Financial Planning: ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే.. కరోనా లాంటి సమయాల్లో కష్టాలు ఉండవు..

Financial Planning: కరోనా మహమ్మారి వల్ల అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఆదాయం కోల్పోయి అవస్థలు పడ్డారు. అయితే సరైన ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

news18-telugu
Updated: October 29, 2020, 1:25 PM IST
Financial Planning: ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే.. కరోనా లాంటి సమయాల్లో కష్టాలు ఉండవు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి వల్ల అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఆదాయం కోల్పోయి అవస్థలు పడ్డారు. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలు అనేకం. అయితే సరైన ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వ్యక్తుల ఫైనాన్షియల్ వెల్‌బీయింగ్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల కాస్ట్ ఆఫ్‌ లివింగ్, ఇతర ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు మంచి ఆర్థిక ప్రణాళిక(ఫైనాన్షియల్ ప్లానింగ్) సవాళ్లను అధిగమించడానికి తోడ్పడుతుంది. మహమ్మారి వంటి సంఘటనలు చెప్పి రావు. అందుకే అన్ని రకాల అనిశ్చితులను తట్టుకునేలా ముందు నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి.

కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వైద్య చికిత్స ఖర్చులు, కిరాణా సామగ్రి ధరలు పెరుగుతాయి. గృహోపకరణాలు, రోజువారీ అవసరాల భారీ కొనుగోళ్లకు దారితీయవచ్చు. జీతాల తగ్గింపులకు ఇవి కూడా తోడైతే మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 43శాతం మంది భారతీయుల ఆదాయం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జీతాల్లో కోతలు, అధిక ఖర్చులు వంటి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ను సిద్ధం చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...

ఆదాయం, ఖర్చుపై అవగాహన ఉండాలి..
ఆదాయం (క్యాష్‌ ఇన్‌ ఫ్లో) ఎంత వస్తోంది, దాంట్లో ఖర్చు(క్యాష్‌ అవుట్‌ ఫ్లో)లకు ఎంత పోతోందనే విషయాలపై దృష్టి సారించాలి. ఆర్థిక భద్రతను (ఫైనాన్షియల్ సెక్యూరిటీ) సాధించడానికి ఖర్చులను వివిధ భాగాలుగా విభజించుకోవాలి. ఒక్కో విభాగానికి ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలి. కిరాణా, యుటిలిటీ బిల్లులు, చదువుల ఫీజులు, లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, EMIలు వంటి ముఖ్యమైన, అవసరమైన ఖర్చులపై దృష్టి పెట్టాలి. ఖర్చులను పెంచే షాపింగ్‌, ఇతర అనవసర వ్యయాలను తగ్గించాలి.

ఆర్థిక క్రమశిక్షణ పాటించడం
క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపర్చుకోవాలంటే అన్ని బకాయిలను (నెలవారీ ప్రాతిపదికన) చెల్లించాల్సిందే. క్రెడిట్ కార్డ్ బిల్లులను క్రమశిక్షణతో, సకాలంలో తిరిగి చెల్లిస్లే.. మంచి రీపేమెంట్ హిస్టరీ నమోదవుతుంది. అనుకోని అవసరాలకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఎక్కువ మొత్తంలో లోన్‌ తీసుకోవడానికి ఇవన్నీ సహాయపడతాయి. ఒకవేళ మీరు EMI మారటోరియం ఆప్షన్‌ను ఎంచుకుంటే, మారటోరియం తరువాత తప్పకుండా చెల్లింపులు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లోన్‌ రీపేమెంట్‌పై కస్టమర్లు ఎంచుకునే మారటోరియం ఆప్షన్ నేరుగా క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయదని రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు చెబుతున్నాయి. కానీ క్రెడిట్ స్కోరును ఇలాంటి వివిధ అంశాల ఆధారంగానే నిర్ణయిస్తారు. మారటోరియంతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వినియోగదారులకు లోన్ రీకన్‌స్ట్రక్షన్ సదుపాయాన్ని కల్పించేందుకు కూడా ఆర్‌బీఐ అనుమతించింది. కస్టమర్ల ఆర్థిక క్రమశిక్షణను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బ్యాంకులు ఇలాంటి సేవలందిస్తాయి.

లిక్విడిటీని సరిచూసుకోవడం

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మెరుగుపడిన తర్వాత వైద్య ఖర్చుల కోసం లిక్విడిటీ(ద్రవ్యత)ని కొనసాగించేలా ప్రణాళిక వేసుకోండి. ఊహించని ఖర్చులకు పరిష్కారంగా కొంత డబ్బును కేటాయించండి. డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో పాయింట్ ఆఫ్ సేల్ (POS) డివైజ్‌లు పనిచేయకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో చేతిలో ఉన్న నగదుతోనే చెల్లింపులు చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిసారీ క్రెడిట్ కార్డులపై ఆధారపడకుండా మీ అకౌంట్‌లో తగినంత డబ్బు ఉండేలా చూసుకోవాలి.


మోసాలపై అప్రమత్తంగా ఉండటం

చెల్లింపుల కోసం డిజిటల్ లావాదేవీలను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటూ ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. వీటిపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదు. ఓటీపీలు, క్రెడిట్, డెబిట్ కార్డ్ సీవీవీ నంబర్లు, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంక్ ఖాతాల్లోకి లాగిన్ అవ్వడానికి లేదా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడానికి పబ్లిక్ వై ఫై సదుపాయాన్ని ఉపయోగించకూడదు. మొబైల్ ఫోన్‌లలో పాస్‌వర్డ్‌లు, ఇతర రహస్య సమాచారాన్ని సేవ్ చేసుకోవద్దు. వీటిని మోసగాళ్లు సులభంగా యాక్సెస్ చేసే అవకాశం ఉంది. ఫోన్‌లో థెఫ్ట్ డిటెక్షన్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ జాగ్రత్తలతో పాటు మీ క్రెడిట్ రిపోర్ట్, బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. ఏదైనా అసాధారణమైన, అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తే, వెంటనే బ్యాంకులకు ఆ విషయాన్ని తెలియజేయండి.

పొదుపు విలువను గుర్తించాలి
లోన్‌లు ఆర్థిక భారాన్ని పెంచుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మీకు ఎదురయ్యే అవసరాలకు లోన్లపై ఆధారపడకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు సొంతంగా కొంత డబ్బును కేటాయించండి. ఇప్పటి నుంచే పొదుపు చేయడం మొదలు పెట్టండి. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం కొంత డబ్బు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి.  క్లిష్ట సమయాల్లో ఆదుకోవడానికి కనీసం మూడు నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని ప్రత్యేకంగా సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుకోవాలి. రికరింగ్ డిపాజిట్లు, లాక్-ఇన్ వ్యవధి లేని ఇన్వెస్ట్‌మెంట్లను ఎంచుకుంటే పొదుపులతో ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది.
Published by: Nikhil Kumar S
First published: October 29, 2020, 1:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading