HERE THE HEALTH BENEFITS OF EATING FISH INSTEAD OF MEAT NS
Heart diseases: మాంసానికి బదులుగా ఇవి తింటే గుండె జబ్బులు దూరం.. తెలుసుకోండి
Heart Attack
మనం తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందనేది తెలిసిన విషయమే. శాకాహారులతో పోలిస్తే మాంసాహారం తీసుకునేవారు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఎక్కువ అని మరో పరిశోధన వెల్లడించింది.
మనం తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందనేది తెలిసిన విషయమే. శాకాహారులతో పోలిస్తే మాంసాహారం తీసుకునేవారు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఎక్కువ అని మరో పరిశోధన వెల్లడించింది. బ్రిటన్‌లో గుండెజబ్బుల ప్రభావానికి గురైన 4,20,000 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తాజా అధ్యయనం చేశారు. శాకాహారులు గుండె సంబంధ వ్యాధులతో చనిపోయే అవకాశం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. గ్లాస్గో విశ్వవిద్యాలయానికి (University of Glasgow) చెందిన నిపుణులు ఈ పరిశోధన చేశారు. ఈ అధ్యయనాన్ని యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు. పెస్కటేరియన్ డైట్(pescatarian diet)ను ప్రోత్సహించడం వల్ల గుండెజబ్బుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. శాకాహారులు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం తినేవారు గుండె జబ్బుల బారిన పడే లేదా చనిపోయే ప్రమాదం ఎంతవరకు ఉందనే వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. దీనికి సంబంధించిన డేటాను UK బయోబ్యాంక్ నుంచి సేకరించారు.
మాంసం ఎక్కువగా తింటే ప్రమాదమే
ఇతరులతో పోలిస్తే మాంసం ఎక్కువగా తినేవారిలో 94.7 శాతం మంది ఊబకాయం, గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. మాంసం ఎక్కువగా తినేవారితో పోలిస్తే చేపలను మాత్రమే ఆహారంలో భాగం చేసుకునేవారు హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఇతర గుండె సంబంధ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం చాలా తక్కువని వారు చెబుతున్నారు. మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు పండ్లు, కూరగాయలు, ఫైబర్, మంచి కొవ్వులు, నీరు అధికంగా లభించే పదార్థాలకు దూరంగా ఉంటున్నారని గుర్తించారు.
శాకాహారులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ, వీరు మాంసంకంటే హానికరమైన ఫాస్ట్‌ఫుడ్, స్మూతీ డ్రింక్స్, పిజ్జాలు.. వంటివి తింటున్నారని గుర్తించారు. కేవలం మాంసాహారం మానేసి, హానికరమైన ఇతర పదార్థాలను తీసుకుంటే అనారోగ్యాల ప్రభావం ఏమాత్రం తగ్గదని వారు చెబుతున్నారు. చేపలను మాత్రమే తినేవారు ఈ రెండు గ్రూపులతో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నారని గుర్తించారు. వీరు ఇంట్లో చేసుకున్న వంటలు తినడానికి ఆసక్తి చూపుతున్నారట.
పరిష్కారం లేదా?
మాంసాహారానికి బదులుగా పెస్కటేరియన్ డైట్ (మాంసానికి బదులుగా కేవలం చేపలు మాత్రమే తినేవారు)ను ప్రోత్సహించాలని గ్లాస్గో యూనివర్సిటీ ప్రొఫెసర్, అధ్యయన బృంద సభ్యుడు జిల్ పెల్ (Jill Pell) చెబుతున్నారు. పెస్కటేరియన్ డైట్‌ను ఫాలోఅయ్యేవారు గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం తక్కువని తమ పరిశోధనలు తేల్చాయని ఆయన చెప్పారు.
మాంసం వినియోగాన్ని తగ్గించడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. చేపలు ఎక్కువగా తినేవారికి పాలిఅన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరానికి అందుతాయి. ఇవి గుండెజబ్బులను సమర్థంగా ఎదుర్కోగలవు. వీటిల్లో ఉండే N-3 కొవ్వులు ఇలాంటి అనారోగ్యాల నుంచి కాపాడతాయని పరిశోధకులు తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.