగా తీసుకోవచ్చో లేదో తెలుసుకుందాం.
చెరకు రసాన్ని బాగా వేడి చేసి బెల్లాన్ని తయారు చేస్తారు. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. వైట్ అండ్ బ్రౌన్ షుగర్‌కి ప్రత్యామ్నాయంగా బెల్లం ఆరోగ్యకరమైనదిగా ప్రసిద్ధి పొందింది. చెరకు రసంలో ఉండే ఖనిజాలు, విటమిన్లు బెల్లంలో ఉంటాయి. అయితే కొంతమంది ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రోగులకు చెక్కరకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని సిఫార్సు చేస్తుంటారు. ఇది సరికాదని నిపుణులు చెబుతున్నారు.
* మానేయడమే మంచిదా?
బెల్లంలో అధిక ఔషధ విలువలు ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్ బీపీ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే బెల్లంలో సుమారు 65 నుంచి 85 శాతం సుక్రోజ్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు బెల్లాన్ని పూర్తిగా మానేయడం మంచిది. డయాబెటిక్ ఐడియల్ డైట్‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ఉంటాయి. కానీ బెల్లంలో గ్లైసెమిక్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో కిడ్నీల వ్యాధి, గుండె జబ్బులు, అవయవ వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుంది.
సాధారణంగా 100 గ్రాముల బెల్లంలో 383 కేలరీలు, 65-85 గ్రాముల సుక్రోజ్, 10-15 గ్రాముల ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్ ఉంటుంది. షుగర్ సమస్యలు లేనివారు బెల్లంను ఆహారంలో తీసుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం దీన్ని పూర్తిగా దూరం పెట్టడం మంచిది.
* షుగర్ మేనేజ్‌మెంట్ ముఖ్యం
డయాబెటిస్‌తో ఎలాంటి సమస్యలు లేకుండా జీవించాలంటే రక్తంలో షుగర్ లెవల్స్‌ను సమర్థవంతంగా మేనేజ్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆహారంలో ఏదైనా పదార్థాన్ని చేర్చే ముందు, డయాబెటిక్ రోగులు వారి గ్లైసెమిక్ ఇండెక్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే వేటిని తినాలి, వేటిని తినకూడదో తెలుసుకోవాలంటే డయాబెటాలజిస్ట్‌ను సంప్రదించండి. ఆహారంలో తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.