• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • IF YOUR KNEE PAINS HURT AT NIGHT TIME THIS COULD BE THE REASON SU GH

Knee Pain: మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సమస్య అయి ఉండొచ్చు.. చెక్ చేసుకోండి.

Knee Pain: మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సమస్య అయి ఉండొచ్చు.. చెక్ చేసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం

రోజంతా పనిచేసి అలిసిపోయిన తర్వాత కాళ్ల నొప్పులు రావడం సహజం అని మీరు అనుకుంటూ ఉండొచ్చేమో కానీ ఆస్టియోఆర్థరైటిస్ కూడా అయి ఉండొచ్చంటున్నారు డాక్టర్లు.

  • Share this:
చాలామందికి రాత్రి కాగానే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. కొందరికి పగటి పూట అలసిపోయేంత పని చేస్తే ఆ రోజు రాత్రి నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొందరు రోజు రాత్రి నొప్పులతో ఇబ్బందిపడుతుంటారు. చాలామంది వీటిని తగ్గించేందుకు పెయిన్ కిల్లర్స్ తీసుకొని నిద్రపోతుంటారు. కానీ ఇది అనుకున్నంత చిన్న విషయమే కాదు.. మీకు రోజూ ఇలాంటి నొప్పులొస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిది.

శరీరమంతా ఆరోగ్యంగానే ఉండి రోజంతా యాక్టివ్ గా పనిచేసుకోవడం మీకు అలవాటుగానే ఉండొచ్చు, రోజంతా పనిచేసి అలిసిపోయిన తర్వాత కాళ్ల నొప్పులు రావడం సహజం అని మీరు అనుకుంటూ ఉండొచ్చేమో కానీ ఇది ఆస్టియోఆర్థరైటిస్ కూడా అయి ఉండొచ్చంటున్నారు డాక్టర్లు. మన దేశంలో ఎక్కువగా వచ్చే రకం ఆర్థరైటిస్ లో ఆస్టియోఆర్థరైటిస్ ఒకటి. మన దేశంలో 22 నుంచి 39 శాతం మందిని ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. మనదేశంలో ఎక్కువ మందికి వచ్చే రుమటాయిక్ వ్యాధుల్లో ఇది రెండో స్థానంలో ఉంది. పురుషుల కంటే మహిళలకు ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఎముకలకు కీళ్లకు మధ్యనుండే కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇవి కరిగిపోవడం వల్ల కీళ్లపై ప్రభావం పడుతుంది. అన్ని కీళ్లపైనా దీని ప్రభావం ఉన్నా మోకాళ్లపై ఇది ఎక్కువగా ఉంటుంది.మోకాళ్లు కదిలించేందుకు ఇబ్బందిగా అనిపించడం, ఫ్లెక్సిబిలిటీ తగ్గడం వంటివి దీని లక్షణాలుగా చెప్పుకోవచ్చు. పగలంతా ఈ నొప్పి కాస్త తక్కువగా ఉన్నా రాత్రి సమయంలో ఎక్కువగా ఉండి నిద్రపట్టనివ్వదు. ఈ సమస్య ఉన్నవారిలో 70 శాతం మందికి రాత్రి నిద్రపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

సాధారణంగా 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ కేవలం వారికే వస్తుందని అనుకుంటే పొరపాటే.. ఒక్కోసారి చిన్న వయసున్న వారినీ ఇది ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యలో కీళ్లు బలహీనంగా మారిపోయి కాళ్లు వంచేందుకు కష్టంగా ఉండడం, నొప్పి వంటివి కనిపిస్తాయి. మొదటి దశలో పెద్దగా లక్షణాలు కనిపించవు. నొప్పి వచ్చే వరకూ ఆగితే అది తర్వాత దశకు చేరినట్లే అని చెప్పుకోవచ్చు. దీన్ని గుర్తించేందుకు ఎంఆర్ ఐ, ఎక్స్ రే వంటి పరీక్షలు చేయాలి. డాక్టర్ సలహాతో చికిత్స తీసుకుంటూ వీలైనంత వరకూ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ సూచించిన కొన్ని రకాల వ్యాయామాలు కూడా చేయడం వల్ల కీళ్లు బలహీనంగా కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే బరువు తగ్గడం, నొప్పి ఉన్న ప్రాంతాల్లో వేడి లేదా చల్లటి కాపడం పెట్టుకోవడం, ఆక్యుపంక్ఛర్, మెడిటేషన్, మసాజ్ వంటివి ఇది తగ్గించడానికి చక్కటి పద్ధతులుగా చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసినా తగ్గనంతగా మీ సమస్య ముదిరితే సర్జరీ చేసి కీళ్లను సరిచేసే వీలుంటుంది. అయితే దీన్ని ఆఖరి మార్గంగానే ఎంచుకోవాల్సి ఉంటుంది.
Published by:Sumanth Kanukula
First published: