• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • INDIA STARTS CULTIVATION HING OR INGUVA A STAPLE INGREDIENT THAT COSTS 130 MN EACH YEAR TO IMPORT BA GH

ఇంగువ దిగుమతికి స్వస్తి, ఇకపై భారత్‌లోనే సాగు.. ఎక్కడంటే?

ఇంగువ దిగుమతికి స్వస్తి, ఇకపై భారత్‌లోనే సాగు.. ఎక్కడంటే?

ప్రతీకాత్మక చిత్రం

బలమైన ఘుమఘుమలాడే వాసన కలిగి ఉండే చిటికెడు ఇంగువ శాఖాహారం వంటల్లో ఎంతో రుచిని తెస్తుంది. ఇది అనేక సాంప్రదాయ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

  • Share this:
భారతీయ వంటకాల్లో ముఖ్యమైన మసాలా దినుసుల్లో హింగ్ (ఇంగువ) లేదా ఆసాఫోటిడాని ఒకటి. ఇది మన ఆహార సంస్కృతిలో భాగంగా మారింది. ప్రస్తుతం అన్ని రకాల వంటకాల్లో ఇంగువను విరివిగా వాడుతుండటంతో దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, స్థానిక వాతావరణం దృష్ట్యా మన దేశంలో ఇంగువ పంట పెరగదు కనుక దీన్ని ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ మన దేశంలో కూడా దీని మూలాలను కనుగొని ఇక్కడే పండించే ప్రయత్నాలు తాజాగా మొదలయ్యాయి. సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్)కి చెందిన హిమాలయన్ బయోసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్బీటీ) శాస్త్రవేత్తలు హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ లోయలో మసాలా దినుసులను పండించడానికి చొరవ తీసుకున్నారు. దీనిలో భాగంగా అక్కడ ఇంగువ మొక్కలను నాటారు. కాగా, భారత్ 40 శాతం ఇంగువ వినియోగంతో ప్రపంచంలోనే ముందున్నప్పటికీ, స్థానికంగా దాన్ని సాగు చేయడానికి ఇప్పటివరకు ఎటువంటి ప్రయత్నం జరగలేదు. అయితే, పాలంపూర్లోని సీఎస్ఐఆర్కి చెందిన -ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్బిటి) డైరెక్టర్ సంజయ్ కుమార్ 2016 నుంచి స్థానికంగా ఇంగువను పెంచే పనిలో ఉన్నారు. అందువల్ల, అక్టోబర్ 15న లాహాల్ లోయలోని క్వారింగ్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన చేతుల మీదుగానే ఇంగువ మొదటి విత్తనాన్ని నాటించారు.

భారతీయ వంటల్లో విరివిగా వాడేది
భారతీయ వంటకాల్లో విరివిగా వాడే వెల్లుల్లి, ఉల్లిపాయలకు ప్రత్యామ్నయంగా ఇంగువ నిలుస్తుంది. బలమైన ఘుమఘుమలాడే వాసన కలిగి ఉండే చిటికెడు ఇంగువా శాఖాహారం వంటల్లో ఎంతో రుచిని తెస్తుంది. ఇది అనేక సాంప్రదాయ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మూత్రపిండాల్లో వచ్చే రాళ్ల నుంచి బ్రోన్కైటిస్ వరకు ప్రతిదానికీ ఇది సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. మన దేశంలో దీని డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల 100 గ్రాముల ఇంగువకు రూ.300 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అవుతుంది. భారతదేశం ప్రతి ఏడాది దాదాపు 1,200 టన్నుల ఇంగువను దిగుమతి చేస్తుంది. దీనికి దాదాపు 130 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది. యుద్ధం, అంతర్గత కలహాల నేపథ్యంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఇంగువ ఎగుమతి చేయకుండా నిరోధించిన సందర్భాలెన్నో ఉన్నాయి.

ఇంగువ సాగుపై రైతులకు శిక్షణ
హిమాచల్ ప్రదేశ్లోని లాహాల్, స్పితి జిల్లాల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగానే చల్లని ఎడారి ప్రాంతం ఉంది. ఇది ఇంగువ సాగుకు అనువైనదని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలో భాగంగా సిఎస్ఐఆర్ బృందం సుమారు 500 హెక్టార్ల భూమిలో ఈ హింగ్ సాగుకు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం భారత్లో సాగు చేస్తున్న ఇంగువ ఇరాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోని ఇంగువ నాణ్యతను సాధించడానికి దాదాపు నాలుగైదు సంవత్సరాలు పట్టవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఈ సాగును లడఖ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు విస్తరించాలని వారు యోచిస్తున్నారు. శాస్త్రవేత్తలు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో కలిసి ఇంగువ సాగుపై, మంచు కరగడం ద్వారా వచ్చే తేమపై జీవించే మొక్కల సాగుపై స్థానిక రైతులకు శిక్షణ ఇస్తున్నారు.

ఈ మొక్కల సాగులో రసాయన ఎరువులు వాడకుండా, జంతువుల పేడను మాత్రమే వాడాలని రైతులను కోరుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో రూ.4 కోట్ల నిధులతో ఐహెచ్బిటి టిష్యూ కల్చర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్ ద్వారా లక్షలాది మొక్కలను త్వరగా పండించవచ్చు. తద్వారా భారతదేశం ఇతర దేశాల నుంచి ఇంగువ విత్తనాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు