శరీరం లోపలి అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరొక భాగంలోకి చొచ్చుకు రావడాన్ని హెర్నియా (Hernia) అంటారు. చర్మం, కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లో ఎక్కువగా హెర్నియా వచ్చే అవకాశం ఉంది. చర్మం బయటకు ఉబ్బినట్లు(లంప్) కనిపిస్తుంది. హెర్నియా సాధారణంగా చెస్ట్, హిప్స్ మధ్య అభివృద్ధి చెందుతుంది. ఈ సమస్యలో సాధారణంగా ఎటువంటి లక్షణాలు ఉండవు లేదా చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తాయి. రోగి పడుకున్నప్పుడు లంప్ కనిపించకపోవచ్చు, దగ్గినప్పుడు లేదా ఆ ప్రాంతంలో ఫోర్స్ ఉపయోగించినప్పుడు బయటు కనిపిస్తుంది. హెర్నియా రావడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి వివరించారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ కావేరి హాస్పిటల్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ & జనరల్ సర్జరీ హెడ్ డా.శ్రీధర వి. ఆ వివరాలు తెలుసుకుందాం.
* * హెర్నియా రకాలు
* ఇంగ్వైనల్ హెర్నియా
గజ్జల ద్వారా కొవ్వు కణజాలం లేదా పేగులో కొంత భాగం చర్మం కింద నుంచి బయటకు చొచ్చుకు రావడాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. ఇది ఒక వైపు లేదా రెండు వైపులా కనిపించవచ్చు. ఇది అత్యంత సాధారణంగా సంభవించే హెర్నియా రకం. ప్రధానంగా పురుషులను ప్రభావితం చేస్తుంది. అన్ని రకాల వయసుల వారికి వచ్చే సూచనలు ఉన్నాయి.
* ఫెమోరల్ హెర్నియా
కొవ్వు కణజాలం లేదా పేగులో కొంత భాగం గజ్జలోకి, లోపలి తొడ పైభాగంలో చేరినప్పుడు తొడ హెర్నియాలు సంభవిస్తాయి. ఇంగ్వైనల్ హెర్నియా కంటే తక్కువగా ఈ రకం కనిపిస్తుంది. స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
* ఇంబిలికల్ హెర్నియాస్
కొవ్వు కణజాలం లేదా పేగులో కొంత భాగం బొడ్డు ద్వారా బయటకు చొచ్చుకువచ్చే రకాన్ని బొడ్డు హెర్నియాలు అంటారు. శిశువులలో బొడ్డు తాడు గుండా వెళ్ళే పొత్తికడుపు ద్వారం పుట్టిన తర్వాత సరిగ్గా మూసి వేయకపోతే ఈ సమస్య కనిపిస్తుంది. పెద్దవారిలో కడుపుపై పదేపదే ఒత్తిడి పెట్టడం, గర్భం, ఊబకాయం వల్ల ఈ రకం హెర్నియా కనిపిస్తుంది.
** ఇతర రకాలు
* ఇన్షిషనల్ హెర్నియా
ఇందులో మునుపటి శస్త్రచికిత్స మచ్చ ద్వారా గడ్డ అభివృద్ధి చెందుతుంది.
* ఎపిగాస్ట్రిక్ హెర్నియా
కొవ్వు కణజాలం బొడ్డు, రొమ్ము ఎముక దిగువ భాగం మధ్య ఉంటుంది.
* డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా
డయాఫ్రాగమ్ అనేది ఊపిరితిత్తుల కింద పెద్ద ఆకారంలో ఉండే కండరం. డయాఫ్రాగమ్‌లోని ఓపెనింగ్ ద్వారా కడుపులోని అవయవాలు ఛాతీలోకి కదులుతాయి. ఏదైనా గాయమైనప్పుడు ఇలా జరుగుతుంది. కడుపులో డయాఫ్రాగమ్ సరిగ్గా అభివృద్ధి చెందకపోతే ఇది శిశువులను కూడా ప్రభావితం చేస్తుంది.
* హైయేటస్ హెర్నియా
పొట్టలో కొంత భాగం ఛాతీలోకి, అన్నవాహిక పక్కన డయాఫ్రాగమ్‌లోని ఓపెనింగ్ ద్వారా చొచ్చుకొస్తుంది. సాధారణంగా పెద్దలు, వృద్ధులలో ఈ సమస్య కనిపిస్తుంది. గుండెల్లో మంట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా దీనికి లాప్రోస్కోపిక్ ఫండోప్లికేషన్ సర్జరీ చేయాల్సి వస్తుంది.
* మజిల్ హెర్నియా
కండరంలో కొంత భాగం కణజాలం గుండా చొచ్చుకొస్తుంది. అవి సాధారణంగా క్రీడలు ఆడే సమయంలో కండరాలకు గాయాలు అవ్వడం వల్ల జరుగుతాయి.
* ఉన్న ఆప్షన్ సర్జరీ మాత్రమే
ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడం ద్వారా డాక్టర్ హెర్నియాను గుర్తిస్తారు. సమస్య పరిధిని నిర్ధారించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. రోగ నిర్ధారణ తర్వాత, హెర్నియాను సరిచేయడానికి శస్త్రచికిత్స అవసరమా కాదా అని సర్జన్ నిర్ణయిస్తారు. ఏదైనా హెర్నియా కోసం, ఏ వయస్సులోనైనా, శస్త్రచికిత్స మాత్రమే ఆప్షన్‌గా ఉంది. డే కేర్ ప్రొసీజర్‌లో చేస్తారు. శస్త్రచికిత్స ప్రయోజనాలు, నష్టాలు ఇప్పుడు చూద్దాం.
* సర్జరీ సరైనదో కాదో నిర్ణయించేటప్పుడు పరిగణించే అంశాలు
హెర్నియా రకం: కొన్ని రకాల హెర్నియాలు స్ట్రాంగులేటెడ్ హెర్నియాలు అవుతాయి. పేగు అవరోధానికి కారణమవుతాయి. ఇది చిక్కుకున్న కణజాలానికి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. చికిత్స చేయకపోతే ప్రాణాపాయం కావచ్చు.
హెర్నియా కంటెంట్ : హెర్నియా పేగు, మూత్రాశయం లేదా కొంత భాగాన్ని అడ్డుకుంటుంది.
లక్షణాలు తీవ్రంగా ఉంటే, సాధారణ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తే శస్త్రచికిత్స సిఫార్సు చేయవచ్చు.
* అత్యవసర సందర్బాలు
ఉదరం, హెర్నియా ప్రభావిత ప్రాంతంలో ఆకస్మిక, తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు అత్యవసరంగా వైద్యులను సంప్రదించాలి. మల, మూత్ర విసర్జన కష్టంగా మారడం, తరచూ వాంతులు అవుతున్నప్పుడు, హెర్నియా దృఢంగా మారి బాధ కలిగిస్తున్నప్పుడు అత్యవసర చికిత్స అవసరం.
* సర్జరీ
అన్ని హెర్నియా శస్త్రచికిత్సల్లో నాన్ అబ్‌సార్బబుల్ మెషన్‌ను వినియోగిస్తారు. మెష్‌తో రంధ్రాన్ని మూసివేశాక కుట్టు వేస్తారు.
ఓపెన్ సర్జరీ : ఈ విధానంలో కోత పెట్టి లంప్‌ను తిరిగి కడుపులోకి నెడుతారు.
లాప్రోస్కోపీ: ఇది చాలా త్వరగా పూర్తవుతుంది. కానీ చాలా కష్టం. అనుభవజ్ఞులైన సర్జన్లు నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health care, Health Tips