International Men's Day: అధిక బరువుతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో చెక్

ఇంటర్నేషనల్ మెన్స్‌ డే (International Men's Day) సందర్భంగా మగవాళ్లు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు ఉన్న మార్గాలను ఇక్కడ చూడండి.

news18-telugu
Updated: November 19, 2020, 1:00 PM IST
International Men's Day: అధిక బరువుతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో చెక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒకప్పుడు ఊబకాయం సమస్య ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది అనుకునేవాళ్లం. కానీ చిన్నా, పెద్దా, ఆడ, మగ తేడాలు లేకుండా అందర్లోనూ ఇది ప్రమాదకర సమస్యగా మారుతోంది. రోజువారీ పనుల్లో మునిగిపోయి తమ గురించి తాము సరిగా పట్టించుకోని మగవాళ్లు కూడా అధిక బరువు సమస్యకు బలవుతున్నారు. మగవాళ్లలో ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణమవుతున్న ఊబకాయాన్ని తగ్గించుకోవాల్సిన మార్గాల గురించి అవగాహన పెంచుకోవాలి.

మారుతున్న జీవనశైలి అధిక బరువు సమస్యకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న చాలా మార్గాలు ఎక్కువ శాతం మహిళలను లక్ష్యంగా చేసుకొనే ఉంటాయి. టెస్టోస్టెరాన్ అధికంగా ఉండటం వల్ల పురుషులు మహిళల కంటే వేగంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ మెన్స్‌ డే (International Men's Day) సందర్భంగా మగవాళ్లు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు ఉన్న మార్గాలు...

* విరామం- వ్యాయామం
ఆఫీసు పనుల్లో పూర్తిగా నిమగ్నపై పోకుండా మధ్యలో కాసేపు విరామం తీసుకోవాలి. ఆ సమయంలో తేలికపాటి వ్యాయామాలు చేయండి. రోజూ జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేసేంత సమయం అందరికీ ఉండకపోవచ్చు. అందువల్ల పని గంటల మధ్య తేలికపాటి వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఇందుకు పెద్ద బరువులు ఎత్తుతూ, పరుగెత్తాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిసారీ లిఫ్ట్‌ వాడకుండా మెట్ల ద్వారా నడిచి వెళ్తూ శరీరానికి పని చెప్పవచ్చు. ఆఫీస్‌లోనే కాసేపు వాకింగ్ చేయవచ్చు. ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు సార్లు 15 నిమిషాల చొప్పున ఇలాంటివి ప్రయత్నించండి. ఉదయం ఒకసారి, ఆఫీసులో పని మధ్యతో, భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత... ఇలా నాలుగు సార్లు కాసేపైనా వాకింగ్ చేసే ఏర్పాట్లు చేసుకుంటే సమయం ఆదా అవుతుంది, శరీరానికి వ్యాయామమూ అందుతుంది. తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది.

* సమయాన్ని ఉపయోగించుకోవడం
రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, అలసి పోకుండా చూసుకోవాలి. ఇందుకు ఖాళీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఆఫీసు పనుల తరువాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడిపితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో పాటు గ్రూప్ ఫిట్‌నెస్‌ యాక్టివిటీ వంటివి ఏర్పాటు చేసుకుంటే వ్యాయామమూ చేసినట్లు ఉంటుంది. స్నేహితులతో కలిసి రన్నింగ్, సైక్లింగ్ వంటివి చేయండి. తద్వారా కొత్త ఉత్సాహం మీ సొంతమవుతుంది. దీంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీకెండ్ గేమ్స్ ప్లాన్ చేసుకుంటే శరీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.

* తగినంత నిద్ర

25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఉద్యోగానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆ పనుల్లో పడి ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఈ వయసులో పని ఒత్తిడి నుంచి బయట పడటానికి రోజూ తగినంత నిద్ర అవసరం. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మైగ్రేన్లు, మానసిక సమస్యలు, వెన్నునొప్పి, బరువు పెరగడం వంటి అనారోగ్యాల బారిన పడవచ్చు. తగినంత నిద్రపోని వారు ఎక్కువగా తినేందుకు అలవాటు పడతారని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ఇది అధిక బరువుకు దారితీస్తుంది. అందువల్ల ప్రతి రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి.

* ప్రశాంతత అవసరం
రోజువారీ పనులు ముగిసిన తరువాత భార్య, పిల్లలతో ఉల్లాసంగా గడిపేందుకు (pampering) ఆసక్తి చూపుతారు. దీంతో పాటు మీ గురించి మీరు కూడా ఆలోచించుకోవాలి. మీకోసం కాస్త సమయం కేటాయించుకొని, ఉల్లాసంగా, విలాసంగా గడిపేలా ప్రణాళిక వేసుకోవాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మగవాళ్లలో ఒత్తిడి కారణంగా బరువు పెరగడం సాధారణ విషయంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మానసిక ప్రశాతంతకు దూరం కాకుండా ప్రణాళిక వేసుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా, భారంగా అనిపిస్తే సెలవు తీసుకొని విశ్రాంతి తీసుకోండి.

* ప్రోటీన్‌ ఉండే ఆహారం
బరువు తగ్గించే ఆహారంలో ప్రోటీన్‌లు తప్పనిసరిగా ఉండాలి. మీ డైట్ ప్లాన్‌లో ప్రోటీన్ ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి ఆకలిని తగ్గించడంతో పాటు శరీర జీవక్రియ రేటును పెంచుతాయి. శరీరం ఆరోగ్యకరమైన కణజాలాన్ని నిర్మించడానికి, వృద్ధి చేయడానికి ప్రోటీన్లు సహాయపడతాయి. అందువల్ల మాంసకృత్తులకు వనరులుగా ఉండే గుడ్లు, చికెన్, చేపలు, మాంసం, ప్లాంట్ బేస్డ్‌ ప్రోటీన్‌లను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలి.

* మరిన్ని చిట్కాలు
తీసుకునే ఆహారంపై అవగాహన పెంచుకోవాలి. శరీరానికి హాని కలిగించే ప్రమాదకర కొవ్వులు, కృత్రిమ చక్కెరలు లేని ఆహారాన్ని ఎంచుకోండి. ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. వీటికి బదులుగా ఇంట్లోనే తయారుచేసుకునే చిప్స్, పాప్‌కార్న్, డ్రై ప్రూట్స్‌ వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవచ్చు. నిర్ణీత వేళల్లోనే భోజనం చేసేలా ప్రణాళిక వేసుకోండి. రోజులో మూడుసార్లు ఎక్కువ మొత్తంలో తినడానికి బదులుగా, ఐదుసార్లు తక్కువ మొత్తంలో భోజనం చేయండి. ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడతాయి.
Published by: Shiva Kumar Addula
First published: November 19, 2020, 12:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading