మానవుల శరీరంలో పెదాలు (Lips) చాలా సున్నితమైనవి కాబట్టి వీటి పట్ల చాలా కేర్ తీసుకోవాలి. అధరాల గురించి తగిన శ్రద్ధ తీసుకోకపోతే అవి అందవిహీనంగా మారుతాయి. నిజానికి లిప్స్ అందంగా, మృదువుగా ఉంచుకుంటే ముఖ సౌందర్యం రెట్టింపవుతుంది. అయితే చలికాలం, వానాకాలం (Monsoon) సీజన్లలో పెదాల ఆరోగ్యం దెబ్బతింటుంది. వర్షాకాలంలో ఉండే అధిక తేమ వల్ల పెదవులు పొడిబారడం (Dry Lips), పగిలిపోవడం (Chapped Lips), పాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ప్రస్తుతం భారత్‌లో వర్షాకాలం మొదలైపోయింది. మరి ఈ సీజన్లో పెదాలను ఎలా సంరక్షించుకోవాలో (Lip Care) ఇప్పుడు తెలుసుకుందాం.
మసాజ్
ఈ వర్షాకాలంలో పెదాలను సుతిమెత్తగా మసాజ్ చేసుకోవడం ముఖ్యం. వెన్న లేదా జొజోబా క్రీమ్ (Jojoba Cream) లేదా ఆలివ్ ఆయిల్‌ని తీసుకొని పెదవులపై సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా పెదాలు మృదువుగా మారతాయి. తరచుగా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి సహజమైన పింక్ లిప్స్ మీ సొంతమవుతాయి.
లిప్‌బామ్స్
పొడిబారిన పెదవులను హైడ్రేట్ చేయడానికి లిప్ సీరమ్ రాసుకోవచ్చు. అయితే సింథటిక్ సెంట్, లానోలిన్, సాలిసిలిక్ యాసిడ్ వంటి హానికరమైన కెమికల్స్, విషపదార్థాలు ఉన్న లిప్‌బామ్స్, నూనెలను వాడకుండా జాగ్రత్తపడాలి. వీటికి బదులుగా విటమిన్ ఎ, బి, డి, ఇ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లభించే ప్రొడక్ట్స్ వాడటం ద్వారా లిప్స్కి మంచి పోషణ అందుతుంది. దోసకాయ, ద్రాక్ష, పుచ్చకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే పెదాలు ఎప్పుడూ హైడ్రాటెడ్గా ఉంటాయి.
స్క్రబ్
పెదవులపై మృత కణాలు, మలినాలు పేరుకుపోవడం సహజం. వీటివల్ల చికాకుతో పాటు నొప్పి కూడా వస్తుంది. కాబట్టి మృతకణాలు, మలినాలు వదిలించుకోవడానికి మీ పెదాలను ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం మంచిది. చాలా మృదువుగా, సున్నితంగా ఉండే స్క్రబ్బర్పై పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకుని పెదాలను స్క్రబ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలానే తగినంత నీరు తాగడం ద్వారా పెదాలను మృదువుగా మార్చుకోవచ్చు.
సన్‌స్క్రీన్
వర్షాకాలంలో కొన్ని రోజులు ఆకాశం మేఘావృతమై ఉండి ఎండ రాదు కానీ మిగతా రోజుల్లో మాత్రం ఎండలు మండిపోతాయి. అందుకే వర్షాకాలంలో సన్‌స్క్రీన్ ప్రొటెక్షన్ లేకుండా బయటకు వెళ్లడం అంత మంచిది కాదు. సన్ ప్రొటెక్షన్ ఫాక్టర్ (SPF) ఉన్న ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి మీ ఫేస్‌కి మాత్రమే కాదు, మీ పెదవులకు కూడా రాయడం ద్వారా పెదాలను రక్షించుకోవచ్చు. లేనిపక్షంలో యూవీ రేస్ (UV Rays) వల్ల మీ పెదవులు నల్లబడిపోతాయి.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.