• Home
  • »
  • News
  • »
  • life-style
  • »
  • IN KOLKATA A COLLEGE ADMISSION FORM ALLOWS YOU TO CHOOSE HUMANITY AS RELIGION CR

మానవత్వమే మతం... మార్పు కోసం కోల్‌కతాలో ఓ డిగ్రీ కాలేజ్ వినూత్న ప్రయత్నం...

మతం మానవత్వం... మార్పు కోసం కోల్‌కతాలో ఓ యూనివర్సిటీ వినూత్న ప్రయత్నం...

అడ్మిషన్ ఫారంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, బైద్ధ, సిక్కు, జైన మతాలతో పాటు ‘మానవత్వం’ అనే ఆప్షన్ కూడా ఇచ్చిన కోల్‌కతాలోని బెతూన్ కాలేజ్... విద్యార్థుల ప్రశంసల వెల్లువ...

  • Share this:
భారతదేశం భిన్నమతాల, విభిన్న సంస్కృతుల నిలయం. ప్రపంచంలో ఎక్కడాలేనన్ని మతాలు, కులాలు మనదేశంలో మాత్రమే కనిపిస్తాయి. కులరహిత సమాజాన్ని కోరుకునే వాళ్లు కూడా ఎక్కడో ఒకదాన్ని తమ కులాన్ని, మతాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్కూళ్లలో, కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునేటప్పుడు... ఈ రెండూ పేర్కొనడం తప్పనిసరి. అప్లికేషన్‌లోనే పూర్తి పేరు, పుట్టిన తేదీ, జాతీయతతో పాటు కులం, మతం గురించి రాయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పద్ధతి మారుతోంది. తాము ఏ కులానికి, మతానికి చెందని వాళ్లమని చెప్పుకునే భిన్న భావాల వారి కోసం... కోల్‌కతా సిటీలోని ఓ కాలేజ్ వినూత్న ఆలోచన చేసింది. కాలేజీ అడ్మిషన్ ఫారంలో మతం కాలమ్‌లో ‘మానవత్వం’ అనే దాన్ని కూడా చేర్చింది. మతం పేర్కొనడం ఇష్టం లేనివాళ్లు, తాము ఏ మతానికి చెందని వాళ్లం అనుకునే వాళ్లు ‘మానవత్వం’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇంత గొప్ప ఆలోచన చేసిన కాలేజీ పేరు ‘బెతూన్ కాలేజ్’. మే 27 నుంచి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించిన బెతూన్ కాలేజ్ యాజమాన్యం... అడ్మిషన్ ఫారంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, బైద్ధ, సిక్కు, జైన మతాలతో పాటు ‘మానవత్వం’ అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. కాలేజ్ చేసిన ఈ ప్రయత్నానికి విశేష స్పందన వస్తుండడం విశేషం. ఓపెన్ కోటాలో అడ్మిషన్లు తీసుకుంటున్న చాలామంది ‘హ్యూమానిటీ’ని తమ రిలిజన్‌గా ఎంచుకుంటున్నారు. రిజర్వేషన్ కోటాలో ఆడ్మిషన్ కోరుకునేవారు మాత్రం మరో మార్గం లేక మతాన్ని, కులాన్ని పేర్కొంటున్నారట.

ఎన్నో ఏళ్ల నుంచి మతం కాలమ్‌లో మానవత్వం చేర్చాలనే ఆలోచన ఉందని... చాలామంది విద్యార్థులు అప్లికేషన్ ఫారంలో కుల, మతాలను ప్రస్తావించేందుకు వెనకాడుతున్నారనే సంగతి తమ దృష్టికి వచ్చినందుకే ఈ ఆలోచన చేశామని వెల్లడించారు బెతూన్ కాలేజీ యాజమాన్యం. ‘మానవత్వమే మనుషుల మతం’ అనే విశాల దృక్పథం కలిగిన విద్యార్థుల కోసం మతం విభాగంలో ‘మానవత్వం’ అనే కేటగిరీని ప్రవేశపెట్టామని తెలిపింది బెతూన్ కాలేజ్ అడ్మిషన్ కమిటీ.

First published: