తేనె తియ్యని ఔషధం. ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. గ్రామీణ ప్రజలు తేనెతో ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. కానీ పట్టణాలు, నగరాల్లో ఉండే వాళ్లు మాత్రం అంతగా లాభపడటం లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన తేనె దొరికితే.. నగరాల్లో మాత్రం కల్తీ తేనె దొరుకుతోంది. మరి శుద్ధమైన తేనె, కల్తీ తేనెను ఎలా గుర్తించాలో తెలుసా..?
తేనెను పరీక్షించే విధానాలు:
1. ఓ గ్లాస్ లో నీళ్లు తీసుకొని ఓ టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఆ తర్వాత కాస్త వెనెగర్ వేయాలి. నురుగు వస్తే అది కల్తీ తేనె.
2. అగ్గిపుల్లను తీసుకొని తేనెలో ముంచండి. ఆ పుల్లను అగ్గిపెట్టెపై గంధకానికి గీస్తే మండాలి. లేదంటే అది కల్తీ తేనె. ఎందుకంటే స్వచ్ఛమైన తేనెకు మండే స్వభావం ఉంటుంది. తేనెలో పత్తి ఒత్తిని ముంచి వెలిగిస్తే వెలుగుతుంది.
3.గ్లాస్ మంచి నీటికి టేబుల్ స్పూన్ తేనె కలపండి. చెంచాతో కలపకుండా గ్లాస్ ను అటూ ఇటూ తిప్పుతూ కలపాలి. తేనె నీటిలో కలిసిపోతే అది కల్తీది. అలాగే అడుగుభాగాన ఉండిపోతే అది స్వచ్ఛమైన తేనె.
4.బ్లాటింగ్ పేపర్ కు కాస్త తేనె రాయాలి. పేపర్ తడిసి పోతే అది కల్తీ తేనె.
5.చేతి బొటన వేలిపై కొంచెం తేనె వేయండి. చేతికి అలాగే అతుకుపోతే అది నాణ్యమైన తేనె. వేలి నిండా వ్యాపించి, జారిపోతే అది కల్తీది.