మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఓ గొప్ప వరం. గర్భం దాల్చిన సమయంలో ఆడవాళ్లు తమ కన్నా తమకు పుట్టబోయే బిడ్డ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. అందులో భాగంగా వైద్యులు సూచించినట్లు కడుపులో ఉన్న శిశువు కోసం పోషకాహారం ఎక్కువ తీసుకుంటారు. ఇలా అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల చాలామంది గర్భిణులు బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా ఇది ఒబెసిటి (ఊబకాయం)కి కారణం అవుతుంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలి, ఆరోగ్యకర గర్భధారణ పొందడం, ఆ తర్వాత ఊబకాయం బారిన పడకుండా ఆరోగ్యం ఎలా జీవించాలో వివరిస్తున్నారు బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్, ప్రసూతి & గైనకాలజీ, లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్ సప్నా లుల్లా.
* ఒబెసిటీ అంటే
శరీరంలో అధిక కొవ్వు పెరిగి, మరింత పెరగడానికి కారణమయ్యే కాంప్లెక్స్ డిజార్డర్‌నే ఒబెసిటీ లేదా ఊబకాయం అంటారు. సాధారణంగా దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఆధారంగా కొలుస్తారు. అంటే బీఎంఐ 25 నుంచి 29.8 మధ్య ఉంటే వారిని అధిక బరువు ఉన్న వ్యక్తులుగా పరిగణిస్తారు. బీఎంఐ విలువ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారినా ఊబకాయులుగా పేర్కొంటారు.
బీఎంఐ విలువ ఆధారంగా ఒబెసిటీని మూడు రకాలుగా విభజించారు. ఇందులో బీఎంఐ వేల్యూ పెరిగే కొద్దీ ప్రమాద తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. మొదటిది కేటగిరీ 1 ఒబెసిటి. ఇందులో బీఎంఐ విలువ 30 నుంచి 34.9 మధ్య ఉంటుంది. కేటగిరీ 2లో బీఎంఐ విలువ 35 నుంచి 39.9 మధ్య ఉంటుంది. కేటగిరీ 3లో బీఎంఐ విలువ 40 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది.
గర్భధారణ టైంలో ఎక్కువమంది మహిళలు ఊబకాయం బారిన పడొచ్చు. ఇది అనేక రకాల సమ్యలతో పాటు ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలను కూడా పెంచుతుంది. ఈ క్రమంలో వారు ఎదుర్కొనే ప్రధానమైన ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. అది వారితో పాటు పుట్టబోయే బిడ్డలపై కూడా ప్రభావం చూపిస్తుంది.
* అధిక కొవ్వు (Issues with diagnostic procedures)
శరీరంలో కొవ్వుశాతం ఎక్కువగా ఉంటే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ సమయంలో పిండానికి సంబంధించి అనాటమీ సమస్యలు గుర్తించలేరు. ప్రసవ సమయంలో బిడ్డ హృదయ స్పందనను తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది.
* పుట్టుకతో లోపాలు (Birth defects)
ఒబెసిటీ ఉన్న గర్భిణులుకు పుట్టే పిల్లలకు లోపాలు ఉండే అవకాశం ఉంది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, హార్ట్ డిఫెక్ట్స్ వంటి లోపాలతో వారు జన్మిస్తారు.
* అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (Obstructive sleep apnea)
అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వల్ల గర్భిణులు నిద్రిస్తున్న సమయంలో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడతారు. త్వరగా అలిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల అధిక రక్తపోటు, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవచ్చు.
* గర్భధారణ మధుమేహం (Gestational diabetes)
గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే ఇబ్బందే. దీని వల్ల సిజేరియన్ చేయాల్సి వస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న గర్భిణులకు డయాబెటిస్ మెల్లిటస్ కూడా రావచ్చు. ఇది పుట్టబోయే బిడ్డలపై ప్రభావం చూపిస్తుంది.
* మాక్రోసోమియా (Macrosomia)
ఈ స్థితిలో పిండం ఉండవల్సిన దాని కంటే పెద్దగా ఉంటుంది. ఫలితంగా డెలివరీ సమయంలో ఇబ్బందులు వస్తాయి. బర్త్ ఇంజ్యూరీస్ జరిగే అవకాశం ఉంది.
* ప్రీ- ఎక్లంప్సియా (Pre-eclampsia)
గర్భిణుల్లో అధిక రక్తపోటును ప్రీ ఎక్లంప్సియాగా చెబుతారు. గర్భం వచ్చిన నాలుగు నెలల తర్వాత లేదా డెలివరీ అయిన కొంతకాలం తర్వాత ఈ ఇబ్బంది తలెత్తుతుంది. దీని వల్ల బాధిత మహిళల్లో లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ. కొన్నిసార్లు మూర్ఛ రావచ్చు. ఫలితంగా గుండెపోటుకు కూడా దారి తీయవచ్చు. పిండం పెరుగుదలలో సమస్యలు రావచ్చు.
* గర్భధారణ సమయంలో రక్తపోటు (Gestational hypertension)
గర్భిణుల్లో దీన్నే అధిక రక్తపోటుగా పేర్కొంటారు. సాధారణంగా గర్భం దాల్చిన నాలుగు నెలల తర్వాత ఈ సమస్య కనిపిస్తుంది. సమస్య పెరిగితే రాబోయే కాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
* తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ సమస్యల బారిన పడకుండా గర్భిణులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఎన్ సప్నా లుల్లా సూచిస్తున్నారు. దీని వల్ల ప్రసవం సాఫీగా జరగడంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. డాక్టర్ల సూచన మేరకు బరువుకు తగ్గట్టుగా పోషకాహారాన్ని మాత్రమే తీసకోవాలి. అందులో తక్కువ కార్బోహైడ్రేట్, హై ఫ్యాట్ ప్రోటీన్ ఆహారాలను తినాలి. రైస్ తక్కువ తీసుకోవాలి. చక్కెరకు దూరంగా ఉండటం ఉత్తమం. సహజంగా తీపిగా ఉండే ఆహారం, పానీయాలు తీసుకోవచ్చు. అధిక మొత్తంలో తినకుండా, పరిమితంగా తినాలి. కనీసం అరగంట పాటు ఈత కొట్టడం లేదా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయవచ్చు. ఎప్పటికప్పుడు వైద్యుల సలహా తీసుకుంటూ, వారి సూచనల మేరకు నడుచుకోవాలని సప్నా లుల్లా చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Health Tips, Pregnancy