ఇప్పుడు ప్రపంచాన్ని దేదీప్యమానం చేస్తున్న యోగా కిరణాలు భరతగడ్డ నుంచే ఉద్భవించాయి. ఇండియా నుంచి ఇతరదేశాలకు వెళ్లిన యోగాని అక్కడివారు అక్కున చేర్చుకుంటే.. సొంతబిడ్డను మాత్రం మనం చిన్నచూపు చూస్తున్నాం. ఇప్పటికీ.. యోగా అంటే.. ఏముందిలే.. అనే ధోరణిలోనే ఉంది భారతావని. అయితే.. ఈ యోగా దినోత్సవం నుంచైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని నమ్ముతున్నారు.
పరమశివుడు.. ఆదిగురువుగా ఆవిర్భవించి.. మానవుడు పరమాత్మ అనుగ్రహం పొందడానికి కొన్ని మార్గాలు సూచించాడంటారు. వాటిని యోగా రూపంలో.. శిష్యులకు ఉపదేశిస్తే.. నాటి మహార్షుల నుంచి.. నేటి మానవుల వరకు ఆ పరంపర కొనసాగుతోంది. యోగా అంటే.. ఏంటి? అందులో ఏముంది? ఆసనాలు.. వాటి ప్రయోజనాలను వివరిస్తూ యోగాశాస్త్రాన్ని మానవాళికి అందించారు. దివ్యజ్ఞాన సమాజం 19వ శతాబ్దం నుంచి యోగధ్యానాల ప్రాచుర్యాన్ని పెంచింది. 1930లలోనే హఠయోగంలో పాశ్చాత్య వ్యాయామ రీతులు ప్రవేశించాయి. హఠయోగం 'జిమ్నాస్టిక్స్' లాంటిదని, ఇది ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుందన్నారు వివేకానందుడు. కానీ, ఆయన ఆసనాలకన్నా ధ్యాన ప్రధానమైన పతంజలి రాజయోగానికే ప్రాముఖ్యమిచ్చారు. వివేకానందుడి స్ఫూర్తితో అమెరికా వెళ్లిన టి.కృష్ణమాచార్య, పట్టాభి, బీకేఎస్ అయ్యంగార్ విదేశాల్లో యోగధ్యానాల వ్యాప్తికి మూలకారకులయ్యారు.
టి.కృష్ణమాచార్య పూర్తిపేరు తిరుమలై కృష్ణమాచార్య. ఆయన్ను ‘ఫాదర్ ఆఫ్ మోడ్రన్ యోగా’గా కూడా అభివర్ణిస్తారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావశీలురైన యోగా అధ్యాపకుల్లో ఆయన అత్యంత ముఖ్యుడు. కృష్ణరాజ వడయార్ 4 మైసూర్ మహారాజుగా ఉన్న సమయంలో కృష్ణమాచార్య భారత పర్యటన చేశారు. యోగా ప్రాధాన్యాన్ని తెలుపుతూ ప్రసంగాలు చేశారు. ఏకంగా తన గుండె చప్పుడును కూడా ఆపి చూపించగల స్థాయిలో ఆయన ప్రదర్శన చేపట్టారంటే యోగాలో ఆయన సాధన ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అది విన్యాస క్రమ యోగాగా గుర్తింపు పొందింది. యోగా మీద ‘యోగ మకరంద,’, యోగాసనాలు, యోగ రహస్యం, యోగవల్లి లాంటి పుస్తకాలు కూడా రాశారు. ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువులుగా పేరుపొందిన ఎందరో యోగాధ్యాపకులకు ఆయన గుగ్గురువు. ఆయన శిష్యుల్లో ఒకరైన బీకేఎస్ అయ్యంగార్ గురించి కూడా మనం తెలుసుకోవాలి.
మునులు.. సాధుసంతులకే పరిమితమనుకునే యోగాని.. సామాన్య జనంలోకి తీసుకొచ్చిన ఘనత బీకేఎస్ అయ్యంగార్ దే అంటారు. యోగ శక్తులను పొందడానికి కారణజన్ములు కానక్కర్లేదు. సామాన్యులు కూడా వాటిని సొంతం చేసుకోవచ్చని నిరూపించారు. ఈ రోజు ప్రపంచపటంలో యోగాకి స్థానం దక్కిందంటే.. అందులో ఆయన పాత్ర అమోఘం. నల్లవారు - తెల్లవారుగా చీలిపోయిన కాలంలో.. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే.. ఎంతోమంది తెల్లదొరలకు గురువుగా.. వారిని తన పాదాక్రాంతం చేసుకున్నారు. యోగాలో ఆయన జీవితం ఎంతగా ముడిపడిందంటే.. ఘేరండ సంహితలో 32 ఆసనాలు ఉంటే, అయ్యంగార్ విరచిత 'లైట్ ఆన్ యోగా'లో 200 ఆసనాలు ఉన్నాయి. యోగా సాయంతో క్షయ వ్యాధిని నయం చేసుకున్న అయ్యంగార్, తన ప్రయోగాల నుంచి కొత్త ఆసనాలను సృష్టించారు.
ఇక యోగా అంటే.. ఇప్పటి తరానికి గుర్తొచ్చే పేరు రాందేవ్. వీధివీధికీ యోగా శిబిరాలను తీసుకెళ్లారు బాబా రాందేవ్. స్టేజ్‌పై కూర్చుని ఆయన చేసిన యోగా విన్యాసాలు.. జనాన్ని యోగా వైపు చూసేలా చేశాయి. అటు ఇంటర్నేషనల్ గా.. యోగాకి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు బాబా రాందేవ్. వివిధ దేశాల్లో.. ప్రదర్శనలతో.. కార్పొరేట్ ప్రపంచానికి కొత్త గురూజీ అయ్యారు. MNC స్థాయికి తీసుకెళ్లారు. ఆయన వేసే ఆసనాలకు తోడు.. ఆయన స్టైల్ ఆఫ్ స్పీకింగ్ కూడా.. ఆయన్ను ప్రపంచానికి మరింత దగ్గర చేసింది. ఒక్క రాందేవ్ కాకుండా.. ఇంకా ఎంతో మంది గురువులు.. తమ సాధనతో.. యోగాని ప్రపంచవ్యాప్తం చేశారు. ఇతర దేశాల్లో ఉండే.. ఇండియన్స్ కూడా.. అక్కడ యోగాని నేర్పిస్తూ.. ఆ పరంపర కొనసాగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Baba Ramdev, Yoga day, Yoga day 2021