మన దేశంలో హనీమూన్ డెస్టినేషన్ అంటే గుర్తొచ్చే పర్యాటక ప్రాంతాల్లో కేరళ ముందుంటుంది. పశ్చిమ కనుమల్లో విస్తరించి.. పచ్చని రంగేసినట్లు ఉండే ఈ ప్రాంతానికి భారత్‌తో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బీచ్‌లు, హిల్ స్టేషన్లు, టీ గార్డెన్స్, చారిత్రాత్మక కట్టడాలు, బ్యాక్ వాటర్స్‌తో కనిపించే సరస్సులు కేరళకు మాత్రమే ప్రత్యేకం. ఈ సీజన్లో కేరళ పర్యాటక ప్రదేశాలు మరింత అందంగా కనిపిస్తాయి. కొత్తగా పెళ్లిచేసుకున్న జంటలు ఎంజాయ్ చేయడానికి ఆ రాష్ట్రంలో ఆకట్టుకునే హనీమూన్ డెస్టినేషన్స్ ఉన్నాయి. మున్నార్ హిల్ స్టేషన్, కురాకోమ్ బ్యాక్ వాటర్స్, అలెప్పీ హౌస్ బోట్స్ వంటి మూడు ప్రాంతాల్లో గడిపేలా పర్యాటకులు ప్రణాళిక వేసుకోవచ్చు.
1. కురాకోమ్ బ్యాక్ వాటర్స్ (Kuarakom Backwaters)
కేరళలో బ్యాక్ వాటర్స్ విస్తరించిన పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ అరేబియా సముద్ర తీరానికి సమాంతరంగా ఉన్న మలబార్ కోస్ట్‌లో ఉప్పునీటి మడుగులుగా ఉంటాయి. స్థానికులు వీటిని కాయల్స్ అంటారు. వీటన్నింటిలో కురాకోమ్ బ్యాక్ వాటర్స్ పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఇది కొట్టాయం జిల్లాలో ఉంది. ఇక్కడ చిన్న చిన్న నదులు, కాలువలన్నీ కలిసే వెంబనాడ్ (Vembanad) సరస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కొట్టాయం నుంచి కుమారకోం మధ్యలో ఉన్న వెంబనాడ్ సరస్సు ఆక్వా టూరిజానికి ప్రసిద్ధి చెందింది. ఇది మంచి హనీమూన్, పిక్నిక్ స్పాట్. ఇక్కడికి వెళ్లేవారు బోటింగ్, ఫిషింగ్ చేస్తూ అందాలను ఆస్వాదించవచ్చు. వివిధ రకాల చెట్లు, జంతువులను సరస్సు సమీపంలో చూడవచ్చు. విదేశాల నుంచి వచ్చే వలస పక్షులకు నిలయంగా ఉన్న కుమారకోం పక్షుల అభయారణ్యానికి (Kumarakom Bird Sanctuary) కూడా పర్యాటకులు వెళ్లవచ్చు.
2. అలెప్పీ హౌస్బోట్లు (Alleppey Houseboats)
కేరళలో బ్యాక్ వాటర్స్ ఒడ్డున ఉన్న అలెప్పీ మంచి హనీమూన్ స్పాట్. ఇక్కడి నైట్ హౌస్‌బోట్, బీచ్ టూరిజం పర్యాటకులకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక్కడ ఉండే హౌస్బోట్లు.. లగ్జరీ హోటళ్లకు ఏమాత్రం తీసిపోని ఆతిథ్యాన్నిస్తాయి. వీటిల్లో బసచేసే వారికి అన్ని రకాల సదుపాయాలూ అందుబాటులో ఉంటాయి. హౌస్బోట్స్లో రాత్రిపూట బసచేయవచ్చు. వీటిల్లో ఎక్కువసమయం ఉండకూడదనుకునే వారికి బ్యాక్‌వాటర్స్‌పై ఏర్పాటు చేసిన చిన్న క్రూయిజ్ పడవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ బోట్లలో ప్రయాణిస్తూ కేరళ గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన విధానాన్ని చూడవచ్చు.
3. మున్నార్ హిల్ స్టేషన్ (Munnar Hill Station)
హనీమూన్ డెస్టినేషన్స్‌లో మున్నార్ హిల్ స్టేషన్ ముందుంటుంది. ఇది ముద్రపుళ (Mudrapuzha), నల్లత్తన్నీ (Nallathanni), కుండాలే (Kundale) అనే మూడు పర్వతాలు, ప్రవాహాల మధ్యలో ఉంటుంది. స్వతంత్ర్యం రాకముందు ఈ హిల్ స్టేషన్‌ను బ్రిటిష్ వారు వేసవి రిసార్ట్‌గా ఉపయోగించుకునేవారు. ఇక్కడ ఉండే మటుపెట్టి (Mattupetty) అనే పిక్నిక్ స్పాట్ వద్ద పర్యాటకులు బోటింగ్, గుర్రపు స్వారీ చేయవచ్చు. దీనికి దగ్గర్లోనే ఇండో స్విస్ డెయిరీ ఫామ్ (Indo Swiss Dairy Farm) ఉంటుంది. ఇక్కడ 100 జాతులకు చెందిన పశువులు ఉంటాయి. దీనికి సమీపంలో ఎకో పాయింట్ కూడా ఉంటుంది. మున్నార్‌కు వెళ్లేవారు వీటన్నింటినీ చూసి రావచ్చు. ఇది ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. ఇక్కడ ఉండే కాఫీ, టీ తోటలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best tourist places, IRCTC Tourism, Kerala, Tourism