Working During Pregnancy: ఈ సెలబ్రిటీల్లా ప్రసవం ముందు వరకు పని చేయాలంటే ఏం చేయాలో తెలుసా..?

అనుష్క శర్మ, కరీనా కపూర్ (ఫైల్) (image : Instagram)

Pregnancy Tips: గర్భిణులు చాలా చురుకుగా ఉండాలి. అపుడే బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్యం బాగుంటాయి. దీంతోపాటు తల్లి, బిడ్డకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటన్నింటిపై కాబోయే తల్లి అవగాహన పెంచుకోవాలి అంటున్నారు నిపుణులు..

 • News18
 • Last Updated :
 • Share this:
ఇటీవల విరాట్ కోహ్లీ (virat kohli), అనుష్క శర్మ (anushka sharma) దంపతులకు పాప పుట్టింది. మరో సెలబ్రెటీ జంట సైఫ్ అలీఖాన్ (saif ali khan), కరీనా కపూర్ (kareena kapoor) ‌కు రెండోసారి బాబు పుట్టాడు. అనుష్క, కరీనా ఇద్దరూ ప్రసవానికి కొన్ని రోజుల ముందు వరకు తమ పనులు తాము చేసుకోవడంతో పాటు కొన్ని యాడ్ షూట్స్ వంటివి కూడా చేశారు.  తమ వర్కవుట్లు, రోజువారీ అలవాట్ల గురించి అభిమానులతో పంచుకునేవారు. కానీ చాలామంది మహిళలు గర్భధారణ తరువాత.. తొమ్మిదో నెల వరకు చురుకుగా ఉండలేరు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవం వల్ల సాధారణ గర్భిణులు కూడా సెలబ్రిటీల మాదిరిగానే రోజువారీ పనులు, ఉద్యోగాలు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గర్భిణులు చాలా చురుకుగా ఉండాలి. అపుడే బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్యం బాగుంటాయి. దీంతోపాటు తల్లి, బిడ్డకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటన్నింటిపై కాబోయే తల్లి అవగాహన పెంచుకోవాలి అంటున్నారు నిపుణులు..

మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండి, ఎలాంటి అనారోగ్యాలు లేకపోతే తొమ్మిదో నెల వరకు ఉద్యోగాలు, ఇతర పనులు చేయడంలో తప్పులేదు. కానీ వారు ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తప్పకుండా తీసుకోవాలి. మొదటిసారి గర్భందాల్చినవారు తమకు తాము సమయం కేటాయించుకోవడం మంచిది. వీరు ఎల్లప్పుడూ ఇతర పనుల్లో నిమగ్నం కావాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

చురుకుగా ఉండాలి


సహజ ప్రసవం కావాలనుకునేవారు శారీరకంగా చాలా చురుగ్గా ఉండాలి. దీనివల్ల తల్లులు మానసికంగానూ చురుగ్గా, ఉత్తేజంగా ఉంటారు. గర్భధారణ తరువాత తల్లి ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటేనే.. బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది. సానుకూల వాతావరణంలో గడిపే గర్భిణులు ఇతర సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు. కానీ వీరు సాధారణ, రోజువారీ పనులు మానేయాల్సిన అవసరం లేదు. అలాగని శారీరకంగా, మానసికంగా అలసిపోయేంత వరకు పనుల్లో నిమగ్నం కావద్దు.  చేసే పని వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటే.. వెంటనే పనిచేయడం ఆపేయాలి. అన్నీ ఉండాలి కానీ అవసరమైనంత వరకు మాత్రమే ఉండాలని గర్భిణులు గుర్తుంచుకోవాలి. అన్నింటికీ ముందు శరీరం చెప్పేది వినాలి.


ఈ జాగ్రత్తలు ముఖ్యం

 • గర్భధారణ సమయంలో చురుకుగా ఉండాలనుకునేవారు, చివరి నెల వరకు పనిచేయాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 • పని మధ్యలో ఎక్కువసార్లు విరామం తీసుకోవాలి. ఎక్కువ సమయం నిలబడి ఉండటం లేదా  కూర్చోవడం వల్ల వెన్నునొప్పి రావచ్చు. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే పని మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. దీంతోపాటు శరీర భంగిమ ఎప్పుడూ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

 • రెండోసారి తల్లికాబోయే గర్భిణులు మొదటి బిడ్డకు కూడా తగిన సమయం కేటాయించాలి.

 • ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా.. ఎక్కువసార్లు, తక్కువ మోతాదులో తినడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన సమతులాహారం తీసుకోవాలి. సమయం ప్రకారం తింటున్నారో లేదో సరిచూసుకోవాలి.

 • కాళ్లు కాస్త ఎత్తులో పెట్టుకుంటే శరీరానికి ఉపశమనం కలుగుతుంది. ఇందుకు ఫుట్ రెస్ట్ ఉపయోగించాలి. నీళ్లు ఎక్కువగా తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలి.
  జాబ్ ప్రొఫైల్, ఉద్యోగం కోసం ప్రయాణం చేయాల్సిన దూరం, సౌకర్యం.. వంటి వాటి గురించి గైనకాలజిస్ట్‌తో చర్చించి ఆఫీస్ కి వెళ్లడం గురించి ఒక నిర్ణయానికి రావాలి.

 • ఆఫీసుకు వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటే.. ఇంటి నుంచే పనిచేస్తామని కంపెనీ నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రసూతి సెలవులను కూడా వాడుకోవచ్చు.

 • శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండటం గర్భిణుల జీవనశైలిగా ఉండాలి. శారీరక కదలికలు లేనివారు ఊబకాయం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. చురుగ్గా ఉండటం వల్ల శరీరంలో రక్త ప్రవాహం సరిగ్గా ఉంటుంది. దీంతో ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి శక్తి ప్రసవ సమయంలో ఎంతగానో సహాయపడుతుంది.

Published by:Srinivas Munigala
First published: