రోజురోజుకీ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో చాలామంది నేటితరం దంపతులు పిల్లల్ని కనకుండా, దత్తత తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఒక అనాథకు కుటుంబాన్ని ఇవ్వడంతో పాటు పిల్లలు కావాలనే తమ కోరిక కూడా తీరుతుందనే ఆశతో దత్తత తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే చాలామందికి దత్తత ఎలా తీసుకోవాలనే విషయంపై అవగాహన ఉండదు. మరికొందరైతే గుట్టుచప్పుడు కాకుండా ఓ రహస్య ఒప్పందం ప్రకారం పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు. ఇది చట్టప్రకారం నేరం.
కొన్నాళ్లుగా అనాథపిల్లల దత్తతును ప్రోత్సాహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం కూడా చేస్తున్నాయి. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే ప్రతిఒక్కరూ కచ్చితంగా కొన్ని నియమనిబంధనలు ఆచరించాల్సి ఉంటుంది.
బాలికను దత్తత తీసుకునేటప్పుడు ఉండే నియమాలు, బాలుడిని దత్తత తీసుకునే ముందు పాటించాల్సిన నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా దంపతులిద్దరూ మేజర్లు అయి ఉంటేనే పిల్లలను దత్తత చేసుకునేందుకు అర్హులు. పిల్లల దత్తతకు భార్య అనుమతి తప్పనిసరి.
ఒకవేళ ఒక్కరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న వ్యక్తి, ఎవ్వరినైనా దత్తత తీసుకోవాలనుకుంటే సతీమణులందరి దగ్గరా అనుమతి తీసుకోవాలి. ఒకవేళ భార్య చనిపోయిన వ్యక్తి లేదా బ్రహ్మచారి ఎవ్వరినైనా దత్తతు తీసుకోవాలనుకుంటే... అతని మానసిక స్థితి సరిగా ఉందనే సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒంటరి మహిళలైతే ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అనాథాశ్రమం నిర్వహించే సంరక్షకుడు మాత్రమే దత్తత ఇచ్చేందుకు చట్టబద్ధంగా అర్హుడు. చట్టప్రకారం నమోదు చేయబడిని అనాథాశ్రమం నుంచి మాత్రమే పిల్లలను దత్తత చేసుకోవడానికి వీలుంటుంది.
బాలుడిని దత్తత తీసుకోవాలంటే, ఆ దంపతులకు మగ పిల్లలు ఉండకూడదు. పిల్లలు లేని దంపతులు మాత్రమే దత్తతుకు ప్రధాన అర్హులు. బాలికను దత్తత చేసుకోవాలంటే, వారికి కుమార్తె గానీ, కుమార్తెలు గానీ ఉండకూడదు. అలాగే దత్తతు చేసుకునే బాలిక వయసు కంటే, దత్తత స్వీకరించాలనుకునే తండ్రి వయసు కనీసం 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి.
భార్యభర్తలిద్దరి పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు, ఇద్దరు కలిసి దిగిన పెళ్లి ఫోటోను కూడా దరఖాస్తుతో పాటు సమర్పించాలి. వీటితో పాటు ఆరు వేల రూపాయల డీడీ అప్లికేషన్ ఫారంతో పాటు 40 వేల రూపాయలను దత్తత తీసుకునే సమయంలో సంబంధిత అనాథాశ్రమానికి డీడీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Life Style, World