వర్షాకాలం ప్రారంభమైనప్పుడు చర్మ సమస్యల నుంచి జుట్టు సమస్యల వరకు ప్రతీది ప్రారంభమవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పద్దతుల ద్వారా చర్మంపై ఉండే మొటిమలను కూడా నయం చేయవచ్చు. విటమిన్లు, ఖనిజ లవణాలు మోతాదు పోషక విలువలు పుష్కలంగా ఉండేవి ముల్లంగి. ఆరోగ్యాన్నే కాదు, అందాన్ని కూడా కాపాడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మార్చి, ముఖంపై మొటిమలను దూరం చేస్తుంది. అయితే ముల్లంగి ముఖానికి ఎలా పట్టించాలి.. అనేది తెలుసుకుందాం.. మృతకణాలను పోగొట్టి.. చెంచా ముల్లంగి తరుగుకు అరచెంచా పెరుగు, ఐదు చుక్కల బాదం నూనెను కలిపి మిశ్రమాన్ని ముఖానికి, మెడకు లేపనంలా పట్టించాలి. పావు గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ముఖచర్మం తేమగా మారుతుంది, కాంతివంతమవుతుంది. ముల్లంగి దుంపను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు కలిపి ముఖానికి రాసి మునివేళ్లతో మృదువుగా రుద్దాలి. ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ఇది సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి, మొటిమలను దూరం చేస్తుంది. వాటివల్ల వచ్చే నల్లని మచ్చలు, రాషెస్ వంటివి మటుమాయం చేస్తుంది. ఇందులోని విటమిన్ సి చర్మంపై మృతకణాలను పోగొట్టి, నిత్యం మెరుపులీనేలా చేస్తుంది.
మచ్చలు పోవాలంటే..
చెంచా ముల్లంగి గుజ్జుకు అర చెంచా నిమ్మరసం, నాలుగైదు చుక్కల ఆలివ్ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి పావుగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. నిమ్మలోని విటమిన్ సి చర్మాన్ని శుభ్ర పరుస్తుంది. మొటిమల మచ్చలు లేదా ఎండవల్ల కమిలిన చర్మం పూర్వపు కాంతిని సంతరించుకుంటుంది. ముల్లంగి రసంలో దూదిని ముంచి మచ్చలపై మృదువుగా రాసినా ప్రయోజనం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖంపై 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రపరిచి మెత్తని వస్త్రంతో అద్దితే చాలు. వారంలో నాలుగైదుసార్లు ఇలా చేస్తే మటుమాయమవుతాయి.
ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే..
చెంచా ముల్లంగి రసానికి చెంచా ఓట్ మీల్ పౌడర్, ఎగ్ వైట్‌ను కలిపి ముఖానికి లేపనంలా పట్టించాలి. పావుగంట తర్వాత మృదువుగా రుద్దుతూ గోరువెచ్చని నీటితో శుభ్రపరిస్తే చాలు. మృతకణాలు పోతాయి. చర్మకణాల్లో రక్తప్రసరణ జరిగి కాంతివంతంగానూ మారుతుంది. శిరోజాల ఆరోగ్యానికి ముల్లంగి రసంలో దూదిని ముంచి మాడుకు మృదువుగా రాసి తలకు టవల్ కట్టి ఓ అరగంట ఆరనివ్వాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే చుండ్రుండదు. జుట్టు ఆరోగ్యంగానూ పెరుగుతుంది. ఇంకే వెంటనే ముల్లంగిని తెచ్చుకోండి. ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayurvedic health tips, Beauty tips, Life Style, Women