• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HOW MANY STEPS YOU SHOULD WALK IN A DAY HERE INTERESTING MYTHS AND TRUTHS ABOUT WALKING GH SK

Walking: రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలి? చేస్తే లాభాలేంటి? నడకపై అపోహలు, వాస్తవాలు ఇవే

Walking: రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలి? చేస్తే లాభాలేంటి? నడకపై అపోహలు, వాస్తవాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

Walking Tips: కరోనా తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టిసారించే వారి సంఖ్య పెరిగింది. ఉదయం కనీసం వాకింగ్‌కైనా వెళ్తున్నారు. మరి రోజుకు ఎంత సేపు వాకింగ్ చేయాలి? ఎన్ని అడుగులు నడవాలి? నడకతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వాకింగ్‌పై ఉన్న అపోహలు, వాస్తవాలను ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
కరోనా తరువాత ప్రజల జీవనశైలి చాలా వరకు మారింది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చనే విషయం చాలామందికి అర్థమైంది. దీంతోపాటు వ్యాయామం, బాడీ ఫిట్‌నెస్‌పై ప్రజల దృక్పథం సైతం మారింది. ఒకప్పుడు జిమ్‌లలో బరువులు ఎత్తడం, పార్కుల్లో పరుగెత్తడం వంటివి మాత్రమే ఎక్సర్‌సైజ్ కిందకు వస్తాయని చాలామంది భావించేవారు. కానీ ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణలో నడక ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. నడక అనేది నిరాడంబరమైన వ్యాయామం. నడక లేదా పరుగెత్తడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఈ నేపథ్యంలో అసలు వ్యాయామంలో నడక పాత్ర ఏంటి? ఒక రోజులో ఎన్ని అడుగులు వేస్తే వ్యాయామం పూర్తవుతుంది? నడిచే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు.. తదితర అంశాల గురించి తెలుసుకుందాం.

* నడక ప్రయోజనాలు
నడక సులభమైన వ్యాయామ మార్గం. ఇది ఎలాంటి శిక్షణ అవసరం లేని ఏరోబిక్ వ్యాయామం. నడక వ్యక్తుల శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనికి ఖరీదైన పరికరాలు అవసరం లేదు. దినచర్యపై ఎలాంటి ప్రభావం పడకుండా నడకను ఆస్వాదించవచ్చు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గుండె వ్యాధులు, స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్త పోటు, డిప్రెషన్.. వంటి అనారోగ్యాలను నడక దూరం చేస్తుంది. నడక వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 31 శాతం వరకు తగ్గుతుందని, సీవీడీ సమస్యలతో మరణాల ప్రమాదం 32 శాతం తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఈ ప్రయోజనాలు పొందవచ్చని వెల్లడించారు.

* ఒక రోజులో ఎంత సమయం నడవాలి?
నడక అనేది.. తీవ్రత మధ్యస్థంగా ఉండే వ్యాయామం కిందకు వస్తుంది. వారానికి కనీసం 150 నిమిషాలు చురుకైన నడక వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగని ఈ 150 నిమిషాల పాటు అతిగా కష్టపడాల్సిన అవసరం లేదు. సాధారణ నడకతో ప్రారంభించి, క్రమంగా సమయాన్ని, తీవ్రతను పెంచుకోవచ్చు. ఒక వ్యక్తి వారానికి ఐదు రోజుల పాటు.. ప్రతిరోజు 30 నిమిషాలు లేదా ఖాళీ సమయాల్లో 10 నిమిషాల చొప్పున ఇలాంటి వ్యాయామం చేయాలని మయో క్లినిక్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే సాధారణ వ్యక్తులు ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల నడక ద్వారా మంచి వ్యాయామ ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

* ఎన్ని అడుగులు నడవాలి?
ఆరోగ్యకరమైన వ్యక్తులు గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడుస్తూ.. రోజుకు రెండు నుంచి నాలుగు మైళ్ల దూరం నడవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. సగటున 2,000 అడుగుల నడకను ఒక మైలుగా లెక్కించవచ్చు. ఈ దూరాన్ని ట్రాక్ చేసే పెడోమీటర్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని బెల్ట్‌కు పెట్టుకొని నడిస్తే, దూరం తెలుస్తుంది. కొన్ని రకాల స్మార్ వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లను సైతం ఇందుకు ఉపయోగించవచ్చు. వారానికి కేవలం ఐదున్నర మైళ్ల దూరం నడిచేవారు.. అదికూడా గంటకు రెండు మైళ్ల వేగంతో నడిచేవారు కూడా అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని అధ్యయనాల్లో తేలింది.

అయితే కొంతమంది మాత్రం రోజుకు 10,000 అగుడులను లక్ష్యంగా పెట్టుకుంటారు. సాధారణంగా ఎక్కువ వేగంతో, ఎక్కువ దూరం నడిచేవారికి మంచి వ్యాయామ ఫలితాలు అందుతాయి. వీరికి సీవీడీ, ఇతర అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది. అందువల్ల 10,000 అడుగుల లక్ష్యం సమంజసమే. అయితే ఇతర అనారోగ్యాలు లేనివారు, అది కూడా వైద్యుల సలహాతో మాత్రమే ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఎంత వేగంగా నడవాలి?
నిమిషానికి 80 అడుగుల నడకను సాధారణ వేగంగా.. నిమిషానికి 100 అడుగులను మధ్యస్థం నుంచి చురుకైన వేగంగా పరిగణించాలి. నిమిషానికి 120 అడుగులను ఎక్కువ వేగంగా గుర్తించవచ్చు. అయితే అసలు ఇలాంటి లెక్కలతో సంబంధం లేకుండా, చురుగ్గా నడవడంపై దృష్టి పెట్టడం మంచిది. నడక వంటి మధ్యస్థ తీవ్రత గల వ్యాయామం.. పగటిపూట ఎక్కువగా కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. స్నేహితులతో కలిసి వాకింగ్‌కు వెళ్లడం, లేదా పెంపుడు కుక్కలను పక్కన తీసుకెళ్లడం వల్ల ఎక్కువ దూరం నడవగలుగుతారు. ఈ సమయంలో మ్యూజిక్ వింటూ, నచ్చిన సంగీతాన్ని ఆస్వాదించడం ద్వారా ప్రేరణ పొందవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు