భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దేశంలో విస్తృతమైన కోవిడ్-19 టీకా డ్రైవ్ (Covid19 vaccination drive) కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో వివిధ దేశాలు తమ ప్రయాణ ఆంక్షల జాబితా నుంచి భారతదేశాన్ని తొలగిస్తున్నాయి. ఇండియన్ ట్రావెలర్స్ పై ప్రయాణ ఆంక్షల్లో సడలింపులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇండియన్ ట్రావెల్ సర్వీసెస్ అదిరిపోయే ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ట్రావెల్ పోర్టల్ మేక్మైట్రిప్ (MakeMyTrip), ఇండిగో కలిసి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ (Phuket Island) ఐలాండ్‌కు ఎయిర్ చార్టర్ హాలిడే సర్వీస్‌లను ప్రారంభించాయి. ఈ చార్టర్ హాలిడే ప్యాకేజీలు రూ.40,000 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ప్యాకేజీలు విమానాశ్రయ బదిలీలు (airport transfers), ట్రావెల్ ఇన్సూరెన్స్, థాయిలాండ్ పాస్ అప్లికేషన్ అసిస్టెన్స్, ప్రీమియం ప్రాపర్టీల వద్ద చెక్-ఇన్, చెక్-అవుట్ వంటి ప్రయాణ సేవలను అందిస్తాయి. వీటికి తోడు RT-PCR సహాయాన్ని కూడా అందిస్తాయి. నాస్డాక్-లిస్టెడ్ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ అయిన మేక్మైట్రిప్ సెలెక్టెడ్ డేట్స్ లో డిసెంబర్ నుంచి బుకింగ్‌లను యాక్సెప్ట్ చేస్తుంది.
ఆగ్నేయాసియాలోని ద్వీపాలు ట్రావెలర్స్ కోసం వరుసగా ఓపెన్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఫుకెట్ టూరిస్ట్ ప్లేస్ భారతదేశంతో సహా 63 దేశాల ప్రయాణికులకు తన సరిహద్దులను తెరిచింది. “భారతీయ ప్రయాణికులు దక్షిణాసియాలోని హాలిడే డెస్టినేషన్లకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేం మరిన్ని డెస్టినేషన్లను భారత పర్యాటకులకు మరింత చేరువ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం.” అని మేక్మైట్రిప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విపుల్ ప్రకాష్ తెలిపారు.
ఇండిగోలో చీఫ్ కమర్షియల్ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంజయ్ కుమార్ ప్రకారం, ఇటీవలి కాలంలో చాలా మంది భారతీయ ప్రయాణికులు హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. కరోనా మహమ్మారికి ముందు 2019లో 20 లక్షల మంది భారతీయులు థాయ్‌లాండ్‌లో పర్యటించారు. బంగ్లాదేశ్ పర్యాటకం ద్వారా 80 బిలియన్ భాట్లను ఆర్జించిందని థాయిలాండ్ పర్యాటక, క్రీడా మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. చైనా, మలేషియా ప్రజల తర్వాత థాయ్‌లాండ్‌ను అధికంగా సందర్శించే వారు భారతీయులే కావడం విశేషం.
ఈ హాలిడే ప్రోగ్రాంను థాయ్‌లాండ్ టూరిజం అథారిటీ డైరెక్టర్ ఖున్ వచిరచై సిరిసుంపన్ స్వాగతించారు. ఆగ్నేయాసియా దేశం మళ్లీ భారతీయ ప్రయాణికులను స్వాగతించేందుకు ఎదురుచూస్తోందని సిరిసుంపన్ అన్నారు. రెస్టారెంట్లు, సావనీర్(జ్ఞాపక వస్తువులు అమ్మే) షాపులలో సేవలను అందించే 15,000 సేవా ఏజెంట్లకు సేఫ్టీ & హెల్త్ అడ్మినిస్ట్రేషన్ (SHA) సర్టిఫికేట్ లభించిందని.. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి కఠినమైన పారిశుద్ధ్య చర్యలను అనుసరిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారు.
అక్టోబర్ 29 నోటిఫికేషన్లో ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఇంటర్నేషనల్ షెడ్యూల్డ్ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈ నిషేధం అక్టోబర్ 31న ముగియాల్సి ఉంది కానీ ఆ గడువును డీజీసీఏ పొడిగించింది. డీజీసీఏ ద్వారా ప్రత్యేకంగా ఆమోదం పొందిన అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలు, విమానాలకు ఈ ఆంక్షలు వర్తించవు. కేస్-టు-కేస్ ప్రాతిపదికన కాంపిటెంట్ అథారిటీ ఆమోదించిన మార్గాల్లో విమానాలు నడపడానికి అనుమతి ఇస్తున్నామని ఈ నియంత్రణ మండలి తెలిపింది. అక్టోబర్‌లో అంతర్జాతీయ పర్యాటకుల కోసం ఇండియా ఓపెన్ అయినప్పటికీ.. గత ఏడాది మార్చి 23 నుంచి దేశంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాల రాకపోకలు నిషేధించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.