రోజంతా బాగా పనిచేస్తే శారీరకంగా, మానసికంగా అలసిపోతాం. దీంతో శరీరాన్ని రిలాక్స్ చేసేందుకు స్నానం చేస్తుంటారు. అయితే కొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తే.. మరికొందరు చన్నీటి స్నానం చేస్తుంటారు. అయితే ఏ నీటితో స్నానం చేయడం మంచిది? అంటే.. రెండింటితో ప్రయోజనాలు, ప్రతికూలతలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో పరిశీలిద్దాం.
* వేడినీటి స్నానం ప్రయోజనాలు
ఇది నిద్రను మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు గోరువెచ్చని వేడినీటితో స్నానం చేస్తే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. అంతేకాకుండా సులభంగా, త్వరగా నిద్ర పడుతుంది. హాట్ షవర్‌తో శరీరం రిలాక్స్ అవుతుంది. దీంతో త్వరగా నిద్రపడుతుంది. పైగా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. పడుకునే ముందు వేడి నీటి స్నానం చేస్తే, బీపీ తగ్గే అవకాశం ఉంది. దీంతో నిద్రలో సంభవించే స్ట్రోక్స్ లేదా కార్డియాక్ అరెస్ట్‌ల రిస్క్‌లు తగ్గే అవకాశం ఉంది.
* ప్రతికూలతలు
వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడిగా మారే అవకాశం ఉంది. దురద కూడా రావచ్చు. అయితే, 10-15 నిమిషాలకే వేడినీటి స్నానాన్ని పరిమితం చేస్తే వీటిని నియంత్రించవచ్చు. ఎక్కువసేపు ఇలా స్నానం చేస్తే చర్మంలోని తేమ ఆరిపోతుంది. దీంతో చర్మం పొడిగా, పొలుసులుగా మారుతుంది.
* చన్నీటి స్నానం
చాలా మంది చల్లని ట్యాప్ వాటర్‌తో స్నానం చేస్తుంటారు. ముఖ్యంగా వేసవిలో, భారీ ఉష్ణోగ్రతల కారణంగా శరీరం డీహైడ్రేట్ కాకుండా చల్లనీళ్లతో స్నానం చేస్తూ రిలాక్స్ అవుతుంటారు. అయితే సీజన్‌తో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ చల్లని నీళ్లతోనే స్నానం చేసేవారు కూడా ఉన్నారు.
* ప్రయోజనాలు
చల్లనీళ్లతో స్నానం చేస్తే శరీరం అలర్ట్‌గా ఉంటుంది. నూర్పైన్ఫ్రైన్, కార్టిసాల్ వంటి హార్మోన్స్ శరీరంలో విడుదలవుతాయి. అంతేకాకుండా రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. చల్లనీళ్ల స్నానం శరీరం వెచ్చగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. రక్తంలో పెరిగిన కార్టిసాల్ ఎక్కువసేపు మెలకువగా ఉంచేలా చేస్తుంది. చల్లనీళ్ల స్నానం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరుగుతుంది. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ధమనుల్లో కూడా రక్తప్రసరణ పెరిగి గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని మలినాలు, విషపదార్థాలు సులభంగా తొలగిపోతాయి.
వ్యాయామం తర్వాత చల్లనీళ్ల స్నానం చేస్తే కండరాలకు ఉపశమనం లభిస్తుంది. తరచుగా వ్యాయామం చేస్తే కండరాలు నొప్పిగా ఉన్నట్లు అనిపించవచ్చు. దీంతో చల్లనీటి స్నానం చేస్తే నొప్పి తగ్గిపోతుంది. పరిస్థితి మరింత మెరుగుపడటానికి ఐస్ బాత్ కూడా చేయవచ్చు.
చలికాలంలో ఉదయాన్నే చల్లనీళ్లతో స్నానం చేస్తే శరీరం బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది. దీంతో శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది. ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్‌ను పీల్చుకుంటాం. అంతేకాకుండా గుండె కొట్టుకునే వేగం పెరిగి శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. దీంతో ఆ రోజుకు కావాల్సిన శక్తి శరీరానికి అందుతుంది. ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు చన్నీళ్లతో స్నానం చేస్తే. ఒత్తిళ్లన్నీ మాయమై మానసిక ప్రశాంతత సొంతమవుతుంది.
* ప్రతికూలతలు
చల్లనీళ్ల స్నానంతో మీరు చల్లని అనుభూతిని ఫీల్ అవ్వవచ్చు. ఇలా ఎక్కువ సేపు ఉండవచ్చు. దీంతో చేతులు, కాళ్లు చల్లబడే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cold water, Health, Hot, Water